Idream media
Idream media
బ్రిటిష్ పాలన అంతమొందించడానికి అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా కొంతమంది పోరాడితే, సాయుధ పోరాటమే అందుకు మార్గమని మరికొంత మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి, పోరాటమార్గం ఎంచుకుని అందులో భాగంగా ప్రాణత్యాగం చేసినవారు ఉన్నారు. వీరిలో అగ్రశ్రేణిలో నిలిచిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. నేడు, జులై 23,ఆయన జయంతి.
బాల్యం, విద్యాభ్యాసం
మధ్యప్రదేశ్ లోని భావ్రా గ్రామంలో 1906 జులై 23న జన్మించిన వీరి అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. కొడుకు సంస్కృత పండితుడు కావాలన్న తల్లి కోరిక మేరకు బెనారస్ లోని కాశీ విద్యాపీఠంలో విద్యనభ్యసించాలని వెళ్ళాడు చంద్రశేఖర్. 1921లో మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో దూకాడు. అందులో భాగంగా అరెస్టై, కోర్టులో హాజరు పరచబడినప్పుడు తన పేరు ఆజాద్ అని, తండ్రి పేరు స్వతంత్రత అని, తన చిరునామా జైలు అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి అతని పేరు చంద్రశేఖర్ ఆజాద్ అయింది. అయితే చౌరీచౌరా అనే ఊరిలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా హింస చెలరేగడంతో గాంధీ ఉద్యమాన్ని ఉపసంహరించడంతో ఆజాద్ తీవ్ర నిరాశకు గురయి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా జరుగుతున్న దశలో అతన్ని హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సాయుధ పోరాట సంస్థ ఆకర్షించింది.
సాయుధ పోరాటం
అతిత్వరలో ఆ సంస్థలో చురుకైన కార్యకర్తగా మారాడు ఆజాద్. సంస్థ కార్యక్రమాలకూ, అవసరమైన ఆయుధాలు సమకూర్చుకోవడానికీ తమకు వస్తున్న విరాళాలు సరిపోకపోవడంతో ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రజలు కట్టీన పన్నులు పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్న ఒక రైలుని లక్నో సమీపంలోని కాకోరి అన్న స్టేషన్ లో ఆగస్టు 9,1925 నాడు దోపిడీ చేశారు. ఇందులో అనుకోకుండా ఒక వ్యక్తి మరణించడంతో దోపిడీ కేసు కాస్తా హత్య కేసు కింద మారింది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు అందరు నిందితులని అరెస్టు చేసినా ఆజాద్ మాత్రం దొరకకుండా అఙాతంలోకి వెళ్లిపోయాడు.
హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ నాయకులు కొంతమందిని ఉరిశిక్ష విధించి, మరికొంతమందిని అండమాన్ జైలుకు పంపించి, మరికొంతమందికి జైలుశిక్ష విధించడంతో సంస్థ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. అయితే ఆజాద్ అఙాతంలోనే మిగిలిన సభ్యులను కూడగట్టుకుని, మరింత మందిని చేర్చుకుని ఈసారి హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ పేరిట కార్యక్రమాలు ప్రారంభించాడు.
సాండర్స్ హత్య కేసు
ఇంగ్లాండులోని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి 1928లో జాన్ సైమన్ అధ్యక్షుడుగా ఒక కమీషన్ ను భారతదేశానికి పంపింది. అయితే ఈ కమీషన్లో ఒక భారతీయుడు కూడా సభ్యుడిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ దీనిని బహిష్కరించింది. దేశమంతటా సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇందులో భాగంగా లాహోరులో నల్ల జెండాలు పట్టుకుని శాంతియుతంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తల మీద సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ లాఠీఛార్జి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, స్వయంగా ఆ కార్యకర్తలకు నాయకత్వం వహిస్తున్న లాలా లజపత్ రాయ్ ని పాశవికంగా కొట్టాడు. ఆ దెబ్బలతో ఆసుపత్రిలో చేరిన లజపత్ రాయ్ కొన్నాళ్ళకు మరణించాడు.
దీనికి ప్రతీకారంగా జేమ్స్ స్కాట్ ని హత్య చేయాలని ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నిర్ణయించారు. అయితే వెలుతురు సరిగా లేనందువల్ల స్కాట్ అనుకుని జాన్ సాండర్స్ అనే ఏఎస్పీని భగత్ సింగ్, రాజ్ గురులు కాల్చి చంపి పారిపోతుండగా, వారిని పెట్టుకోవడానికి ప్రయత్నించిన చమన్ లాల్ అనే కానిస్టేబుల్ ని ఆజాద్ కాల్చి చంపాడు.
మరణం
తనను పెట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్న పోలీసులకు దొరకకుండా, సంస్థ కార్యక్రమాలను ఎవరికైనా అప్పగించి, దిశానిర్దేశం చేయడానికి అతి ముఖ్యమైన కొంతమందికి అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్కులో సమావేశం ఉంటుందని సమాచారం అందించాడు ఆజాద్. అయితే వీరభద్ర తివారీ అనే స్నేహితుడు ఆజాద్ ని వెన్నుపోటు పొడిచి ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు.
సమావేశం జరగాల్సిన 27 ఫిబ్రవరి 1931 ఉదయాన్నే పోలీసులు పార్కును చుట్టుముట్టిన విషయం గమనించిన ఆజాద్ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరుపుతూ అప్పటికే సమావేశం కోసం వచ్చి ఉన్న సుఖ్ దేవ్ రాజ్ (సాండర్స్ హత్యలో భాగస్వామి సుఖ్ దేవ్ థాపర్ ఇతను కాదు) తప్పించుకోవడానికి సహాయం చేసి, ముగ్గురు పోలీసులను చంపి, మరికొంత మందిని గాయపరిచి, మిగిలిన చివరి బుల్లెట్ తో తనను తాను కాల్చుకొని చనిపోయాడు.
మరణానంతర గుర్తింపు
చంద్రశేఖర్ ఆజాద్ ప్రాణాలు వదిలిన పార్కుకు ఆయన పేరు పెట్టి, అందులో ఆయన విగ్రహం పెట్టారు భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ల విడుదల చేసింది. ఆయన జీవితం మీద చాలా చలన చిత్రాలు కూడా నిర్మించారు.