iDreamPost
iDreamPost
కిట్టయ్య బావా.. అబ్బబ్బ.. బాబుది ఏం మనసండీ.. అదేనండీ బాబూ అంటే మన నారా చంద్రబాబే. ఆయనది ఎంత దొడ్డ మనస్సుకాకపోతే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని సమర్ధవంతంగా నడిపించే శక్తిని భగవంతుడు మీకివ్వాలని మోడీకి ట్విట్టర్‌లో చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారంటే.. ఏంత దో…డ్డ.. మనస్సంటావ్ అన్నాడు మణిగాడు.
అదేంట్రా మణీ.. అదేంటది పదహారు నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఏపీకొస్తే కేసులు పెడతాం, తరిమి కొడతాం.. పెళ్ళాం పిల్లలు లేనోడికి ఏం తెలుస్తుంది.. మట్టి, నీళ్ళు మా ముఖాన కొడతారా.. ఏం తమాషాలుగా ఉందా.. నా తడాఖా ఏంటో చూపిస్తా.. అంటూ మైకుచించుకున్నదీ ఈ బాబేనా అన్న డౌటు వచ్చేలా అలా చెబుత్నాడేంట్రా శుభాకంక్షలు అంటూ నిట్టూర్చాడు కిట్టయ్య.
అదేంటి బావా అలా అంటావు.. అప్పుడవసరం అప్పటిది ఇప్పడవసరం ఇప్పటిది. ఇప్పుడు మోదీతో పనిపడింది కాబట్టి ఆ మాత్రం ప్రయ్నతం చేయడంలో తప్పులేదు కదా అన్నాడు మణి.
అది కాదురా మణీ.. పాఠశాలలను మెరుగుపరుస్తున్నాడు.. వైద్యులను నియమిస్తున్నాడు.. యాభైవేల కోట్లను వివిధ సంక్షేమ పథకాల పేరిట పేదలు, మధ్య తరగతి ప్రజలకు నేరుగా అందజేస్తున్నాడు.. అయినా గానీ ఒక్కసారంటే ఒక్కసారైనా ఏపీ సీయం జగన్‌కు ఎప్పుడైనా ఈ విధంగా చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పాడేంట్రా అన్నాడు కిట్టయ్య.
ఎందుకు చెబుతాడు బావా అంటూ మొదలెట్టాడు మణి.. ఇక్కడేమో ప్రతిపక్షం, అక్కడ (కేంద్రంలో) స్నేహపక్షం?!. మోడీతో అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాడు లేపోతేనా 16 నెలల క్రితం వీడియో క్లిప్పింగ్‌లు మళ్ళీ ఓ సారి వేసుకు చూసి, మర్చిపోయిన తిట్లు ఏమైనా ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసే వాడే అన్నాడు.
ఇదేం పద్దతిరా.. మరీ ఎంత అవసరం ఉంటే మాత్రం, ఇంతిలా దిగజారిపోవాలా? రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలోని కొందరు ముఖ్య నాయకులు కూడా చంద్రబాబు వైఖరిని గమనిస్తూనే ఉన్నారట. అప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని మనందరి దగ్గరకూ వచ్చాడు. ఇప్పుడు మోడీ అవసరం ఉంది కాబట్టి మనల్ని కనీసం ట్విట్టర్‌లో కూడా పలకరించడం లేదు అనుకుంటున్నారట. అంటే రేపు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ గడపతొక్కితే అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటార్రా వాళ్ళు.. అంటూ వివరించాడు కిట్టయ్య..
అదంతా అనవసరం బావా.. ఎప్పుడు ఏది అవసరమో? అది మాత్రమే చేయడం, ఎప్పుడు ఎవరి అవసరం ఎంత వరకు ఉంటుందో అంత వరకూ మాత్రమే పైకెత్తడం చంద్రబాబుకు రాజకీయ పుట్టుకతో వచ్చిన విద్య అని ఆయన ప్రత్యర్ధులు, సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పడం ఎప్పుడూ వినలేదా బావా.. అంటూ ఆగాడు మణి.
అది కాదురా.. నేనే దేశంలో సీనియర్ పొలిటీషియన్‌ని, నన్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి.. అందరికీ నేనే రోల్‌మోడల్ అంటూ చెప్పుకునే పెద్దమనిషి ఈ విధంగా డబుల్ గేమ్ ఆడితే ఎలారా? అన్నాడు కిట్టయ్య.
చంద్రబాబును జనం కూడా బాగానే అర్ధం చేసుకున్నారు బావా.. దీనికి 2019 ఎన్నికలే నిదర్శనం. జనాన్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు ఇచ్చిన పప్పుబెల్లాలను తీసుకుని చక్కగా జగన్ పార్టీకి ఓటేసేసారు.. వాళ్ళు కూడా ఈయన బాటలో నడిచినట్టేగా బావా అంటూ కన్ను గీటాడు మణి.