iDreamPost
android-app
ios-app

మారిన జీవనశైలి – అంతరిస్తున్న కళాసాంప్రదాయం.

మారిన జీవనశైలి – అంతరిస్తున్న కళాసాంప్రదాయం.

వేగంగా మారుతున్న కాల పరిస్థితుల కారణంగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, కళలు,వృత్తి విద్యలు ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి. వేగంగా జరుగుతున్న యాంత్రీకరణ వల్ల అనేక కులవృత్తులు కనుమరుగైపోతున్నాయి. ప్రపంచీకరణ ఫలితంగా జీవనశైలి మారుతోంది.

పూర్వం వారి వారి కుల వృత్తుల లో నిత్యం కష్టపడుతూ సతమతమయ్యేవారు. ఇలాంటి వారికి మానసిక ఉల్లాసం కోసం అనేక కళారూపాలలో ఆహ్లాదం కలిగించే వారు .కానీ నేడు ఆనాటి ఆ కళారూపాలు కనిపించడం లేదు. ఆ కష్టం చేసే వారు కనిపించడం లేదు.

మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు ఇంటర్నెట్ నడిపిస్తోంది. నేడు ప్రతిదీ సాంకేతిక పరిజ్ఞానం నడిపిస్తోంది. 4జీ ,5 జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలా ప్రతిదీ సాంకేతికమయమైంది.

యుగ యుగాలుగా తరతరాల వైభవాన్ని సంతరించు కున్న జానపద కళారూపాలను గురించి, ఈ తరం వారికి చాలమందికి తెలియదనటం ఆతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం. తరగని వైభవం.
రాయలసీమ ఒక నాడు విజయ నగర రాజులు పరిపాలించిన ప్రాంతమిది. ఇక్కడ జానపద కళారూపాలైన బయలు నాటకాలు ప్రదర్శించేవారు కొయ్య బొమ్మలాట, తోలుబొమ్మలాట,జానపద గేయాలనీ జానపద సాహిత్యమనీ, జానపద వీథి నాటకమనీ, బుర్ర కథలనీ, పగటి వేషాలనీ, ఇలా ఎన్నో వందలాది జానపద కళా రూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞాన వినోద వికాసాన్ని కలిగించాయి.

ఆధునిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటి పట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గి పోయారు.

వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో నాటకాలు,రేడియోలు ,
గ్రామఫోన్ రికార్డు, టేప్ రికార్డులు , సి డి లు కనుమరుగైపోయాయి. నేడు హెచ్ డి, 4కె లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో వినోదం నడుస్తోంది.
ఒక నాడు చేతి గడియారం కు ఎంతో విలువ ఉండేది కానీ నేడు చేతి గడియారాలు కనిపించేది కరువైపోయింది. నేడు ప్రపంచం చిన్నదైపోయింది. ప్రపంచమంతా అరి చేతిలో బందీ అయి పోయింది. ఒక చిన్న సెల్ తో ఏ సమాచారం కావాలన్నా ,వినోద కార్యక్రమం కావాలన్నా వస్తోంది.

బొమ్మలాట

కొయ్యబొమ్మలాటలను ప్రదర్శించటం ఒక ప్రత్యేకత, ఈ బొమ్మలు హిందూపురం ప్రాంతంలో తప్ప ఆంధ్రదేశంలో మరెక్కడా కనిపించవు. ప్రక్క రాష్ట్రమైన కర్ణాటకలో వీటి ప్రభావం వుంది. బహుశా ఆ విధంగా ఈ కట్టె బొమ్మల కళాకారులు అటునుంచి ఇటు వచ్చి స్థిర పడి వుండవచ్చును.

ఈ కట్టె బొమ్మలు కళ్ళతోకూడ అభినయం చేయగలంతటి పనితనాన్ని నిపుణులైన గ్రామ వడ్రంగులు తయారు చేయ గలిగే వారు. అది ఖర్చుతో కూడుకున్న పని. ఈ కళారూపం చాల కాలం క్రితమే క్షీణించింది.

బయలు నాటకాలు గ్రామాల్లో విస్తృతంగా కనిపించేవి. రానురాను కనుమరుగయ్యాయి. రంగస్థల నాటకం (డ్రామలు) కు విపరీతమైన ఆకర్షణ ఉండేది. పల్లె లో ఒక డ్రామ మాస్టర్ ను పెట్టుకొని నెలల తరబడి రాత్రి పూట ప్రాక్టీస్ చేసి డ్రామలు వేసేవారు. తెల్లవారుజామున వరకు డ్రామ ఆడేవారు. నేడు ఏపల్లె లో డ్రామాలు కనిపించడం లేదు.

గొల్ల సుద్దులను చెప్పే వారు యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని సుద్దులవారు ప్రచారం చేస్తూ వుంటారు. ఇది మన ప్రాచీన కళారూపం.

ఎరికెల సోదె (గెద్దె)

ఇంటింటికీ తిరిగి జరిగిన విషయాలనూ, జరగబోయే విషయాలనూ సోదె చెప్పే ఎరుకల స్త్రీలు ఇల్లు ఇల్లు తిరిగి అంబా పలుకు, జగదంబా పలుకు, మాయమ్మా పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు అంటూ..సోదే ( గెద్దె)చెప్పేవారు.

బుర్ర కథలు ఒకనాడు మత ప్రబోధానికి, అధ్యాత్మిక తత్వానికి ఉపయోగపడిన జంగం కథలను దేశ భక్తిగాథలను , స్దానిక పెద్దలగురించి , ఎన్నొ చారిత్రక సంఘటనలు గురించి బుర్ర కథలు రూపంలో చెప్పేవారు. తోలుబొమ్మలాట ఇలా అనేక కళారూపాలు కనుమరుగయ్యాయి. నేటి యువతకు వీటి గురించి చాలా వరకు తెలియదు.

హరికథలు ఇంకా అక్కడక్కడ కన్పిస్తున్నాయి. చెక్కభజనలు కోలాటం , పండరిభజనలు , భజన బృందాలు , ఎలపదాలు , ఇసుర్రాయి పాటలు , వరినాటు పాటలు , ఇలా అనేక కళానైపుణ్యాలు నేడు కనుమరుగయ్యాయి.

కుమ్మరి తయారు చేసే కుండలు , కమ్మరి చేసే కొలిమి సామాన్లు , వడ్రంగి చేసే వ్యవసాయ పనిముట్లు , చెరువు నీరు కట్టే నీరుగుట్టు , కళ్లం లో కొచ్చే మేరగాళ్లు , దాసప్పలు , గోరవయ్యలు ఇలా అనేక వృత్తి పనులు,ఉరుములోల్లు ,ఎకనాదమోళ్లు ,పల్లె కళాకారులు నేడు కనిపించేది కష్టమే.

పురాతన వ్యవసాయ విధానాలు గురించి , పల్లెలో ఒకనాటి జీవన విధానం గురించి కూడా నేడు చాలమంది కి తెలీదు. ఇలాంటి విధానాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గూడ(యాతం) సేద్యం చేసి పంటపండించేవారు. గూడ వేయాలంటే ఇద్దరు కావాలి. నేడు గూడ సేద్యం ఎక్కడా కనిపించదు. దాదాపు 50సంవత్సరాల క్రితం ఈవిధానం ఉండేది. బకెట్ ఆకారం లా ఇనుప రేకు తో చేసి రెండు వైపుల చెవులు(రింగ్) బిగించి తాడు కట్టేవారు. చెరొక వైపు తాడు పట్టుకొని గుంతలో నుంచి నీటిని ఎగదోసి పంటలు పెట్టే దే గూడ సేద్యం. కబిలసేద్యం రాకతో గూడ సేద్యం కనుమరుగైంది.

కబిలసేద్యం కోసం పెద్దతోలు తిత్తి ఉండేది దాన్ని కబిల బాన అనేవారు. కబిల బాన కు రెండు తాళ్లు కట్టి బావిలోకి వదిలి శిల వేసేవారు. ఏద్దుల కాడిమాను కు తగిలించి ఎద్దులను బార్లొకి వదిలి తోలేవారు. ఎద్దులు బారిలోకి కిందికి పోతే బావిలో నీళ్లు నింపుకొన్న బాన పైకొచ్చేది కాలువ వైపు మూతి తిప్పి సిల తీస్తే నీళ్ళు కాలువ లోకి వెళ్ళి పంటలకు వెళ్ళేవి. తెల్లవారుజామున 5నుంచి ఉదయం10వరకు కబిల తోలేవారు. ఇది కబిలసేద్యం.

ఆయిల్ ఇంజన్లు రాకతో కబిల సేద్యం కు చరమ గీతం పాడారు.
ఆయిల్ ఇంజన్లు కు డీజిల్ వేసి నీటి తోడుకోవడం జరిగెది. పుల్లీ కి ఇంజన్ కు బెల్ట్ బిగించి ఇంజన్ ఫెడల్ తో తిప్పి గేర్ ఏస్తే టుక్క్ టుక్క్ అని శబ్దం చేస్తు నీళ్ళు పైపు నుంచి బయటకు వస్తుంది. ఇలా యంత్ర సేద్యం ప్రారంభమైంది . నీటిని తోడే వేగం పెరగడంతో భూగర్భజలాలు తగ్గడం ప్రారంభమైంది. కరెంటు మోటార్ రావడం తో ఆయిల్ ఇంజన్ శకం ముగిసింది.

కరెంటు మోటార్ రావడంతో వ్యవసాయ విప్లవం మొదలైంది. స్పీడ్ పెరిగింది. నీళ్లు తోడే వేగం పెరగడం తో బావులు ఎండిపోవడం జరిగింది. దీంతో బావుల సేద్యం బాగ తగ్గిపోయింది. ఇప్పుడు చాలా తక్కువగా కన్పిస్తాయి. బోరు బావుల శకం నేడు రాయలసీమ లో నడుస్తున్న వ్యవసాయ విధానం చూస్తున్నారు. రాబోయే విధానం ఏలా ఉంటాయె చూడాలి.

గ్రామీణ జీవన విధానం ఇలా అనేక మార్పులు సంభవించాయి. మారుతున్న పరిస్థితి కి అనుగుణంగా యాంత్రీకరణ తప్పదు.

Guest writer – చందమూరి నరసింహా రెడ్డి