iDreamPost
iDreamPost
అధికారంలో ఉండగా తనను గెలిపించిన ప్రజలను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కుప్పంపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి గెలవకపోతే తనతోపాటు టీడీపీ కూడా రాజకీయంగా సమాధి అవడం ఖాయమని గ్రహించిన చంద్రబాబు తరచు నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఆయనలో వణుకు పుట్టించింది. అందుకే ఉనికిపాట్లు పడుతున్నారు. గురువారం కుప్పంలోని దేవరాజపురంలో ఆయన పర్యటించారు. ఎప్పటిలాగే పార్టీ ప్రక్షాళన, కోవర్ట్‌ల ఏరివేత అంటూ హంగామా చేశారు. పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి.. ప్రతి పల్లె తిరుగుతా అన్నీ ప్రక్షాళన చేస్తానని బీరాలు పలికారు. తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదిలి పెట్టనని ప్రాధేయపూర్వకంగా చెప్పుకున్నారు.
తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని అన్నారు. తాను ఎవరినీ వదలి పెట్టనని చెప్పి కార్యకర్తలో ఉత్సాహం నింపాలని యత్నించారు. వైఎస్సార్ సీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పెడతానని హెచ్చరించారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ తనను ఎంతగానో అవమానించిందని చెప్పి సానుభూతి కోసం ట్రై చేశారు. ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇన్ని ఇబ్బందులు, అరాచకాలు ఎప్పుడూ చూడలేదని, అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. ప్రజలను జగన్‌రెడ్డి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఓటీఎస్ ఎవరూ కట్టొద్దు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని సూచించారు.
టీడీపీ మడి కట్టుకుందట!
2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపును తక్కువ చేసి చూపడానికి చంద్రబాబు ఇప్పటి వరకు రకరకాల కారణాలు చూపారు. రాష్ట్రాన్ని వీర లెవల్‌లో అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అసలు ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని కొన్నాళ్లు ఆశ్చర్యం నటించారు. అది గెలుపే కాదని, జగన్‌మోహన్‌రెడ్డి ఫేక్ సీఎం అని మొదట్లో ఆవేశంతో ఊగిపోయేవారు. తనను ఓడించి ప్రజలు చాలా తప్పు చేశారని కొన్నాళ్లు ఓటర్లపై నిందలు వేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధేయపడడం వల్ల వైఎస్సార్ సీపీని గెలిపించారు కానీ లేదంటే టీడీపీయే గెలిచేదని కొన్నాళ్లూ ప్రచారం చేసుకున్నారు. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం వల్ల వైఎస్సార్ సీపీ గెలిచిందని మరికొన్ని రోజులు విమర్శలు చేశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా
దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని, టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే చంద్రబాబు నీతికి కట్టుబడి ఉండడం వల్ల గత ఎన్నికల్లో ఓడిపోయారు కాని ఆయన పార్టీ డబ్బు ఖర్చు చేసి ఉంటే తప్పకుండా గెలిచేదని, పాపం అమాయకుడైన చంద్రబాబు ఆ పని చేయలేకపోయాడని జనం అనుకోవాలని బాబు గారి స్ట్రాటజీ.
పులి శాకాహారంపై ప్రవచించినట్టు!
ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో దొంగతనం చేస్తూ దొరికపోయిన కమెడియన్ బ్రహ్మానందం పోలీసుతో సర్.. దొంగలంటే మనుషుల్లాగే ఉంటారా? అని అమాయకత్వం నటిస్తాడు. అచ్చం అలాగే ఉన్నాయి చంద్రబాబు వ్యాఖ్యలు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీనీ, ముఖ్యమంత్రి పీఠాన్ని కబ్జా చేసిన చంద్రబాబుకు ప్రజల్లో పలుకుబడి శూన్యం. తన పీఠాన్ని నిలబెట్టుకోవడానికి 1995 ఆగస్టు తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో డబ్బును మంచినీళ్లలా ప్రవహింపజేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చిన ఘనుడు చంద్రబాబు అన్నది జగమెరిగిన సత్యం. ఓటుకు నోటు కేసులో ఆడియో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి, కేసీఆర్‌తో బేరం చేసుకొని, హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతిలో తలదాచుకున్న చరిత్ర చంద్రబాబు సొంతం.
అధికారంలో ఉండగా నంద్యాల ఉప ఎన్నికలోనూ, మంగళగిరిలో పుత్రరత్నం లోకేశ్‌ను గెలిపించడానికి డబ్బును, మద్యాన్ని ఏరులై పారించిన చంద్రబాబు పులి శాకాహారంపై ప్రవచించినట్టు ఎన్నికల్లో డబ్బు పంపిణీపై మాట్లాడడమే వింతగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నేళ్లూ నిర్లక్ష్యం చేసినందుకు కుప్పం జనానికి క్షమాపణలు చెప్పి, తనను గెలిపిస్తే వారికి ఏం చేస్తారో చెప్పుకోవడం మానేసి ఇలాంటి కామెంట్లు చేయడం దండగనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాబు స్వభావం అక్కడి ప్రజలకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా లేనిపోని నిజాయతీని, తెచ్చిపెట్టుకున్న ప్రేమను ఒలకబోస్తే మొదటికే మోసం వస్తుంది.