iDreamPost
iDreamPost
గురుకుల విద్యాసంస్థలకు ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి పేరును తొలగించడం అభ్యంతరకరం అంటున్న చంద్రబాబునాయుడు
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌నే పార్టీ నుంచి తొలగించిన దానికి ఏమంటారు అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును తొలగించడం అవమానకరమని అని ఆదివారం బాబు చేసిన రాజకీయవ్యాఖ్యలు ప్రమాదకరం అని అంటున్నారు. గురుకుల విద్యా సంస్థలకు ఉన్న బాలయోగి పేరును తొలగించిన ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టిందన్న సంగతిని ఎందుకు విస్మరిస్తున్నారు? అని అడుగుతున్నారు. దళితులపై చంద్రబాబుకు ఎప్పటి నుంచి ప్రేమ పుట్టిందని ప్రశ్నిస్తున్నారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు? అని ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగంగా చంద్రబాబు ప్రశ్నించారని గుర్తు చేస్తున్నారు. దళితులకు శుభ్రత ఉండదు అని వ్యాఖ్యానించి, తన మంత్రివర్గ సహచరుడు వారిని అవమానించినా బాబు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం కోసం దళిత నేత బాలయోగి పేరును ఉపయోగించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్ధం పడుతోంది.
జగన్, వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టొచ్చని ఉచిత సలహా ఇస్తున్న బాబు తన పరిపాలనా కాలంలో చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న ప్రమాద భీమా వంటి పథకాలకు బాలయోగి పేరును ఎందుకు పెట్టలేదు? అప్పుడు దళిత తేజం బాలయోగి ఎందుకు గుర్తుకు రాలేదు? తెలుగు జాతి గర్వపడే దళిత బిడ్డ బాలయోగి పేరును తొలగించడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కుసంస్కారం అంటున్న చంద్రబాబుకు అసలు సంస్కారం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీస్తున్నారు. 60 ఏళ్ల వయసులో పార్టీ స్థాపించి, తన చైతన్యరథంపై దాదాపు రాష్ట్రమంతా తిరిగి టీడీపీని అధికారంలో తెచ్చిన ఎన్టీఆర్ పట్ల బాబు ఎలాంటి సంస్కారం కనబరిచారో అందరికీ తెలుసు. టీడీపీని, పార్టీ ఫండ్‌ను, కుటుంబాన్ని ఆయన నుంచి దూరం చేసి తీవ్ర మానసిక క్షోభకు గురి చేసినప్పుడు బాబుగారి సంస్కారం ఎక్కడ దాక్కుంది? తాను ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది హరికృష్ణను అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపినప్పుడు బాబు సంస్కారం ఏమైంది? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అంబేద్కర్ ను గౌరవించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని పక్కదోవ పట్టిస్తూ బాలయోగిని ప్రభుత్వం అవమానించినట్టు అని కలర్ ఇవ్వడం ఏ ప్రయోజనం కోసం? ఇంకా ఎన్నాళ్లూ ఇలాంటి విలువల్లేని రాజకీయాలు చేస్తారు? వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరించడం సంస్కారం అన్న సంగతి తెలుసుకోండి బాబూ అని అధికార పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు.