Idream media
Idream media
కరోనా మహమ్మారి రూపంలో ఊహించని ఉపద్రవం వచ్చిపడి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బ తీసింది. వైరస్ కలకలం, లాక్ డౌన్ కాలంతో చితికి పోయిన ప్రజల ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల జోరుతో ప్రజలు కాసింత ఉపశమనం పొందుతున్నారు. ఆశావహ దృక్పథంతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం పట్ల సహృదయ భావం పెంపొందుతోంది. జగన్ భరోసాతో కరోనాతో సహజీవనం చేస్తూ బతుకుపోరు సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో విపక్షాలు చేస్తున్న రాజకీయాలు ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ప్రశాంత వాతావరణాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ప్రజా సంక్షేమంపై ఆలోచించాల్సిన తరుణంలో అల్లర్లపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు ఇవేం రాజకీయాలురా “బాబూ.. అని చర్చించుకుంటున్నారు. కాషాయీకరణం చెందుతున్న పసుపుదళం రాజకీయాలు చూసి విస్తుపోతున్నారు.
కాదేదీ నిరసనలకు అనర్హం…
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 5.30కి అన్నమయ్య భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. రాత్రి 6.30కి బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బయల్దేరనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అది ఆయన కర్తవ్యం. ఆయన స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. 40 ఏళ్ల అనుభవ శాలి అయిన చంద్రబాబు కు ఆ విషయం బాగా తెలుసు. ఆయన కూడా ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు ఆ పని చేశారు. కానీ.. ఇప్పుడు జగన్ తిరుమల పర్యటనపై కూడా నిరసనలు తెలపాలని బాబు పిలుపు ఇవ్వడంతో ఇవేం రాజకీయాలురా “బాబూ”..! అని ఆ పార్టీ వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయి.
గందరగోళంలో చిత్తూరు తమ్ముళ్లు..
ఏపీలో ఎన్నడూ లేని రీతిలో రాజకీయాలు మతం రంగు పులుముకున్నాయి. సాధారణంగా హిందూత్వ రాజకీయాల్లో బీజేపీ పేరు గడించింది. కానీ ఇప్పుడు బీజేపీకి తీసుపోని విధంగా చంద్రబాబు కూడా ఇబ్బందికర రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఇది పార్టీకి నష్టమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన ఎందుకిలా చేస్తున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా నేతలతో మంగళవారం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని ఆయా నేతలను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు తెలిసింది. డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల ఆలయంలో జగన్ అడుగుపెట్టేలా ఆందోళనలు నిర్వహించాలని వారిని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికే అరిష్టమంటూ మూఢ నమ్మకాలను ప్రేరేపించేలా మాట్లాడడం ఏ ప్రయోజనాలు ఆశించో ఆయనకే అర్థం కావాలి.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల నిరసనలు తెలపాలని కూడా శ్రేణులకు ఆదేశించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ తిరుమల రావడం తప్పా..? సీఎం హోదాలో స్వామి వారికి పట్టువస్త్రాలు తప్పా..? ఏ కారణంతో నిరసనలకు పిలుపు ఇచ్చారో తెలియక చిత్తూరు నేతలు అయోమయానికి గురవుతున్నట్లు తెలిసింది. ఇవేం రాజకీయాలురా “బాబూ”..! అని వారు కూడా విస్మయం చెందుతున్నారు.