iDreamPost
iDreamPost
రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న డిమాండ్ తో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో సభ బ్రహ్మాండంగా జరిగిందని జేఏసీ నేతలతో పాటు టీడీపీ నేతలు జబ్బలు చరుచుకున్నారు. అందరి ఆకాంక్ష అమరావతేనని ఆ సభ ద్వారా చాటి చెప్పామని టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు ప్రకటించుకున్నారు. అయితే టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీని చూస్తే ఆ సభ ఫెయిల్ అయ్యిందని.. అనుకున్నంతగా సక్సెస్ చెయ్యలేకపోయామని అధినేత చంద్రబాబు సహా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. జనసమీకరణలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు కాడి దించేయడమే దీనికి కారణమని భావిస్తున్న అధిష్టానం ఇప్పుడు దానిపై పోస్టుమార్టంకు ఉపక్రమించింది.
కర్త కర్మ క్రియ.. అంతా టీడీపీయే..
ఏ కమిటీ సూచనలు లేకుండా.. ప్రజాభిప్రాయం స్వీకరించకుండా ఏకపక్షంగా చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఒకవర్గానికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో మూడు రాజధానుల ఏర్పాటుకు పూనుకుంది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖలో పరిపాలన రాజధాని, తిరుపతిలో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయించింది. దీనివల్ల తమ వర్గీయుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళనకు గురైన చంద్రబాబు అమరావతికి భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టి.. వారిని రిలే దీక్షలకు ప్రేరేపించారు. తాను తెర వెనుక ఉండి ఆ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ముందుకు నడుపుతున్నారు.
అందులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతికి పాదయాత్ర చేయించారు. యాత్ర మొదలు నుంచి చివరివరకు దారి పొడవునా టీడీపీ నేతలు రైతుల బృందానికి స్వాగత సత్కారాలు, వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా యాత్రలో టీడీపీ కార్యకర్తలు పాల్గొనేలా చేశారు. అలాగే తిరుపతిలో ముగింపు సభ అట్టహాసంగా నిర్వహించి సత్తా చాటాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సభకు చంద్రబాబే ముఖ్య అతిధి అయినందున.. దీన్ని టీడీపీ సభ మాదిరిగానే నిర్వహించాలనుకున్నారు. భారీగా జన సమీకరణకు ప్లాన్ చేశారు. తిరుపతి చుట్టుపక్కల నియోజకవర్గాల నేతలకు ఆ బాధ్యతలు అప్పగించి 30 వేల మందిని తరలించాలని టార్గెట్ పెట్టారు. కానీ సభకు వారు ఆశించిన దానికంటే చాలా తక్కువగా జనం వచ్చారు. దాంతో నిరుత్సాహానికి గురైన చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా పావుగంటలోనే ప్రసంగం ముగించేశారు.
Also Read : విశాఖ వేదికగా మూడు రాజధానుల శంఖారావం ఏర్పాట్లు..?
కారకులపై కారాలు మిరియాలు
జనసమీకరణలో వైఫల్యానికి కారకులెవరో తెలుసుకోవాలని చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలను పురమాయించారు. ఆ మేరకు వివరాలు సేకరించి ఒక నివేదికను అధినేతకు అందజేశారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి బాగానే జనాలను తరలించినా.. సభ జరిగిన తిరుపతితో పాటు పక్కనే ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి జన సమీకరణలో అక్కడి నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ మూడు నియోజకవర్గాల ఇంఛార్జీలు సుగుణమ్మ, బొజ్జల సుధీర్ రెడ్డి, జేడీ రాజశేఖర్ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. సభకు ముందు జరిగిన ర్యాలీ విషయంలోనూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ నేత నరసింహ యాదవ్ తదితరుల తీరు సమంజసంగా లేదని ఫిర్యాదు చేశారు. మిగతా సమయాల్లోనూ పార్టీలో వీరు గ్రూపులు కట్టి బలహీనపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా చంద్రబాబు పోస్ట్ మార్టం ప్రారంభించారని అంటున్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు.