iDreamPost
android-app
ios-app

ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారట! నిజమేనా చంద్రబాబు..?

  • Published Jan 13, 2022 | 4:59 AM Updated Updated Jan 13, 2022 | 4:59 AM
ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారట! నిజమేనా చంద్రబాబు..?

కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో తనకు తానే సాటి అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువగా అంచనా వేసే ఆయన తనకు అనుకూలంగా అనేక అబద్దాలు ఆడేస్తుంటారు. అసెంబ్లీపై అలిగి బయటకు వచ్చేసినప్పటి నుంచీ ఈ అబద్దాల ప్రచారం మరీ ఎక్కువ అయింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీ చాలాసార్లు గెలిచిందని ఇటీవల ఒక అవాస్తవాన్ని ప్రచారం చేశారు.

అయితే చంద్రబాబు హయాంలోని టీడీపీ ఒక్కసారి కూడా పొత్తులు లేకుండా గెలవలేదు అనేది వాస్తవం. ఇప్పుడు తాజాగా మరిన్ని అబద్దాలను ప్రచారంలో పెడుతున్నారు. వివేకానంద జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు మాట్లాడారు. తమ ఐదేళ్ల పాలనలో పది లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇచ్చామని చెప్పుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. 

అన్నీ అవాస్తవాలే..

చంద్రబాబు చేసిన ప్రసంగంలో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవం లేకపోవడం గమనార్హం. ఆయన పాలించిన 2014 నుంచి 2019 మధ్య కేవలం 34 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. అందులో డీఎస్సీ ద్వారా భర్తీ చేసినవి 17, 589 ఉద్యోగాలు కాగా మిగిలినవి ఇతర ప్రభుత్వ శాఖలలో ఖాళీ అయిన పోస్టులు. 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేశామనడం కూడా అమరావతి గ్రాఫిక్స్ లాంటి కట్టుకథ. అసలు అలాంటి ప్రయత్నం ఒకటి చేసిన దాఖలా కూడా లేదు. విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ పేరిట రూ.కోట్ల ప్రజాధనం వృథా చేశారు తప్ప దానివల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఎవ్వరికీ ఉపాధి కల్పించలేదు. బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ, నిరుద్యోగ భృతిగా రూ.2వేల చొప్పున ఇస్తామని నమ్మబలికింది.
తీరా అధికారంలోకి వచ్చాక 
ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

2019 ఎన్నికలకు మూడు నెలల ముందు తాము హామీ ఇచ్చిన విధంగా రూ.2 వేల చొప్పున కాకుండా కేవలం 
రూ. వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చింది. అదికూడా రాష్ట్రంలోని మొత్తం నిరుద్యోగులకు కాకుండా ఎంపిక చేసిన కొద్దిమందికే ఇచ్చింది. ఇవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు కాదు. ప్రజల స్మృతి పథంలో ఉన్నవే. అయినా తన పచ్చ ప్రచార నైపుణ్యంతో జనాన్ని ఏమార్చగలననే ధీమాతో ఇలా అడ్డగోలుగా చంద్రబాబు అబద్దాలు ఆడేస్తున్నారు. ఈ విధంగా ప్రజలను తక్కువగా అంచనా వేయబట్టే 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. అయినా అబద్దాలు ఆడడం అనే తనకు తెలిసిన విద్యను నమ్ముకొని ఆయన ముందుకు పోతున్నారు.

Also Read : పల్నాడులో హత్య అలజడి.. ఆజ్యం పోస్తున్న చంద్రబాబు