1967లో ఎన్టీఆర్, కాంతారావు నటించిన చిక్కడుదొరకడు సినిమా వచ్చింది. ఈ సినిమా కథని చంద్రబాబు ప్రేరణగా తీసుకున్నట్టున్నాడు. కాంతారావు తనని తాను దిలీప చక్రవర్తిగా ఊహించుకుని , అమరావతి అనే ఊహాజనిత రాజధానిలో పాలిస్తూ ఉంటాడు. లేని అమరావతిని ఉందని, అందరూ నమ్ముతూ ఉంటారు.
చంద్రబాబు కూడా ఇలాగే ఐదేళ్లూ అమరావతిలో ఏదో జరిగిపోతోందని నమ్మించాడు. సినిమాలో కాంతారావు నిజంగా చక్రవర్తి అనుకుని , అమరావతికి ఎంతో మంది రాజులు కానుకలు పంపుతూ ఉంటారు.
చంద్రబాబు అమరావతిలో కూడా ఏదో జరిగిపోతుందని ప్రజలు కూడా విరాళాలు ఇచ్చారు. అవి ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మామగారి జానపద సినిమా చంద్రబాబుకి ఐడియా ఇచ్చినట్టుంది.
సినిమా గురించి చెబితే బి.విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఇది కనకవర్షం కురిపించింది. జయలలిత, కృష్ణకుమారి హీరోయిన్లు.
మాళవరాజుకి కవలలు పుడుతారు. వాళ్లని చంపేయమని విలన్ త్యాగరాజు తన భటులకి చెబుతాడు. ఆ పని ఏదో తానే చేస్తే సరిపోయేది. అపుడు 3 గంటల కథ లేకుండా పోయేది.
వాళ్లు చెరో చోట పెరిగి , ఆఖరున కలుస్తారు. విడిపోయిన అన్నదమ్ములు తిరిగి కలవడం ఆల్ టైం హిట్ ఫార్ములా.
సినిమా అంతటా ఎన్టీఆర్ మారువేషాలు వేస్తూనే ఉంటాడు. తొడ కొట్టుకుని “ఐసరా బజ్జా” అంటూ ఉంటాడు. జయలలిత మహారాణి అయినప్పటికీ ఆమె కూడా మారువేషంలో డ్యాన్స్‌లు చేస్తూ ఉంటుంది. మాస్‌కి నచ్చే మసాలా తప్ప దీంట్లో కథంటూ ఏమీ లేదు.
అంజిగాడు ఉన్నా కామెడీ లేదు. ప్రచండుడిగా సత్యనారాయణ విలనీ కూడా అంతంత మాత్రమే. ఉన్నదల్లా జయలలిత, కృష్ణకుమారి అందం, మంచి పాటలు.
విఠలాచార్యకి వచ్చే చిత్రవిచిత్రమైన ఊహలన్నీ సినిమాలో ఉంటాయి. లాజిక్ అనే మాటే నచ్చదు ఆయనకి. పగలంతా కష్టపడి, సాయంత్రం పావలా డబ్బులిచ్చి సినిమా చూసేవాడికి కావాల్సింది మ్యాజిక్కే తప్ప లాజిక్ కాదని ఆయన నమ్మాడు.
అదే నిజమని జనం నిరూపించారు కూడా.