iDreamPost
android-app
ios-app

ఈ సారి మూడుకళ్ళ సిద్ధాంతం బైటకు తీయాలేమో

  • Published Sep 19, 2020 | 9:36 AM Updated Updated Sep 19, 2020 | 9:36 AM
ఈ సారి మూడుకళ్ళ సిద్ధాంతం బైటకు తీయాలేమో

అవిభాజ్య ఏపీని విడదీసే క్రమంలో ఏ స్థాయిలో ఉద్యమాలు జరిగాయే ఇంకా జనం మర్చిపోలేదు. ఆ ఉద్యమానికి ఎంతగా ప్రాచుర్యం లభించిందో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి రెండుకళ్ళ సిద్ధాంతానికి కూడా అంతే ప్రచారం లభించింది. ఏదో ఒక స్టాండ్‌ వైపు నిలబడకుండా ప్రాంతాన్ని బట్టి స్టాండ్‌ను మార్చుకునేందుకు చంద్రబాబుకు ఈ సిద్ధాంతం బాగానే తోడ్పడిందని చెబుతారు పరిశీలకులు. ఉన్న పళంగా ఏర్పడ్డ ప్రమాదాన్నుంచి కాపాడుకోవడానికి చంద్రన్న వాడిన ఈ అస్త్రం కారణంగా తెలంగాణాలో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఏపీలో అధికారంలోకొచ్చినప్పటికీ, దానిని కొనసాగించుకోలేకపోయింది. అయితే రెండు కళ్ళ సిద్ధాంతం మాత్రం ఇప్పటికీ అటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా చర్చకు వస్తూనే ఉంటోంది.

తాజా ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. ఏర్పాట్లు పూర్తయి, ముహూర్తాలు పెట్టేసుకున్నాక కోర్టు ఉత్తర్వులతో ఆగాల్సి వచ్చింది. అయితే ఈ ప్రయత్నంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌సీపీ మైలేజ్‌ పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు భిన్నంగా పోరాటానికి మద్దతిస్తున్న నేపథ్యంలో అమరావతి మినహా మిగిలిన రెండుచోట్లూ తన ఉనికికే చంద్రబాబు పార్టీ ముప్పు తెచ్చుకునేలా ఉందన్నది రాజకీయవర్గాల టాక్‌. అయితే ప్రతి క్లిష్ట పరిస్థితికి తన వద్ద ఏదో ఒక ఇన్‌స్టెంట్‌ మంత్రాన్ని ఉంచుకునే చంద్రబాబు జగన్‌ విసిరిన మూడు రాజధానుల పాచికను ఏ విధంగా ఎదుర్కొబోతున్నారన్నదానిపై ప్రస్తుతం రాజకీయవర్గాలోల ఉత్కంఠంగానే ఉంది.

గతంలో వాడేసిన రెండు కళ్ళ సిద్ధాంతం మాదిరిగానే మూడు కళ్ళ సిద్ధాందాన్ని తెరపైకి తెస్తారేమోన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే అది ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నది వాస్తవం. తమ పార్టీ అధినేత కేవలం ఒక్క అమరావతిని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండడం వల్ల స్థానికంగా తమను గెలిపించిన జనం నుంచి తీవ్ర విమర్శలు రేకెత్తుతున్నాయన్నది వారి నిశ్చితాభిప్రాయం. అయితే అటు జనాన్ని కాదనుకోలేక, ఇటు అధినేతను ఎదుర్కొలేక సతమతమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలకు కూడా దూరమవుతున్నారు. ఇంకొందరైతే కాడొదిలేసి పక్క పార్టీల్లోకి జంపింగ్‌ల ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. ఇటువంటి క్లిష్టసమయంలో చంద్రబాబు ఒంటికన్ను సిద్ధాంతాన్ని పక్కన పెట్టే మూడు కళ్ళ సిద్ధాంతాన్ని బైటకు తీయాలని వారంతా కోరుకుంటున్నారు. వారికి అత్యవసరం కాబట్టి మూడు కాకపోతే 36 కళ్ళ సిద్ధాంతాన్ని బైటకు తీయమంటారు. కానీ ఆయా ప్రాంతాల్లో జనం ఏ విధంగా స్వీకరిస్తారనన్నదానిపైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం.