iDreamPost
android-app
ios-app

ఆడ‌లేక మ‌ద్దెల ద‌రువు : కుప్పంలో ఓడింది టీడీపీ కాద‌ట‌!

ఆడ‌లేక మ‌ద్దెల ద‌రువు : కుప్పంలో ఓడింది టీడీపీ కాద‌ట‌!

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా, మూడు ద‌ఫాలు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడుకు పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో ఘోర ప‌రాభ‌వం ఎదురైంది, రాష్ట్రమంతా వైసీపీ మ‌ద్ద‌తుదారులే విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుండ‌గా, పార్టీ సింబ‌ల్ లేకుండా జ‌రిగే ఎన్నికలు కాబ‌ట్టి మసిపూసి మారేడుకాయ అన్న‌ట్లుగా గెలిచిన ప్ర‌తి ఒక్క‌రినీ త‌మ పార్టీయే అని చెప్పు‌కుంటూ టీడీపీ నేత‌లు ప‌రువు కాపాడుకునేందుకు ఎన్నో పాట్లు ప‌డుతున్నారు.

అయితే, బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఆ ప‌ప్పులుడ‌క‌లేదు. సుదీర్ఘ‌కాలంగా ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో ఆ పార్టీ నేత‌లెవ‌రో, ఇత‌ర పార్టీకి చెందిన‌వారెవ‌రో అక్క‌డ స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. అందుకే త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ఫ‌లితాల‌ను తారుమారు చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు కానీ, ప‌రువు కాపాడుకోవ‌డానికి వింత మార్గాల‌ను, స‌రికొత్త వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ఎస్ఈసీపై కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజ‌మైన రాజ‌కీయ‌నాయ‌కుడు ఒక‌వేళ ప్ర‌తికూల ఫ‌లితాలు ఎదురైతే ఓట‌మిని అంగీక‌రించాలి. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని మున్ముందు ప్ర‌జ‌ల అభిమానం పొందే ప్ర‌య‌త్నాలు చేయాలి. అందులోనూ ముఖ్య‌మంత్రి వంటి బాధ్య‌త‌లు నిర్వ‌హించిన‌వారు మ‌రింత హుందాగా వ్య‌వ‌హ‌రించాలి. కుప్పం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చంద్ర‌బాబు స్పందించిన తీరు ప్ర‌జాస్వామ్యాన్నే అప‌హాస్యం చేసేదిగా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కుప్పంలో తాము గెల‌వ‌క‌పోవ‌డం కాద‌ని, ప్ర‌జాస్వామ్యం ఓడిపోయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌జాస్వామ్యం ఓడిపోవ‌డం అంటే ప్ర‌జ‌లు ఓడిపోయిన‌ట్లే. అదే పార్టీ మ‌ద్ద‌తుదారులు గెలిస్తే ప్ర‌జాస్వామ్యం గెలిచింది అంటారా? లేదా జ‌గ‌న్ అనుస‌రిస్తున్న తీరు వ‌ల్ల తాము గెలిచామ‌ని చెబుతారా? అనేది అంద‌రికీ తెలిసిందే. తొలి, రెండో ద‌శ ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అంకెల‌ను తారుమారు చేస్తూ టీడీపీ జోరు కనిపించిందని, వైసీపీ పతనానికి ఇదే నాంది అంటూ డైలాగులు చెప్పిన టీడీపీ నేత‌లు కుప్పం వ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఎందుకిలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి. ప్ర‌జ‌ల తీర్పును శిర‌సావ‌హిస్తూ లోపాల‌ను స‌రిదిద్దుకుంటామ‌నో, మున్ముందు మంచి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుస్తామ‌నో చెబితే హుందాగా ఉండేది.

కుప్పం నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు తెలుగుదేశంలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. సోష‌ల్ మీడియాలో వాటిపై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏకగ్రీవాలు పోను 89 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. 74 స్థానాల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలవడం నిజంగా తెలుగుదేశానికి ఊహించ‌ని షాకే. ఆ షాక్‌లో ఉన్న చంద్ర‌బాబు మాట్లాడిన తీరు వినూత్నంగా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం కుప్పంలో వైసీపీ విజయానికి తనదైన లాజిక్ చెప్పారు.

కుప్పంలో వైసీపీ విజయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూనే.. అక్కడ ఆ పార్టీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని సినిమా డైలాగులు కొట్టారు. కాకి లెక్కలు చెప్పే బాబు.. కుప్పంలో సగానికి సగం స్థానాలు గెలిచామని చెప్పుకునే సాహసం మాత్రం చేయలేదు. ప‌నిలో ప‌నిగా ఎస్ఈసీపై కూడా రాళ్లు వేశారు. నిమ్మగడ్డ మూడో విడత ప్రశాంతంగా ముగిశాయని సర్టిఫికెట్ ఇస్తుంటే.. బాబు మాత్రం అదంతా వారి వైఫల్యమేనని తేల్చి చెబుతున్నారు.

ఫ‌లితాలు, చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కుప్పం ప్రజలు చంద్రబాబును ఛీత్కరించారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కుప్పంలో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతగా హామీలను అమలు చేస్తున్నారు.

ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది. గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు. బాబు రాజకీయ జీవితం ముగిసిపోయే సమయం వచ్చింది. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్య ఓటమి అంటారు. వైఎస్సార్‌ సీపీ గెలిస్తే అక్రమం అని గగ్గోలు పెడుతున్నారు. ఆయన విషం చిమ్మేలా ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు మా వైపు ఉన్నందుకు ధన్యవాదాలు’’అని అన్నారు.