iDreamPost
iDreamPost
లాక్ డౌన్ వల్ల ఓటిటి విప్లవం ఊపందుకుంటున్న వేళ సదరు సంస్థలన్నీ ప్రేక్షకులను ఎలా పెంచుకోవాలన్న దాని మీదే దృష్టి పెడుతున్నాయి. ఓన్లీ తెలుగు కంటెంట్ పేరుతో అల్లు వారు ప్రవేశ పెట్టిన ఆహా ఇప్పటిదాకా ఓహో అనిపించుకోలేక బాగా స్ట్రగుల్ అవుతోంది. విజయ్ దేవరకొండ లాంటి యూత్ సెలబ్రిటీని పెట్టినా ఫలితం మరీ గొప్పగా లేదు. కొత్త సినిమాలు ఇస్తున్నట్టే ఉంది కాని ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ రేంజ్ లో గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో అయితే ఏవి లేవు. ఉన్నంతలో ఖైది, కనులు కనులను దోచాయంటే మంచి స్పందన దక్కించుకున్నాయి. అయితే అవి డబ్బింగ్ మూవీస్.
వెబ్ సిరీస్ లు అడల్ట్ కంటెంట్ తో నింపుతున్నా పర్వాలేదనే మాట తప్ప ఆశించిన వేగంగా ఆహా యాప్ దూసుకుపోవడం లేదన్న మాట వాస్తవం. అందుకే ఇప్పుడు కొత్తగా ఆలోచించి మిల్కీ బ్యూటీ తమన్నాతో ఒక స్టార్ టాక్ షో ప్లాన్ చేసే ఆలోచనలో ఆహా టీం ఉందట. ఇప్పటికే అల్లు అరవింద్ దగ్గర ప్రతిపాదన ఉంచితే ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.ఇది జనంలోకి బలంగా వెళ్ళాలంటే చిన్నా చితక హీరోలైతే వర్క్ అవుట్ కాదు కాబట్టి ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను ఫస్ట్ సిరీస్ ఎపిసోడ్స్ కు తీసుకువచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నారట. అదే జరిగితే నిజంగా ఇదో సెన్సేషన్ అవుతుంది. ఎలాగూ చెర్రి, బన్నీల మధ్య మంచి బాండింగ్ ఉంది.
ఇద్దరూ కలిసి వస్తే బోలెడు విశేషాలు పంచుకోవచ్చు. అయితే విడివిడిగా చేస్తే ఇంకా ఎక్కువ వ్యూయర్ షిప్ ను దక్కించుకోవచ్చనే స్ట్రాటజీ కూడా ఉందని తెలిసింది. ఇందుకుగానే ఒక్క ఇంటర్వ్యూ కోసం తమన్నాకు అక్షరాల పది లక్షల రెమ్యునరేషన్ మాట్లాడినట్టు సమాచారం. ఇదంతా అధికారికంగా తెలిసింది కాదు కాబట్టి ధృవీకరించలేము కాని మొత్తానికి టాక్ అయితే బలంగా నడుస్తోంది. ఇప్పటిదాకా మంచు లక్ష్మి, ఆలి, రానా లాంటి వాళ్ళ షోలు చూసిన ఆడియన్స్ తమన్నా అంటే కొంచెం స్పెషల్ గా ఫీలవుతారు. అందులోనూ గ్లామర్ హీరొయిన్ కాబట్టి ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ కు సైతం ఆసక్తి ఉంటుంది. మరి చరణ్, బన్నీలు ఆహాకు ఓకే చెప్పి ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చూడతారేమో వేచి చూడాలి.