దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వీఐపీలకు కల్పిస్తున్న జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) కమాండోలను విఐపిల భద్రతా విధుల నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం మీడియాకు వెల్లడించాయి. 1984 లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌జీ గత రెండు దశాబ్దాలుగా వీఐపీల భద్రతా విధులు నిర్వర్తిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు ఎన్‌ఎస్‌జీ పరిధిలో లేనప్పటికీ తరువాత కాలంలో కొంతమంది హై సెక్యూరిటీ రిస్క్ వున్న రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడానికి బ్లాక్ క్యాట్ కమెండో సేవలను వాడుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం దేశంలో జడ్‌ప్లస్ కేటగిరిలో 13 మంది వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తోంది. ఒక్కొక్కరికి 24 మంది బ్లాక్ క్యాట్ కమాండోలు చొప్పున అత్యాధునిక ఆయుధాలతో భద్రత కల్పిస్తున్నారు.
వారిలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, మాయావతి, ములాయంసింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లాల తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యానాద్ (ఉత్తరప్రదేశ్), శర్బానంద సోనేవాల్(అసోం), మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ తదితరులకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉంది. అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్న దృష్ట్యా వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా ఎన్‌ఎస్‌జీకి వీఐపీల భద్రతా విధులు తొలగించి వారిని ఉగ్రవాదాన్ని నిర్ములించడానికి వాడుకోవాలని 2012 నుంచే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఉగ్రవాద నిర్మూలన, హైజాక్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌జీ ని కేవలం ఆ విధులకే పరిమితం చేయాలని కేంద్ర హోంశాఖ భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
దేశంలో ప్రస్తుతం పరిమితంగా ఉన్న ఎన్‌ఎస్‌జీ కి హై రిస్క్ వీఐపీల భద్రత భారంగా మారిందని ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 450 మంది కమాండోలకు ఈ విధుల నుంచి విముక్తి లభిస్తుందని, వారందరినీ ఉగ్రవాద నిర్ములనా చర్యలకు ఎన్‌ఎస్‌జీ విభాగానికి కేటాయించనున్నట్టు తెలిపాయి. దీనితో ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ రక్షణ కల్పిస్తున్న వీఐపీలకు బ్లాక్ క్యాట్ కమాండోలు స్థానంలో ప్రముఖులకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్, సి.ఐ.యస్.యఫ్ లకు ఈ వీఐపీల భద్రతా బాధ్యతలు కూడా అప్పగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 130 మంది ప్రముఖలకు సీఆర్పీఎఫ్, సి.ఐ.యస్.యఫ్ ల ద్వారా భద్రతా కల్పిస్తున్నారు. ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆయన భార్య తో పాటు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలకు ఎస్పీజీ భద్రత తొలగించి, ఆ బాధ్యతను కూడా సీఆర్పీఎఫ్ కే అప్పగించడం జరిగింది.