గత ఏడాది భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకుని ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ వేసుకున్న హీరో నితిన్ కొత్త సినిమా చెక్ ఈ నెల 19న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో మొదలై అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. టిపికల్ స్క్రీన్ ప్లేతో విలక్షణ చిత్రాలు తీస్తారని పేరున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు కావడంతో చెక్ మీద ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఇంతకు ముందు వచ్చిన టీజర్ ఆసక్తి రేపేలా ఉండటంతో ట్రైలర్ మీద కూడా మంచి హైప్ వచ్చేసింది. ఇందాక ఆన్ లైన్ వేదికగా దీన్ని రిలీజ్ చేశారు.
టెర్రరిస్టుగా ముద్రపడ్డ ఆదిత్య(నితిన్) చెస్ ఆడుకుంటూ జైలులో రోజులు లెక్కబెట్టుకుంటూ ఉంటాడు. అతనికి స్ఫూర్తినిస్తూ ఉంటాడు ముసలివాడైన తోటి ఖైదీ(సాయి చంద్). అయితే ఆదిత్య తప్పు చేయలేదని నమ్మిన ఓ కుర్ర లాయర్(రకుల్ ప్రీత్ సింగ్)అతని కోసం కోర్టులో వాదించేందుకు సిద్ధమవుతుంది. జైలర్(సంపత్ రాజ్)తో మొదలుకుని కారాగారంలో అందరూ తననే టార్గెట్ చేసిన క్లిష్ట పరిస్థితుల్లో ఆదిత్య తనకు బాగా పట్టున్న చెస్ ని గొప్ప ప్లేయర్స్ తో ఆడే అవకాశం దక్కించుకుంటాడు. మరి బయటికి రాలేని ఈ చక్రవ్యూహం నుంచి ఎలా బయట పడ్డాడు అనేదే కథగా కనిపిస్తోంది.
హంగులకు కాకుండా నటనకు ఎక్కువ స్కోప్ ఇచ్చే ఖైదీ పాత్రలో నితిన్ కొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్, ప్రియా వారియర్ క్యారెక్టర్లు కూడా రెగ్యులర్ గా అనిపించడం లేదు. చంద్రశేఖర్ యేలేటి మార్కు ఈ చిన్న వీడియోలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో చాలా అరుదుగా వచ్చే జైలు డ్రామాకు చదరంగం ఆటను ముడిపెట్టిన తీరు ఆసక్తి రేపేలా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ ఛాయాగ్రహణం, కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింగల్ లొకేషన్ లో సాగే కథను ఉత్కంఠగా చూపించడంలో కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తోంది. తన రెగ్యులర్ స్కూల్ కు భిన్నంగా నితిన్ ఎంచుకున్న చెక్ ముందు ప్రకటించినట్టు కాకుండా వాయిదా పడి ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది.
Trailer Link @ https://bit.ly/3oH6LpL