Idream media
Idream media
అధికారం కోల్పోయిన నాటి నుంచీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ దుర్ఘటన జరిగినా అది ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే పనిలోనే.. ఉన్న తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన ఘటనపై కూడా అలాగే స్పందించింది. ఆ విషయం తెలిసిన వెంటనే బాధ్యులు ఎంతటి వారైనా.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ జరిపే లోపే చంద్రబాబు ఓ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా వదిలేశారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఎల్లో మీడియా ఓవరాక్షన్ మొదలు పెట్టేసింది. ఇంతలో సీఎం ఆదేశాలతో అధికారులు బాధ్యులపై యాక్షన్ తీసుకోవడం, నిందితులను శిక్షించడంతో వారికి ఎటూ పాలుపోలేదు.
ఇంతకీ ఏం జరిగిందంటే…
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలిలో బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం జరగడంతో లారీ డ్రైవర్ తో ప్రసాద్ వాగ్వాదానికి దిగాడు. అది కాస్త ముదిరింది. దీంతో ఓ మాజీ సర్పంచ్ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య రాజీకుదుర్చేందుకు యత్నించారు. కానీ.. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అదుపులోకి తీసుకున్న సీతానగరం పోలీసులు తనను తీవ్రంగా కొట్టి గుండు గీయించారని ప్రసాద్ పేర్కొన్నాడు.
జగన్ ఆగ్రహం
విషయం తెలియగానే.. యువకుడి పట్ల పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. డీజీపీ గౌతం సవాంగ్ ఈ ఘటనపై విచారణ జరిపారు. బాధ్యులైన ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ను సస్పెన్షన్ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వ్యవహార శైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి కూడా ప్రకటన వెలువడింది.
ఇంతలోనే నిప్పులు..
ఒకవైపు జరిగిన ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకునే లోపే.. దాన్ని ఆసరాగా చేసుకుని ఓ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనాగరిక పాలన ఏపీకి మళ్లీ తిరిగొచ్చిందని ఆరోపించారు. అవినీతిపాలక పార్టీ సభ్యుల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని అన్నారు. కారణమైన వారికి.. కఠినంగా శిక్షించేవరకు పోరాడతామన్నారు. అయితే.. ఇంతలో ప్రభుత్వమే బాధ్యులను శిక్షించింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని చంద్రబాబుకు రీట్వీట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సంఘటన ఏదైనా జరిగినప్పుడు బాధితులకు తగిన న్యాయం జరగాలంటే.. దాని పుర్వాపరాలను ముందు తెలుసుకోవాలి.. విచారణ జరపాలి.. ఇవన్నీ జరిగేందుకు కొంత సమయం పడుతుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవేమీ తెలియంది కాదు. కానీ.. ఇంతలోనే ఆయన ప్రకటనలు ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.