Idream media
Idream media
ఏదైనా అంశంపై ఉద్యమం చేస్తూ డిమాండ్ చేసే ముందు స్పష్టత చాలా అవసరం. స్పష్టత లేకపోతే గందరగోళం తలెత్తి.. చేసే డిమాండ్ నవ్వులపాలవుతుంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మూడు రాజధానులపై చేస్తున్నడిమాండ్ లో కూడా స్పష్టత కరువైంది. తనకున్న మీడియా బలంతో ప్రజలను తికమకపెట్టి తాను చెప్పేదే నిజం అని చాటాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని, లేదా అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు తన పార్టీ ఎమ్మెల్సీ బిటెక్ రవి చేత రాజీనామా చేయించి..కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ప్రజా ప్రతినిధులు అమరావతికి మద్ధతుగా ఎందుకు రాజీనామా చేయరంటూ మాట్లాడిస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ రెండు కళ్ల సిద్ధాంతం, రెండు కొబ్బరి చిప్పల సిద్ధాంతం చెప్పిన చంద్రబాబు ప్రస్తుత తన రాజకీయాన్ని అదే పంథాలో కొనసాగిస్తున్నట్లుగా ఆయన చేసే డిమాండ్‌ను బట్టి తెలుస్తోంది. అమరావతి రాష్ట్ర ప్రజల కోసం అంటూ చెబుతూ.. మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు రాజధాని ప్రాంత జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని చెప్పిస్తున్నారు. అమరావతి రాష్ట్ర ప్రజలందరిదీ అయితే కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమే రాజీనామా చేయాలని బిటెక్ రవి చేత డిమాండ్ చేయించడం వెనుక బాబు రెండు కళ్ల రాజకీయం అర్థం అవుతోంది.
బాబు చెప్పే మాటల్లోనూ, చేసే పనుల్లోనూ చిత్తశుద్ధి లోపించడంతోనే ఆయన విశ్వసనీయత కోల్పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి కూడా ఈ దిశగానే సాగిందని చెబుతున్నారు. అమరావతిపై గాలిలో మేడలు కడుతూ.. రోజుకో దేశ రాజధానిలా చేస్తానని ప్రజలను ఊహల్లో తేలుస్తూ.. కనీసం గుంటూరు జాతీయ రహదారి నుంచి అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ఐదేళ్లలో రోడ్డు కూడా నిర్మించలేదు. పూర్వం ఆయా గ్రామాలకు ఉన్న చిన్నపాటి రోడ్డునే ఉపయోగిస్తూ ట్రాఫిక్ విషయంలో ఆ ప్రాంత గ్రామాల ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు.
ప్రతి అంశంలోనూ రాజకీయ కోణాన్ని ఎతుక్కునే చంద్రబాబు చివరకు అమరావతి ఉద్యమంలోనూ ప్రజా ప్రతినిధుల రాజీనామాల డిమాండ్‌లో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రయోగిస్తున్నారు. అమరావతికి దూరంగా ఎక్కడో పులివెందులలో ఉండే ఎమ్మెల్సీ బిటెక్ రవి చేత రాజీనామా చేయించిన చంద్రబాబు.. రాజధాని మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన తన కుమారుడు చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించకపోవడం ఇక్కడ గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలా..? లేదా గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా..? అనే అంశంపై చంద్రబాబు ఓ సారి ఆలోచించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతకు ముందు తమ పార్టీలో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు ఇందుకు సిద్ధంగా ఉన్నారనే ఉమ్మడి ప్రకటన చేస్తే రాజీనామాల డిమాండ్‌కు బలం చేకూరుతుందని పరిశీలకులు చెబుతున్నారు. మన విషయం చెప్పకుండా… ఎదురింట్లో వాళ్లు ఏమి చేయాలో చెబితే బలం ఉండదంటున్నారు.