iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే గురివింద సామెత గుర్తు వస్తుంది. తన మచ్చ తనకి తెలియనట్టు… టీడీపి చేస్తున్న పనులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ సమస్య అయినా పూర్వాపరాలతో పనిలేకుండా సిఎం జగన్ కు ఆపాదించి నిందలు మోపటమే తమ ప్రధాన కర్తవ్యం అన్నట్టు సాగుతున్న టీడీపి రాజకీయం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. కేంద్రం పరిధిలో ఉండే గ్యాస్ , పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేని తెలుగుదేశం ఆ నెపం రాష్ట్ర సీఎంపై మోపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను 100శాతం ప్రయివేటు పరం చేయటానికి పూనుకుంటే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి దీనికి జగనే కారణం అంటు నిందలు మోపే పనిలో బిజీ అయిపొయారు.
తెలుగుదేశం పార్టీకి దాని అధినేత చంద్రబాబు నిజంగా ప్రయివేటికరణకు వ్యతిరేకమా? వారి ఆవేదనలో నిజం ఉందా? ప్రజల కోసమే వారు గళం ఎత్తుతున్నారా అని ఒక సారి పరిశీలించి చూస్తే వారి రాజకీయ అజెండా బయట పడుతుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటీకరణ చేసే పనికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు నాయుడు అనేది కాదనలేని సత్యం. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచే నిధుల కొరత పేరున రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మే పని మొదలు పెట్టారు. అవీ సరిపోవనట్టు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన ఘనత చంద్రబాబుది.
రాష్ట్రంలో పేరుమోసిన ప్రభుత్వ సంస్థలైన ఆల్విన్ , సహకార చక్కెర ఫ్యాక్టరీలు (నిజాం సుగర్స్ ), రిపబ్లిక్ ఫోర్జ్, లాంటి సంస్థలను ప్రైవేటు పరం చేయడమే కాకుండా విద్యుత్ సంస్థలను, ఆర్టీసీను, వ్యవసాయ మార్కెట్ యార్డులను కూడా ప్రయివేటు వ్యక్తుల పరం చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేశారాయన… అయితే అప్పటికే ప్రజా వ్యతిరేకత తీవ్రం అవ్వడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే అవకాశం ఉన్నా అధికారులు చెప్పినా వినకుండా గ్యాస్ కార్పొరేషన్ నెలకొల్పకుండా ప్రభుత్వరంగంలో వ్యాపార పారిశ్రామిక సంస్థలు ఉండకూడదు అనే విధానం అవలంబిస్తూ బిడ్డింగ్ లో పాల్గొనకుండా ఇక్కడ గ్యాస్ గుజరాత్ కి తరలి వెళ్ళిపోయేలా చేసి రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయానికి గండి కొట్టిన ఘనత ఆయనది.
చంద్రబాబు 2002 డిసెంబర్ లో డిల్లీలో నేషనల్ డెవలమెంట్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రయివేటు పెట్టుబడులు ప్రోత్సహించాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అలాగే 2002లో లాబాల్లో ఉన్న ఐడీపీఎల్ సంస్థను నష్టాలబాట పట్టేలా చేసి దానిని మూసేసి కార్మికులను గాలికి వదిలేసారు.
ఇలా తన విధానం ప్రైవేటు జపం అని ప్రకటించుకున్న చంద్రబాబు నేడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం అవుతుందని దానికి జగనే కారణం అని నిరాధారమైన నిందలు మోపుతు మరో పక్క ప్రైవేటీకరణకు నిజమైన సూత్రధారులైన బీజేపీకి దగ్గర ఆయ్యే ప్రయత్నాలు చేస్తూ మరోసారి ప్రజల సెంటుమెంటుని రాజకీయ లబ్ది కోసం వాడుకునే ప్రయత్నం చేతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.