iDreamPost
android-app
ios-app

TDP Chandrababu – ఆ విధంగా ముందుకు పోతూనే ఉన్నారు..!

  • Published Oct 21, 2021 | 6:11 AM Updated Updated Oct 21, 2021 | 6:11 AM
TDP Chandrababu – ఆ విధంగా ముందుకు పోతూనే ఉన్నారు..!

తెలుగుదేశం పార్టీ తన కళ్ల ముందే ప్రాభవం కోల్పోతుండడం, అంది వస్తాడనుకున్న వారసుడు లోకేశ్‌ అక్కరకు రాకపోవడంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్టు వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారా అన్న అనుమానం జనానికీ కలుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి ఆయన తరచుగా సంయమనం కోల్పోతున్నారు. వయసు మీద పడడం కూడా ఆయనలో అసహనం పాలు పెరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అప్పట్లో అసెంబ్లీలో హఠాత్తుగా స్పీకర్‌ పోడియం ముందు ధర్నా చేయడం గాని, చూపుడు వ్రేలు  చూపుతూ, ఊగిపోతూ మాట్లాడడం గాని, ఇప్పుడు రాష్ట్ర బంద్‌, 36 గంటల దీక్షకు పిలుపు నివ్వడం గాని ఆయనలో పెరిగిన అసహనానికి ఉదాహరణలే. రాజకీయ ఎత్తులకు, కుయుక్తులకు పెట్టింది పేరుగా చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు ఆ స్థాయిలో వ్యవహరించలేకపోతున్నారు. ఆయన వేసే ఎత్తులు సాధారణ జనానికి సైతం అర్థం అయిపోతున్నాయి.

అదే ఎత్తు పదే పదే..

తెలుగుదేశం ఆవిర్భవించిన తొలినాళ్లలో సానుభూతి కోసం డ్రామాలకు తెరతీస్తూ ఆయన వేసిన ఎత్తు ఫలించింది. మల్లెల బాబ్జీ అనే సాధారణ పార్టీ కార్యకర్తను అందుకు పావుగా ఉపయోగించారు. నిండు సభలో అందరూ చూస్తుండగా వేదికపై కూర్చున్న ఎన్టీఆర్‌పై  వెనుక నుంచి మల్లెల బాజ్జీ కత్తితో దాడి చేశాడు. ఎన్టీఆర్‌ చేతి వేలికి గాయం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వెల్లివిరిసి పార్టీకి బాగా మైలేజ్‌ తెచ్చింది. అందుకే అదే సానుభూతి ఎత్తును పదే పదే ఉపయోగిస్తుంటారు. తనకు ఇస్తానన్న కిరాయి గాని, కల్పిస్తానన్న సదుపాయాలు కానీ అందకపోవడంతో మల్లెల బాజ్జీ రోడ్డుకెక్కడంతో ఈ విషయం బయటపడింది. ఆ తర్వాత మల్లెల బాజ్జీ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతిచెందాడు. అలా అనామకులను పావులుగా వాడి రాజకీయం చేయడం, తర్వాత వారిని పట్టించుకోకపోవడం చంద్రబాబు నైజం. అప్పట్లో మాదిరి ఇప్పుడు పార్టీకి సానుభూతి రావడం కోసం, తమపై ప్రత్యర్థులు దాడి చేసేలా రెచ్చగొట్టే రాజకీయం చేశారు.

Also Read : CM YS Jagan – అల్టిమేట్టం జారీ చేసిన సీఎం జగన్‌.. ఇక గీత దాటితే ఇబ్బందులు తప్పవా..?

ఎవరినైనా వాడేస్తారు..

చంద్రబాబు తన అవసరానికి ఎవరినైనా వాడేస్తారనే పేరుంది. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది హరికృష్ణ, మొన్నటికి మొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌ను ఇలాగే వాడేశారు. ఎన్నికల పొత్తుల వేళ అయితే ఒక్కోసారి ఒక్కో పార్టీని ఉపయోగించుకుంటారు. కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను, బీజేపీని, టీఆర్‌ఎస్‌ను, జనసేనను ఈ విధంగా ఆయన తన రాజకీయ అవసరాలకు సమయానుకూలంగా ఉపయోగించుకున్నారు. రాష్ట్ర ప్రజలు అతి గొప్ప మెజార్టీతో ఆశీర్వదించి ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడటానికి కూడా వీలులేని భాషతో విమర్శిస్తే అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊరుకోరని, తిరగబడతారని ఆయనకు తెలుసు. అందుకే పార్టీ నాయకులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా మాట్లాడమని పురమాయించారు. అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య, దూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభిని అందుకు పావులుగా వాడారు.

కుట్రలకు పదును..

విశేష ప్రజాదరణతో పాలిస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబుకు తోచిన ఏకైక ఆలోచన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా చేయడం. అందుకు ఆయన తన రాజకీయ అనుభవన్నంతా రంగరించి ఎత్తులు వేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మత కలహాలకు, కుల సంఘర్షణలకు అవకాశం ఉంటుందేమోనని యత్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం, అంతర్వేదిలో రథం దగ్ధం, దేవతా విగ్రహాల కూల్చివేత, ఇటీవల కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు వంటివి తనకు అనుకూలంగా మలచుకోవాలని చూశారు. అందుకు ఆయనకు ఎల్లో మీడియా కూడా ఇతోధికంగా సహకరించింది. అయినా ఫలించలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ పరుష పదజాలంతో దూషించడం అనే ఎత్తు ఆలస్యంగా అయినా ఫలించింది. టీడీపీ కార్యాలయాల ముందు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని సాకుగా చూపి  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా చేయాలని ఆయన యత్నం!  టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే గవర్నర్‌కు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫోన్లు చేసి ఇక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పడం, శనివారం అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరడం ఇందుకే.

Also Read : Nara Lokesh – అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!

కాలం చెల్లిన ఎత్తులతో రాజకీయం

కుల, మత కలహాలు సృష్టించి ప్రభుత్వాలను కూల్చేయడమనేది కాలం చెల్లిన ఎత్తు. 1970 – 80 దశకాల్లో ఇది బాగా వర్కవుట్‌ అయ్యేది. ఏ రాష్ట్రంలోనైనా మత కలహాలు, ఘర్షణలు జరిగితే కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చేసేది. లేదా రాష్ట్రపతి పాలన విధించేంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో జరిగిన ఈ పరిణామాలు ఆయనను బాగా ఆకర్షించి ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఆయన అవే ఎత్తులను నమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే రాష్ట్రపతి పాలన విధించేయాలని డిమాండ్‌ చేసేస్తున్నారు. ఈయన మాటలను, అనుంగు మీడియా హడావిడిని నమ్మి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తుందని తెగ ఆశ పడుతున్నారు. 

అందుకే బంద్‌, దీక్ష, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ అంటూ వరుసు ఎత్తులతో హంగామా చేస్తున్నారు. ఇటీవలి వివిధ ఎన్నికల ఫలితాల్లో ఈయన ప్రజావిశ్వాసం కోల్పోయారని రుజువైంది. తాజాగా బుధవారం ఆయన ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపును ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈయనపై సొంత పార్టీలోనే నమ్మకం, విశ్వాసం సన్నగిల్తుతోంది. అటువంటి చంద్రబాబు మాటలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకుంటారా? వాస్తవ విరుద్దమైన ఈయన చెప్పే మాటలను విని చర్యలు తీసుకుంటారా! అని ఎవరికైనా సందేహం వస్తుంది. చంద్రబాబుకు మాత్రం రాదు. అందుకే ఆయన ఆ విధంగా ముందుకు పోతూనే ఉంటారు..!

Also Read : TDP Bandh – ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పేలవమైన బంద్ బాబు హస్తిన టూర్ కి అడ్డంకులు కల్పిస్తుందా