Idream media
Idream media
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసుల పునరుద్ధరణ మరోరెండు రోజుల పాటు వాయిదా పడడంతో ఆయన విశాఖ పర్యటన అర్ధంతరంగా ఆగిపోయింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు విశాఖ వెళ్లాలని ఏపీ డీజీపీ అనుమతి కోరారు. ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ డీజీపీకి అనుమతి కోరారు. ఇరు వైపులా అనుమతి అభించినా.. విమాన సర్వీసులు రద్దు కావడంతో చంద్రబాబు షెడ్యూల్ మారిపోయింది.
ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అక్కడ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను పరామర్శించడం, బాధిత గ్రామాలను సందర్శించేలా రూట్ మ్యాప్ విడుదల చేశారు. స్థానిక పార్టీ నేతలతో సమావేశం తర్వాత ఆయన తిరిగి తాడేపల్లి చేరుకోవాలని అనుకున్నారు. అయితే విశాఖ పర్యటనకు బ్రేక్ పడడంతో.. చంద్రబాబు తన తనయుడు లోకేష్‌తో కలసి రోడ్డు మార్గాన కారులో తాడేపల్లికి చేరుకోనున్నారు. డ్రైవర్‌తో సహా చంద్రబాబు, లోకేష్‌లు వచ్చేందుకు డీజీపీ ఈ పాస్ మంజూరు చేశారు.
చంద్రబాబు పర్యటన వాయిదా పడడంతో టీడీపీ నేతలు వైసీపీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చివరి నిమిషంలో బాబు పర్యటన వాయిదా పడేందుకే విమాన సర్వీసులు రద్దు చేశారంటూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు జూమ్ యాప్ ద్వారా నిర్వహించనున్న నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటన ఎప్పుడుటుందన్న అంశంపై స్పష్టత లేదు. త్వరలోనే చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారని అయ్యన్న పాత్రుడు తెలిపారు.