Idream media
Idream media
చైనా మారుతుంది కానీ చైనా మీద ప్రపంచం యొక్క అభిప్రాయం మాత్రం మారట్లేదు; ఎవరి కారణాలు, ఎవరి పొలిటికల్ రీజన్స్ వాళ్ళవి. ఇది మాత్రమే కరక్ట్ అని కూడా నేను చెప్పదలచుకోవట్లేదు, ఇది పూర్తిగా నేను చదివిన, చూసిన దాని నుంచి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
1988-1991 మధ్య USSR-సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయినప్పుడు ప్రపంచం అంతా అమెరికా తర్వాత సూపర్ పవర్ ఇండియానా, చైనానా అని చర్చలు మొదలుపెట్టారు. నిశితంగా గమనిస్తే 1980-90 ప్రాంతంలో ప్రతి దేశం కొన్ని మౌలికమైన మార్పులు, సవరణలు చేసుకున్నాయి . మన దేశంలో ఆర్ధిక సంస్కరణలు, రష్యాలో రాజకీయ సంస్కరణలు, ఈ విధంగా ప్రపంచం అంతా కొన్ని విధాలైన సంస్కరణలు, సవరణలు జరిగాయి.
సోవియట్ యూనియన్ ముక్కలైన తర్వాత 1991 ప్రాంతంలో ఎక్కడ చూసినా అమెరికా తర్వాత సూపర్ పవర్ ఇండియానా, చైనానా అనే చర్చలే. గ్లోబలైజేషన్ కి తగినట్లు మన దేశం ఆర్ధిక సంస్కరణలు చేపట్టటంతో మొగ్గు మన దేశం పైనే ఉంది. కానీ ఖచ్చితం గా 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే మనం ఏ రంగం లో చైనా కి దరిదాపుల్లో కూడా లేము. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ లో చైనా అమెరికాని కూడా మించిపోయింది. బయోటెక్, స్పేస్ రంగాలలో కూడా చైనా అందరి అంచనాలని మించి అభివృద్ధి చెందింది.
అయితే అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లో జరిగిన అభివృద్ధి విధానం వేరు – చైనాలో అభివృద్ధి జరిగిన విధానం వేరు . రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయా దేశాలు అవలంబించిన పద్ధతులు ప్రధాన కారణం. అది పక్కన పెట్టి మన ఆసియాలో కూడా దక్షిణ కొరియా, మలేషియా లో జరిగిన అభివృద్ధి విధానానికి చైనాలో జరిగిన విధానానికి చాలా తేడా ఉంది.
1990 నాటి చైనా వేరు, ఈ 30 యేండ్లలో చైనా వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధి మరియూ సాంకేతిక పురోగతి వేరు. చైనా సాంకేతిక పురోగతిలో ఎక్కువ భాగం వారి మిలటరీకే క్రెడిట్ ఇవ్వాలి. చైనా సైన్యం అభివృద్ధి చెందుతున్న కొత్త పరిశ్రమలలో భారీగా పెట్టుబడి పెట్టింది , మరియూ అత్యంత సృజనాత్మకంగా ఆలోచన చేసి నిధులు సమకూర్చింది. నిజానికి ఇది అమెరికా నుంచి కాపీ కొట్టిందే . అమెరికాలో సిలికాన్ వ్యాలీని అభివృద్ధి చేసింది అమెరికా డిఫెన్స్ & ఇంటెల్లిజన్స్ విభాగం (ఇది చాలా మందికి తెలియదు).
చైనా ప్రభుత్వం ఎంతో మంది ఔత్సాహికులని ప్రోత్సహించింది. చిన్న ఉదాహరణ: షాంగై లోని ఒక రాష్ట్ర యువ జర్నలిస్ట్ కి ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళటానికి అయినా ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది. ఆ జర్నలిస్ట్ ప్రపంచం లో మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్ ని పరిశీలించి ప్రతి నెలా నివేదిక ఇవ్వాలి, అంతే.
ప్రభుత్వ సహకారం తో సామాన్య చైనా కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే సాధారణ చైనా ప్రజలు అలీబాబా, హువావే, టిక్ టాక్ వంటి చైనా కంపెనీలను జాతీయ గర్వానికి మూలాలుగా చూస్తారు.
చాలా ఎక్కువమంది జనాలు చైనాది నియంతృత్వమని ఇంకేదో అని ఏడుస్తారు. కానీ 2020 జూలై లో ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ యొక్క కెన్నెడీ స్కూల్ జరిపిన ఒక సర్వేలో చైనా ప్రజలు వాళ్ళ ప్రభుత్వం మీద 95% సంతృప్తితో ఉన్నారు.
ఇంకా GDP విషయం తీసుకుంటే ప్రపంచం లో రెండో స్థానం చైనాది. GDP (PPP) తీసుకుంటే 27.3 ట్రిలియన్ డాలర్ల తో ప్రపంచం లో నంబర్ వన్ స్థానం చైనాదే. 1989 నుంచి 2019 వరకు సరాసరి గ్రోత్ రేట్ 9.52% తో చైనా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది.
కేవలం 30 సంవత్సరాల కాలం లో చైనా ఒక ఆర్థిక టైటాన్ గా, సాంకేతిక ఆవిష్కరణలో ప్రపంచ నాయకుడిగా, మరియు సైనిక సూపర్ పవర్ గా మారింది, అదే సమయంలో దాని నిరంకుశ ప్రభుత్వ వ్యవస్థను కఠినతరం చేసింది మరియు లిబరల్ గా ఉండటం చైనాకు వర్తించదనే నమ్మకాన్ని బలపరుస్తుంది.
చాలా మంది చైనీయులు వారి ఆర్థిక విజయానికి ప్రజాస్వామ్యం అవసరం లేదు అని నమ్మడమే కాకుండా, వారి ప్రభుత్వ రూపం (నియంతృత్వం) చట్టబద్ధమైనది మరియు సమర్థవంతమైనదని నమ్ముతున్నారు. ఎక్కువ మంది చైనీయులు తమ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు పాశ్చాత్యుల కంటే మరింత చట్టబద్ధమైనది మరియు సమర్థవంతమైనదని నమ్ముతున్నప్పుడు సుబ్బారావో, పుల్లారావో, జాకబ్ నో, డేవిడ్ నో ఏదో అనుకుంటే ఎవడికి కావాలి…!
ప్రపంచం అంతా యూ ట్యూబ్ (నీవు గొట్టం) వాడుతుంటే చైనీయులు యూకూ వాడుతున్నారు, ప్రపంచం అంతా గూగుల్ వాడుతుంటే చైనీయులు బైదూ వాడుతున్నారు, ప్రపంచం అంతా అమెజాన్ వాడుతుంటే చైనీయులు అలీబాబా వాడుతున్నారు. ప్రపంచం అంతా డెల్ కంప్యూటర్లు వాడుతుంటే చైనీయులు లెనోవో వాడుతున్నారు, ప్రపంచం అంతా ఐ-ఫోన్ వైపు ఉంటే చైనీయులు వన్ ఫ్లస్ తో అదరగొడుతున్నారు, ఇంకా ప్రపంచం అంతా వాట్సాప్ వాడుతుంటే చైనీయులు వీ చాట్ వాడుతున్నారు. ఇవి అన్నీ చైనీయులు తమ సొంత టెక్నాలజీ తో చేసుకున్నవే.
చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ప్రపంచం లో టాప్ 500 సూపర్ కంప్యూటర్స్ లో అమెరికా కంటే చైనా వే ఎక్కువ. ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్ , బయోటెక్ మరియు అంతరిక్ష అన్వేషణలో ప్రపంచ అగ్రగామిగా ఉంది చైనా. చైనా అభివృద్ధి , సాంకేతిక విజయాల్లో కొన్ని మార్కెట్ శక్తులచే నడుస్తున్నాయి . మరికొన్ని అలీబాబా ,టెన్సెంట్, హువావే వంటి సంస్థల సహాయం తో జరుగుతున్నాయి.
చైనా వాళ్ళు చైనా వాళ్ళ లాగా పని చేస్తారు, చైనా వాళ్ళ లాగా జీవిస్తారు. కానీ పాశ్చ్యాత్యుల లాగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు . అదే వాళ్ళ అభివృద్ధికి తారకమంత్రం. పచ్చిగా మాట్లాడుకోవాలనుకుంటే చైనా పీపుల్స్ పార్టీ మరియూ ప్రభుత్వం ఎల్లప్పుడూ చైనా చరిత్ర మరియు మార్క్సిస్ట్-లెనినిస్ట్ ఆలోచన యొక్క ప్రాముఖ్యతను నమ్మింది. పాశ్చాత్య కంపెనీలు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఈ వాస్తవాలని అంగీకరించకుండా చైనాను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని నా వ్యక్తిగత అభిప్రాయం.
చివరిగా ఒక మాట..నేను అమెరికాలో ఒక ఫార్మా కంపనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక చైనా అతనికి నేను మేనేజర్, అతన్ని నేనే ట్రయిన్ చేసి డెవలప్ చేశాను. అతను తిరిగి చైనా వెళ్తే చైనా లో ఒక పెద్ద ఫార్మా కంపనీకి వైస్ ప్రెసిడెంట్ చేశారు. అదే నేను ఇండియా తిరిగి వస్తే దక్కిన మర్యాద,అవకాశాలు స్వల్పం …!
— జగన్
Jagannadh Goud