టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో పాత వ్యాఖ్యలనే కొత్తగా చెప్పారు. అందరి తప్పులు గుర్తుపెట్టుకుంటున్నానని.. చిత్రగుప్తుడి మాదిరి లెక్కలు రాస్తున్నానని చెప్పారు. వైఎస్సార్ సీపీపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పేశారు. తప్పు చేసిన వారిపై కమిషన్ వేస్తామని.. వారిని శిక్షించే వరకు వదిలి పెట్టను అని ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా శపథం కూడా చేసేశారు.
కేడర్ జారిపోకుండా..
వైఎస్సార్ సీపీ నాయకులపైన, పోలీసులపైన చర్యలు తీసుకుంటామంటే పార్టీ కేడర్‌లో జోష్ పెరుగుతుందనే చీఫ్ ట్రిక్కునే చాలా రోజులుగా ఫాలో అవుతున్న బాబు కుప్పంలోనూ దాన్ని కొనసాగించారు. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో పరువు దక్కించుకోవడానికి, కేడర్ జారిపోకుండా ఉండడానికి తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని పదే పదే చెప్పారు. అందుకు కుప్పం నుంచే తెలుగుదేశం పార్టీ విజయదుందుభిని కొనసాగిద్దామని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చి వారిలో భరోసా నింపే యత్నం చేశారు.
మద్య నిషేధంపై పచ్చి అబద్ధాలు..
మద్యపాన నిషేధం పక్కన పెట్టి.. నాసిరకం బ్రాండ్‌లతో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు బాధపడిపోయారు. జగన్ రెడ్డి వచ్చాడు.. కొత్త బ్రాండ్లు వచ్చాయన్నారు. మద్యం షాపులు ఇష్టానుసారం తెరిచారని ఆవేదన చెందారు. ఆంధ్ర రాష్ట్రానికి బెల్ట్ షాపుల సంస్కృతిని ప్రవేశపెట్టి, ఊరూ వాడా తమ హయాంలో మద్యాన్ని ఏరులై పారించిన బాబు ఈ వ్యాఖ్యలు చేయడం శోచనీయం. దశలవారీగా మద్య నిషేధానికి కట్టుబడిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. మద్యం బాటిల్ కొనాలంటే షాక్ కొట్టేలా ధరలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి అదే విధానం కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో గణనీయంగా మద్యం షాపులు తగ్గాయి. అయినా జనాన్ని తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు యత్నం. మద్యం వినియోగదారులను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే కుయుక్తితో వారికి అనుకూలంగా మాట్లాడడం కూడా రాజనీతే అనుకొనే స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. మద్య నిషేధం కోసం చిత్తిశుద్ధితో కృషి చేసిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు వ్యాఖ్యలు దివాలా కోరు రాజకీయాన్నే సూచిస్తున్నాయి.
రైతుల దివాలా తీశారట
జగన్ ప్రభుత్వంలో రైతులు మొత్తం దివాళా తీశారని చంద్రబాబు అన్నారు. యంత్రాల పరికరాల కోసం తమ ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చామని.. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి లేదన్నారు. విత్తు నుంచి విపణిలో పంటను అమ్ముకొనే వరకు వివిధ రకాలుగా రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాయమందిస్తోంది. రైతు భరోసా, వలంటీరీ వ్యవస్థ, ఆర్బీకేలు, పంట రుణాలు, సున్నా వడ్డీ పథకంతో ఆదుకుంటోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంటున్నాయి. పంటను వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనిపిస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తూ వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అని సర్కారు నిరూపించింది. రెండున్నరేళ్లుగా రైతులు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయం చేస్తున్నారు. బాబు హయాంలోనే సాగు సమ్మె చేసి ఈ వ్యవసాయం మా వల్ల కాదు అని రైతులు కాడి పడేశారు. ఈ వాస్తవాలను మరిపించాలని తన నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పేస్తే జనం ముఖ్యంగా రైతులు నమ్ముతారా?
Also Read : Chandrababu Kuppam Tour – సర్వశక్తులు ఒడ్డుతున్న చంద్రబాబు