Idream media
Idream media
రాజకీయ పార్టీల నాయకులకు అధికారంలోకి వస్తామనే ఆశ ఉండడం సహజం. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు అధికారంలోకి వస్తామనే మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. ఇటీవల కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పంపు సెట్లకు బిగించే మీటర్లు తొలగిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో తులసి రెడ్డి ఇచ్చిన హామీ ఓ కింత హాస్యాస్పదంగా ఉంది. తాజాగా చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక.. అనే మాట అన్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయడం అత్యంత సహజం.
ఈ క్రమంలోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకం కింద నిలిచిపోయిన బిల్లులను వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో జూమ్ ద్వారా సమావేశం అవుతున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నేతలతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం బిల్లులను నిలిపివేసిందని విమర్శించారు. 24 శాతం వడ్డీతో సహా చెల్లించేలా కోర్టుల్లో పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఏ కారణాల చేతనైనా బిల్లులు రాకపోయినా.. తాను అధికారంలోకి వచ్చాక 24 శాతం వడ్డీతో ఆ బిల్లులన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఈ బిల్లులు ఎందుకు ఆగాయో మాత్రం చంద్రబాబు గానీ, ఆ పార్టీ కార్యకర్తలుగానీ మాట్లాడడం లేదు. టీడీపీ ప్రభుత్వ హాయంలో నీరు చెట్టు పేరున చెరువుల్లో పూడికలు తీయకుండానే తీసినట్లు బిల్లులు చేసుకున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమాలపై విచారణ జరుగుతోంది. బిల్లులు రాకపోవడానికి కారణాలేమైనా సరే తాను వచ్చాక ఇస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక ఉద్దేశం కూడా ఇదే కాబోలు.
తన ప్రభుత్వ హాయంలో చేసిన బిల్లులు ఆగిపోతే.. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి హామీల పరిస్థితి ఏమిటనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రుణమాఫీ గురించి ప్రస్తావన వస్తోంది. భేషరతుగా వ్యవసాయ రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తానన్న పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక మాత్రం 1.50 లక్షలకు సీలింగ్ పెట్టారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ఎస్‌ఓఎఫ్) నిబందన పెట్టి రైతులను డిఫాల్టర్లుగా మార్చారు. సరే 1.50 లక్షల వరకైనా చేశారా.. అంటే.. ఐదేళ్ల పాటు ఐదు వాయిదాల్లో ఇస్తామన్నారు. వాయిదాలో ఇచ్చే మొత్తం వడ్డీలకు సరిపోదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది.
తాను భేషరతు మాఫీ అనలేదని మాట మార్చిన బాబు.. అధికారంలోకి వచ్చాక ఇస్తానన్న ఐదు వాయిదాల్లో చివరి రెండు వాయిదాలు ఇవ్వనే లేదు. పైగా ఆ రెండు విడతల రుణమాఫీ సొమ్ము జగన్ సర్కార్ చెల్లించాలనే సరికొత్త డిమాండ్ చేశారు. తన హాయంలో చేయకపోయినా పని చేశామనే బిల్లులు ఆగిపోయినా తిరిగి అధికారంలోకి వచ్చాక ఇస్తానంటున్న బాబు.. మరి రుణామాఫీ రెండు విడతలు కూడా ఇస్తాననే మాట ఎందుకు చెప్పడం లేదో అంతుబట్టడం లేదు. ప్రస్తుతం కార్యకర్తలతో పని ఉండడం వల్లనే చంద్రబాబును.. రైతుల విషయంలో ఒకలా.. తన పార్టీ కార్యకర్తల విషయంలో మరోలా మాట్లాడేలా చేసిందనే వాఖ్యానాలు వినిపిస్తున్నాయి.