iDreamPost
android-app
ios-app

టిడిపి అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం

టిడిపి అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం

ప్రతి పక్షనేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వైఖరిపై గుంటూరు ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ మండిపడ్డారు. చంద్రబాబు మరోసారి రాజధాని నాటకానికి తెరతీశారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని కోసం రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.

13 జిల్లాల అభివృద్ధి గురించి చంద్రబాబు ఆలోచించలేదని విమర్శించారు. కేవలం ఒక్క మండలంలో రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా బాబు ఆలోచనలు మారకపోతే కాలగర్భంలో కలిసి పోతారని హెచ్చరించారు. వ్యాపార లబ్ది కోసం ఆడుతున్న కపట నాటకాన్ని కట్టిపెట్టాలని హితవు పలికారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు అమరావతి అభివృద్ధికి సిఎం వైఎస్‌ జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరి వల్లనే టిడిపి నష్ట పోయిందని అన్నారు.

ఇటివలి టిడిపిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వైఖరిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గర నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల వరకు అందరు చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు.