Idream media
Idream media
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించింది. ఆ పార్టీ శ్రేణులందరూ పసుపు దళంగా గుర్తింపు పొందారు. ఆయన నుంచి చంద్రబాబు చేతిలోకి వచ్చాక కూడా పసుపు దళం హవా కొనసాగింది. సుమారు ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రతిపక్ష స్థానం పొందినప్పటికీ.. ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అవలంబిస్తున్న చర్యలతో ప్రజల ఆదరణ కోల్పోతోంది. దీనికి తోడు లాక్ డౌన్ పేరుతో అధినేత పూర్తిగా హైదరాబాద్ లోనే పరిమితం అవ్వడం ఆ పార్టీని మరింత దెబ్బ తీసింది. వర్చువల్ గా సాగిన మహానాడు కూడా శ్రేణుల్లో జోష్ నింపలేకపోయింది. అలాగే అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి కాదంటూ ఒక్క అమరావతికే జై కొడుతూ ఆయన ప్రారంభించిన రాజధాని ఉద్యమంతో కొన్ని ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు తాము టీడీపీ అని చెప్పుకోవడానికే సంశయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖ వంటి నగరాల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ కొంత మంది పార్టీ శ్రేణులు వైఎస్ఆర్, బీజేపీ, జనసేన పార్టీల్లోకి చేరుతున్నారు కూడా.
బాబు దిద్దుబాటు చర్యలు
ఏపీలో తెలుగుదేశం పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుందని చంద్రబాబు నాయుడు గుర్తించినట్లు తెలుస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల విజయవాడ వచ్చి అచ్చెంనాయుడును, కొల్లు రవీంద్రను పరామర్శించిన చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న కొందరు ముఖ్య నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా వారు స్థానికంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని, కేడర్ లో నెలకొన్న స్తబ్దతపై ఆయనతో చర్చించి ఏదో ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు ఇటీవల వరుసగా నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలాగే ‘పసుపు చైతన్యం పేరుతో 100 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. అన్ని సామాజికవర్గాలను ప్రభావితం చేసేలా నాయకులను తయారు చేసుకుందామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి చెబుతున్నారు. సంప్రదాయ ఓటర్లను పార్టీకి అండగా ఉండేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి చంద్రబాబు పిలుపునకు పసుపుదళం ఏమాత్రం స్పందిస్తుందో చూడాలి.