iDreamPost
android-app
ios-app

అపహరించిన ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా

అపహరించిన ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా

ఎట్టకేలకు చైనా దిగివచ్చింది. తాము అపహరించిన ఐదుగురు భారతీయులను చైనా విడిచిపెట్టింది. ఈ నెల 1న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వేటగాళ్ళు వేటకు వెళ్లగా వారిలో ఐదుగురిని చైనా ఆర్మీ అపహరించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతానికి చెందిన కొందరు దారి తప్పిపోయారు. పొరపాటున వాస్తవాధీన రేఖను దాటి వెళ్లడంతో వారిని చైనా ఆర్మీ అదుపులోకి తీసుకుంది. తప్పించుకున్న కొందరు వేటగాళ్ళు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ పీఎంవోకు ఫిర్యాదు కూడా చేశారు.

కాగా భారతీయుల అపహరణకు సంబంధించి చైనా భద్రతాదళం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తొలుత తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించింది. కానీ ఎట్టకేలకు తమ వద్దనే ఐదుగురు భారతీయులు బందీలుగా ఉన్నారని మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం దారి తప్పి వచ్చిన చైనా పౌరుల విషయంలో భారత సైన్యం వ్యవహరించిన తీరు ప్రశంసలు పొందింది.దారి తప్పిన చైనా పౌరులకు వెచ్చని దుస్తులు, ఆహారం అందించి వారు తిరిగి వెళ్లేందుకు సరైన దారిని భారత సైన్యం చూపించింది..ఈ క్రమంలో భారత పౌరుల అపహరణ విషయంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని అపహరించిన భారతీయులను తిరిగి భారత్ కు అప్పగించడానికి చైనా ఒప్పుకుంది. చైనా సైనికుల చెర నుండి విడుదలైన వారు కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు చేరుకున్నారు.