iDreamPost
iDreamPost
ఒక సామాజికవర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్ అయిన ఉదంతం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే వ్యక్తి ఒక లేఖతో కలకలం రేపారు. తన మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతికే ఆయన లేఖ రాశారు. తన మరణానికి, ఎన్నికలకు లింకు పెట్టడం విశేషం. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలు వినియోగించేలా ఆదేశాలైనా ఇవ్వండి లేదా చనిపోయేందుకు తనకు అనుమతి అయినా ఇవ్వండి అని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ భాఘేల్ రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం
ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంలు)పై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాసిన లేఖలో నందకుమార్ పేర్కొన్నారు. ఓటర్లను జాగృతం చేసే రాష్ట్రీయ మత్ దాతా జాగృతి మంచ్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆ హోదాలో రాసిన లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. పౌరుల రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి. పౌరుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. చివరికి ఈవీఎంల వల్ల తమ ఓటు ఎవరికి వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి వ్యవస్థలో బతకాలని నాకు లేదు. పాత పద్ధతిలో ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించేలా ఆదేశాలు ఇవ్వండి.. లేదా జాతీయ ఓటరు దినోత్సవంగా జనవరి 25న నేను మరణించేందుకైనా అనుమతి ఇవ్వండి అని రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతిగా రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన మిమ్మల్ని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని నందకుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
ఒక వర్గాన్ని కించపరిచినందుకు గతంలో అరెస్టు
నాలుగు నెలల క్రితం గత సెప్టెంబరులో బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నందకుమార్ అరెస్ట్ అయ్యారు. బ్రాహ్మణులు బయటివారని, విదేశీయులని.. వారు తమను తాము సంస్కరించుకోవాలని వ్యాఖ్యానించారు. లేనిపక్షంలో గంగ నుంచి ఓల్గాకు వెళ్లడానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో అప్పట్లో పోలీసులు నందకుమార్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పట్లో దీనిపై ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాఘేల్ స్పందిస్తూ కుమారుడిగా తన తండ్రిని గౌరవిస్తానని, కానీ చట్టానికి ఎవరూ అతీతులు కారని ప్రజాభద్రతకు భంగం వాటిల్లితే ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.