iDreamPost
android-app
ios-app

వెలుగులోకి వచ్చిన నూతన్ నాయుడి మరో మోసం

వెలుగులోకి వచ్చిన నూతన్ నాయుడి మరో మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని 12 కోట్ల వసూలు

ఇప్పటికే దళితుడి శిరోముండనం కేసులో అరెస్టయిన నిర్మాత, నటుడు,దర్శకుడు నూతన్ నాయుడు అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ పేరుతో పలువురిని ఫోన్ ద్వారా నూతన్ నాయుడు మోసగించడానికి ప్రయత్నాలు చేసినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరు యువకులను నూతన్ నాయుడు మోసగించినట్లు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కాగా ఎస్‌బీఐలో ఉద్యోగాల ఇప్పిస్తానని 12 కోట్లకు పైగా మోసం చేసినట్లు బాధితులు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి మంచి స్నేహితులు. వీరిద్దరు హైదరాబాద్‌లో శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, నూకరాజు సీసీ కెమెరాల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో వీరికి నూతన్‌నాయుడుతో స్నేహం ఏర్పడింది. కాగా ఎస్‌బీఐలో ఉద్యోగాలు ఇప్పస్తానని నూతన్ నాయుడు చెప్పడంతో ఎస్‌బీఐ సౌత్ రీజియన్‌ డైరెక్టర్‌ పోస్టు కోసం శ్రీకాంత్‌రెడ్డి రూ.12 కోట్లు బ్యాంకులో ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు నూతన్ నాయుడు చెల్లించినట్లు బాధితులు ఆరోపించారు.

డబ్బు తీసుకుని రెండేళ్లు గడిచినా తమకి ఉద్యోగాలు రాకపోవడంతో వారు మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెబుతున్నారు. కానీ 12 కోట్ల నగదు నిజంగా నూతన్ నాయుడుకు ఇచ్చారా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నూతన్‌నాయుడుకి సహకరించిన శశికాంత్‌ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.