2019 ఎన్నికలలో ఘోరంగా ఓడి పోయిన చంద్రబాబు ప్రస్తుతానికి 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి అనేక రకాల ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తమ పార్టీ కేడర్ నిరుత్సాహపడకుండా, చెదిరిపోకుండా ఉండడానికి ఆయన అనేక స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. జమిలీ ఎన్నికలు, జగన్ జైలుకు వెళ్తారు, లాంటి స్టేట్మెంట్స్ అందులో భాగమే. అయితే ఈ రోజు ఆయన చేసిన కామెంట్లు టిడిపి క్యాడర్ లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దేవగుడి వర్గానికి చెందిన నారాయణ రెడ్డి ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని తేల్చి చెప్పారు.
ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని, ఈసారి పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని బాబు స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ స్టేట్మెంట్ మాత్రం పార్టీలో ఉన్న క్యాడర్ ను చెదిరి పోకుండా చేసేందుకు ఇచ్చిన స్టేట్మెంట్ గానే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవడానికి ముఖ్య కారణాలలో ఒకటి అప్పటి వైసిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను అక్రమ పద్దతిలో పార్టీలో చేర్చుకోవడమే కాక వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా.
అప్పటికే పార్టీలో బలంగా ఉన్న నేతలను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ టిక్కెట్లు ఇచ్చారు. దీంతో టిడిపిలో ముందు నుంచి పనిచేస్తున్న వారికి ఎంత కష్టపడినా ఉపయోగం లేదు అనే సంకేతాలు వెళ్లినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే తప్పు తెలుసుకున్న ఆయన ఇప్పుడు ఉన్న నేతలను కాపాడుకుంటూనే ఇక మీదట ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాను అన్నట్లుగా నేతలకు సంకేతాలు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎన్నాళ్ళు ఈ వెన్నపూస పూసిన మాటలు విని ఆ పార్టీ క్యాడర్ మోసపోతూ ఉంటుందో వేచి చూడాలి మరి.
Also Read : Chandrababu, YS Jagan – చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఒక్క మాటలో అభివర్ణించిన వైఎస్ జగన్