iDreamPost
iDreamPost
ఫార్టీ ఇయర్స్ నారా చంద్రబాబునాయుడికి ఇప్పుడు రాజకీయంగా ‘భరోసా’ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. దక్షిణాది రాష్ట్రాలమీద బీజేపీ కన్నుపడిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ పెద్దలు ఇప్పట్నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసేసారు. అధికార పక్షం బలంగా ఉన్న చోట ప్రతిపక్షం స్థానానికి వారు ప్లాన్‌లు వేస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలను బట్టి అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఏపీలో అత్యంతప్రజాదరణ ఉన్న వైఎస్సార్‌సీపీని ఇప్పటికప్పుడు ఏమీ చేయలేమన్న నిర్దారణకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థానం పొందేందుకు టీడీపీనే వారు లక్ష్యంగా చేసుకోబోతున్నారన్న టాపిక్ విస్తృతంగా ప్రచారమవుతోంది.
‘తత్కాల్’ పథకంలో భాగంగా ఇప్పటికిప్పుడు తన స్కిన్‌ను కాపాడుకునేందుకు టీడీపీలో మూలస్థంభాలుగా ఉన్న నాయకులను చంద్రబాబే స్వయంగా బీజేపీలోకి పంపించారన్న టాక్ ఉండనే ఉంది. దీంతో తనను తాను కాపాడుకోవడానికి తన వారిని బీజేపీలోకి పంపించారని, మమ్మల్ని మేం కాపాడుకోవాలంటే మాదారులు మేం వెతుక్కోవాల్సిందేనన్నది ఇప్పుడు ఆ పార్టీలోని పలువురు కీలక నాయకుల నోటి నుంచి విన్పిస్తున్న మాటగా పలువురు చెబుతున్నారు. అంటే పార్టీ అధినేత చూపిన దారిలోనే వారు కూడా పయనిస్తామన్నట్లుగా లీకులిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుజనా చౌదరి, సీయం రమేష్‌ల దారిలోనే ఇప్పటి వరకు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నాయకులు కూడా పయనించేందుకు ఏర్పాట్లు పూర్తయిపోయినట్లుగా చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ అధినాయకత్వం కూడా వీరిని చేర్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా సంకేతాలిస్తోంది. టీడీపీపై ఎటువంటి దయాదాక్షిణ్యాల్లేకుండా వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించేందుకు కార్యాచరణ సిద్ధమైందన్నది పరిశీలకుల భావన. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం ద్వారా బీజేపీ స్పష్టమైన సంకేతాలనే ఇచ్చిందని, ఇక తేల్చుకోవాల్సిందిగా టీడీపీ నాయకులేనన్ని వారి అభిప్రాయం. ఒక పక్క జనంలోకి చొచ్చుకు వెళ్ళలేని వ్యూహ శూన్యత, మరోపక్క కాచుక్కూర్చున్న బీజేపీ.. ఇంకో పక్క తూలనాడుకున్న జాతీయ స్థాయి మిత్రులెవ్వరూ చెయ్యిచ్చి కాపాడేందుకు అవకాశం లేకపోవడం.. వెరసి ప్రస్తుతం చంద్రబాబుకు ‘భరోసా’ కావాల్సిందేనన్నది పలువురి మాట.