దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో థర్ట్ వేవ్ మొదలైందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫస్ట్, సెకండ్ వేవ్ ల కంటే వేగంగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మామూలు కేసులకంటే ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఉండటం టెన్షన్ పెడుతోంది. గత ఏడాది మే నెలలో పీక్స్ లోకి వెళ్లిన కేసులు ఇప్పుడే మళ్ళీ ఆ రేంజ్ కు వెళుతున్నాయి. ప్రస్తుతానికి అయితే రోజుకు రెండున్నర లక్షలకు పైగానే కేసుల నమోదు సాగుతోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు సైతం కరోనా బారిన పడ్డారు. నిజానికి సోమవారం ఆయన కుమారుడు నారా లోకేశ్ కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో చంద్రబాబు టెస్ట్ చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. కరోనా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు.
ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. సాధారణంగా చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్ని గంటలు అయినా మాస్క్ ధరించే ఉంటారు. అయినా సరే ఆయనకు కరోనా సోకింది అంటే రోజూ ఉద్యోగ,వ్యాపార అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్యులు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు ఐసోలేషన్‌లో ఉండటంతో ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటోంది. అందుకే నైట్ కర్ఫ్యూ ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.
Also Read : నారా లోకేష్ కు కరోనా