iDreamPost
iDreamPost
చంద్రబాబుని యూటర్న్ బాబు అని ప్రధానమంత్రి మోడీ ఎందుకన్నాడో గానీ అందుకు తగ్గట్టుగానే ఉంటుంది టీడీపీ అధినేత తీరు. అన్నింటా అంతే అన్నట్టుగా సాగుతారాయన. ప్రతీ అంశంలోనూ తాను చెప్పింది దానికి భిన్నంగా వ్యవహరించడమే చంద్రబాబు నైజం. ఇప్పటికే అనేక విషయాల్లో రుజువయ్యింది. తాజాగా ఏపీ బంద్ పేరుతో ఆయనే పిలుపునివ్వడం మరో ఉదాహరణగా కనిపిస్తుంది.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 2016లో ప్రత్యేక హోదా కోసం విపక్షాలు బంద్ కి పిలుపునిచ్చాయి. ఆ సమయంలో చంద్రబాబు వల్లించని నీతులు లేవు. జపాన్ తరహా ఆందోళనలు చేయాలని ఆయన ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. అంతేగాకుండా బంద్ కారణంగా ప్రొడక్టవిటీ దెబ్బతింటుందని, అందుకే బంద్, రాస్తారోక్ వంటి నిరసనలు సరికాదని ఆయన చెప్పేశారు. పైగా బంద్ పాటించడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు పెట్టాలని పోలీసులకు సూచించారు.
అంతా జరిగి ఐదేళ్లు కూడా కాలేదు. అంతలోనే మళ్లీ ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బహుశా నాడు పాలకపక్షం- నేడు ప్రతిపక్షంలో ఉండడమే ఆయన యూటర్న్ కి అసలు కారణం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు బంద్ వల్ల ప్రొడక్టవిటీ దెబ్బతింటుందని, రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ బంద్ కి పిలుపునివ్వడం ఏంటీ. పైగా జపాన్ తరహాలో నిరసనలు చెప్పేందుకు ఎక్కువగా పనిచేసి, ఎక్కువ ఉత్పత్తి చేసి నిరసనలు సాగించాలని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు అందుకు భిన్నంగా సాగడం ఏంటి. ఏదయినా చంద్రబాబు యూటర్న్ బాబు అన్న ముద్రకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. దానిని మరింత బలపరిచేలా సాగుతున్నారు.
బహుశా టీడీపీ అధినేత బంద్ పిలుపుని ఆపార్టీ శ్రేణులు కూడా ఖాతరు చేయకపోవడం వెనుక ఇదో కారణమేమో అనిపిస్తోంది. బంద్ ల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అధికారంలో ఉండగా చంద్రబాబు చెప్పిన మాటను అనుసరించి కనీసం బంద్ చేయడానికి కూడా టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కేందుకు సిద్ధం కావడం లేదు. నిరసనలకు కూడా అనేక మంది మొఖం చాటేస్తున్న తీరు టీడీపీ అధినేత బేలాతనాన్ని బాహాటంగా చాటుతోంది.
Also Read : TDP Bandh-టీడీపీని బేజారెత్తించిన బంద్, బెజవాడలోనే కనిపించని ప్రభావం