క్షవరం అయితేగాని వివరం రాదని సామెత. కుప్పం మున్సిపాలిటీలో దారుణ పరాభవంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి తత్త్వం బోధపడింది. ఏడు పర్యాయాలు వరుసగా గెలిపించిన కుప్పం నియోజకవర్గం తనకు కంచుకోటగా ఇన్నేళ్లూ బాబు భావించారు. కొన్ని సందర్భాల్లో నామినేషన్ వేయడానికి కూడా ఆయన స్వయంగా రాకపోయినా, ప్రచారం చేయకపోయినా అక్కడ గెలుస్తూ వచ్చారు. అయితే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పరాభవం అనంతరం మేలుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని ఆయన సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన పట్ల సొంత నియోజకవర్గంలో ఎంత అసంతృప్తి ఉందో అర్థమైంది. తనను గెలిపించిన జనం సమస్యలను పట్టించుకోకపోతే పర్యవసనాలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు తొలిసారి తెలిసివచ్చింది.
కుప్పం నుంచి ప్రక్షాళన అంటూ కవరింగ్..
అయితే పరాజయాన్ని హుందాగా ఒప్పుకొనే అలవాటు లేని చంద్రబాబు.. ఎన్నికల్లో అరచకాలు జరిగిపోయాయంటూ హడావుడి చేశారు. అధికార పార్టీ డబ్బు పంపిణీ చేసిందని, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్బంధించిందని, అందుకే గెలిచిందని లేదంటే టీడీపీ గెలిచేదని చెప్పుకొచ్చారు. బహిరంగంగా ఇలా వ్యాఖ్యలు చేసినా టీడీపీ ఓటమికి అసలు కారణం తాను నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడమే అన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నేరుగా కుప్పంలో పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నట్టు గాక మొత్తం పార్టీనే ప్రక్షాళన చేస్తాను. అది కుప్పం నుంచే మొదలు పెడతాను అని గంభీరమైన స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. ఇకపై కష్టపడి పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని నాయకులు, కార్యకర్తల్లో ఆశలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు.
తండ్రి బాటలోనే తనయుడు
తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర, తాను స్వయంగా కేబినెట్ మంత్రిగా మూడు శాఖలు నిర్వహించిన అనుభవం వంటివేమీ గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ ను గెలిపించలేకపోయాయి. ఆ దెబ్బతో వచ్చే ఎన్నికలకు ఆయన వేరే నియోజకవర్గం వెతుక్కుంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని లోకేశ్ ఆ మధ్య ప్రకటించారు. అంతేగాకుండా నియోజకవర్గంలో నాయకులను, కార్యకర్తలను తరచు కలుస్తున్నారు. పండగ, పబ్బమో, పరామర్శో ఏదో వంకతో నియోజకవర్గంలో ఉండడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓడిపోయిన తరువాత మంగళగిరిని పట్టించుకోని లోకేశ్ కుప్పంలో టీడీపీ ఓటమి అనంతరం ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారు. అంత అనుభవం ఉన్న తన తండ్రికే కుప్పంలో దిక్కులేకపోతే తన సంగతి ఏమిటన్న సందేహం ఆయనకు వచ్చినట్టుంది. మంగళగిరిలో వచ్చేసారి గెలువకపోతే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న సంగతి అర్థం కావడంతోనే ఆయన ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తల అభిమానం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలోపనిగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తనదైన శైలిలో ఆరోపణలు చేస్తున్నారు.మొత్తం మీద కుప్పం ఓటమి నేర్పిన పాఠం తండ్రీకొడుకులు ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత కోసం ఉపయోగపడుతోంది.
Also Read : TDP, Chandrababu, Kuppam – కుప్పం సైకిల్ కి రిపేర్లు.. చంద్రబాబు కీలక నిర్ణయం..