తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెరాస ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదని భాజపా నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించింది. పిటిషనర్‌తో పాటు, చెన్నమనేని రమేశ్ నుంచి కూడా వివరాలు సేకరించిన భారత పౌరసత్వ విభాగం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ చట్టంలోని 10(2),10(3)అంశాలను పరిగణలోకి తీసుకుంది. 5(1)ఎఫ్ ప్రకారం పౌరసత్వ దరఖాస్తు చేసుకునే సమయానికి, విదేశీ పర్యటనలు ఏమైనా చేసారా అన్న విషయాన్నీ పరిగణలోకి తీసుకున్నారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, రమేశ్ ఈ దేశంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అమెరికా నుంచి గతంలో ఆయన వీసా పొందే సమయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు అమెరికా వెళ్లకుండా వీసాను పునరుద్ధరించుకోకుండా వ్యవహరించారని తెలిపింది. తప్పుడు సమాచారంతో భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం రమేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎలాంటి పదవులు పొందడానికి ఆస్కారం లేకుండా హోంశాఖ ఉత్తర్వుల్లో పొందుపరిచింది.
ఇదీ వివాదం
2009 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై చెన్నమనేని రమేష్ విజయం సాధించారు. అయితే చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని అతని ఎన్నిక చెల్లదని ఆది శ్రీనివాస్ 2010 లో హైకోర్టు లో కేస్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు రమేష్ భారత పౌరుడు కాదని 2013 లో తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ చెన్నమనేని సుప్రీంకోర్ట్ కు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈలోపు 2014 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్నమనేని రమేష్ గెలుపొందారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం గురించి 3 నెలల్లో తేల్చమని సుప్రీం కోర్ట్ కేంద్ర హోమ్ శాఖను ఆదేశించింది. కేంద్ర హోమ్ శాఖ వివరాలు పరిశీలించి చెన్నమనేని పౌరసత్వం చెల్లదని తీర్పు ఇచ్చింది. చెన్నమనేని తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విని తీర్పును త్వరగా వెల్లడించాలని హైకోర్టు ఆదేశించగా కేంద్ర హోమ్ శాఖ చెన్నమనేని భారత పౌరసత్వానికి అనర్హుడని తేల్చింది.
తాజా తీర్పుతో బీజేపీ నేత ఆది శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేసారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. తాజా పరిణామంతో టిఆర్ఎస్ పార్టీ ఆందోళనలో పడింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తానని చెన్నమనేని పేర్కొన్నారు.