iDreamPost
iDreamPost
ఆశ మనిషిని బ్రతికిస్తే.. అత్యాశ అసలుకే మోసం తెస్తుంది. నమ్మేవాడ్ని మోసం చేసేందుకు కేటుగాళ్ళు సదా సిద్ధంగానే ఉంటుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు అనేకానేక మోసాలు వెలుగు చూసాయి. బాధితులను సర్వనాశనం చేసేసాయి.
ఇరీడియం లోహం, రెండు తలల పాము, బియ్యాన్ని ఆకర్షించే చెంబు.. ఇలా అనేక రకాల మోసాలకు తెరలేపుతుంటారు. వీటిని నమ్మి కోట్లు నష్టపోయిన వాళ్ళు కొందరైతే, అన్నీ కోల్పోయి ప్రాణాలు కూడా తీసుకుంటున్న అభాగ్యులు కూడా ఉంటున్నారు. ఈ రీతిలో మోసాలు చేసే వాళ్ళకు ఎప్పుడూ ఏదో ఒక కొత్త అంశం, వస్తువు దొరుకుతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళ అత్యాసఆశనే వీళ్ళ పెట్టుబడిగా మలచుకుని సర్వం దోచేస్తుంటారు.
తాజాగా రెండు తెలుగురాష్ట్రాల్లోనూ రెడ్ మెర్క్యురీ కాయిల్ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 1979 ప్రాంతంలో తయారైన రేడియోలు, టీవీల్లో ఈ రెడ్ మెర్క్యురీ ఉంటుందని, దాన్ని ఇస్తే లక్షలు.. ఇంకాస్త గట్టిగా అడిగితే కోట్లు కూడా ఇస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాట్సాప్,, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఇది విపరీతంగా ఇటీవలి కాలంలో ప్రచారమవుతోంది. గతంలో తెలంగాణాలో ఇటువంటిది విస్తృతంగా ప్రచారం జరగ్గా ఇప్పుడు ఆంధ్రా ప్రాంతంలో ఊపందుకుంది.
ఇది పక్కా మోసం అంటూ దీనికి కౌంటర్‌గా మెస్సేజ్‌లు పెట్టే వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే మోసపుచ్చే మెస్సేజ్ ప్రచారం అవుతున్నంతగా వాస్తవం ఉన్న మెస్సేజ్ ప్రచారానికి నోచుకోవడం లేదు. గతంలో కూడా ఇటువంటి మోసాలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ మోసపుచ్చే ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీనిని నమ్మి పలువురు ఆహావహులు సదరు రేడియోలు, టీవీల కోసం ఆరా తీయడం మానడం లేదు.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటేంటే.. అంత ఖరీదైన వస్తువును పెట్టి అప్పట్లో ఆ వస్తువులు ఎందుకు తయారు చేస్తారు? అన్నది కూడా అమాయకులు ఆలోచించడం లేదు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచీ కూడా వజ్రాలు, బంగారందే ఎక్కువ ధర పలికే రికార్డు. అది ఇప్పటిక్కూడా కొనసాగుతూనే ఉంది. వజ్రాలు, బంగారంతో పాటు ఆధునిక కాలంలో ప్లాటినమ్ నగలు కూడా విలువైనవిగా మార్కెట్‌లో చెలామణీ అవుతున్నాయి. ఇవి కాకుండా కోట్ల విలువచేసే వస్తువులేవీ కృత్రిమంగా తయారు కాలేదు. ఒక వేళ తయారైనా వాటిని రేడియోలు, టీవీల్లో పెట్టే పరిస్థితి లేదు. నలభయ్యేళ్ళ క్రితమే తయారైంది కాబట్టి పురావస్తువుల జాబితాలోకి కూడా అది చేరదు. కొంచెం లాజిక్‌గా ఆలోచిస్తే ఇవన్నీ తోస్తాయి. కానీ ఒకరి తరువాత ఒకరొచ్చి అదిగో వాళ్ళెవరి దగ్గరో అటువంటి టీవీ, రేడియో ఉన్నాయంటే.. ఎక్కడ్నుంచో వచ్చి చూసారంట.. అంటూ జరుగుతున్న ‘అట’ల ప్రచారం భారీగా ఉండడంతో కొంచెం బుర్రతో ఆలోచించేవాళ్ళను కూడా ఆలోచించుకోనీయడం లేదు.
దాదాపు 35 సంవత్సరాలుగా టీవీ మెకానికర్‌గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన చలపతి అనే ఆయన్ను దీని గురించి అడిగితే.. అసలు అటువంటి రెడ్ మెర్క్యురీ అనేది టీవీ, రేడియోల్లోనే ఉండదని తేల్చేసారు. మరి ఇదేం ప్రచారం అంటూ ఆరా తీస్తే.. ఏం చెప్పమంటారండీ బాబూ.. ఒకరా ఇద్దరా ప్రతి రోజూ కనీసం పది మందైనా వచ్చి అడుగుతున్నారు వాటి గురించి అంటూ విసుక్కున్నారు. ఆఖరికి విసుగొచ్చి అసలు ఎవడు కొంటానన్నాడ్రా మీ దగ్గర అని నిలదీస్తే.. ఏమో తెలీదు.. వాళ్ళు అన్నారంటే.. వీళ్ళు అన్నారు అంటే నీళ్ళు నముతున్నారని వివరించారు. దీన్ని బట్టే ఇది పక్కా మోసమని తేల్చేసారు.
ఇటువంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశపడేవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటాడన్న సత్యం నిజమవుతూనే ఉంది. అలా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయడం ఎవ్వరి తరమూ కాకపోవచ్చు.