iDreamPost
iDreamPost
చంద్రబాబు “నా” గుణింతం తడబడింది …
అమరావతి రాజధాని అంశం పై ఈ రోజు ఆరోసారి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన చంద్రబాబు మాట్లాడుతూ … “ఆ రోజు రైతులు భూములు ఇచ్చింది చంద్రబాబు పై నమ్మకంతో కాదు . లేకపోతే ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఇచ్చిన భూమికాదు ఇది . వాళ్ళిచ్చింది రాష్ట్రం కోసరం ఇచ్చారు . రాజధాని కోసరం ఇచ్చారు” . అంటూ చెప్పుకొచ్చిన మాటలు వింటే బాబు గారి తత్వం తెలిసిన వారెవరైనా తీవ్ర విస్మయానికి గురికాక మానరు .
రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ అంశానికి ప్రాధాన్యత సంతరించుకొన్నా , ఎవరైనా తెలుగు వ్యక్తి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా , ఏదైనా భారీ నిర్మాణం , అభివృద్ధి జరిగినా నేనే చేసాను , దాని వెనక నేనున్నాను , నేనే స్ఫూర్తి అనే చంద్రబాబు , మరీ ముఖ్యంగా ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా హైదరాబాద్ ని అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టాను అని పదే పదే గుర్తు చేసే చంద్రబాబు మొదటిసారి నేను కారణం కాదు అని చెప్పుకోవడం విశేషమే కాదు ఆశ్చర్యకరం కూడా .
రాజధాని ప్రాంత నిర్ణయం జరిగి భూసమీకరణ చేపట్టాక పలు సందర్భాల్లో నన్ను చూసి భూములిచ్చారు , నేను చేసిన అభివృద్ధి చూసి , అంతర్జాతీయ స్థాయి రాజధాని నేనైతేనే నిర్మించగలనని నమ్మి రైతులు 34000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు అని పలుమార్లు ఢంకా బజాయించి చెప్పిన చంద్రబాబు ఈ రోజు నన్ను చూసి కాదు ,వ్యక్తిని , పార్టీని చూసి కాదు ప్రభుత్వాన్ని చూసి ఇచ్చారు అంటూ తన్ను తాను తగ్గించుకొనటం బహుశా ఇదే మొదటిసారి .
Also Read: గోరంట్ల … ఆదిరెడ్డి ఎవరి దారి వారిదే..!
29 గ్రామాల ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించడం నుండి , దానికి అమరావతి అని నామకరణం చేయడం , ఈ ప్రాంతానికి ఏ సంబంధమూ లేని దగ్గరలో ఉన్న చారిత్రక పట్టణమైన అమరావతికి ఉన్న విశిష్టతలు ఈ 29 గ్రామాల ప్రాంతానికి ఆపాదించే విధంగా కృషి చేసిన చంద్రబాబు , ఆ శ్రద్ధ రాజధానికి భూములిచ్చిన రైతుల హక్కుల పై కానీ , వారికి భద్రత కలిగించడం పై కానీ పెట్టడా అంటే లేదనే చెప్పాలి .
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించకుండా భూయజమాని , బిల్డర్ ల మధ్య జరిగే డెవలప్మెంట్ అగ్రిమెంట్ తరహాలో భూసమీకరణ చేసిన నాడే రైతుల భూముల భవిష్యత్ బాబు పిడికిట్లో నలిగింది . ఈ రోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చంద్రబాబు చెప్పొచ్చు . కానీ నాడు మంత్రి నారాయణ , పత్తిపాటి పుల్లారావులు భూములు ఇవ్వము అన్న గ్రామాలలో పెట్టిన పంచాయితీలు వార్తా పత్రికలలో సాక్ష్యాలుగా మిగిలే ఉన్నాయి .
ఎవడు ఇస్తాడండి మూడు పంటలు పండే భూములు పుల్లారావు ఇస్తాడా , మంత్రి నారాయణ తనకున్న బిల్డింగుల్లో ఒక్కటిస్తాడా ఇవ్వమనండి చూద్దాం . CRDA చట్టం చేసి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ధిక్కరించిన బోయపాటి సుధారాణి అనే మహిళా రైతు మూడు రోజుల అజ్ఞాతం తర్వాత తన భూమి CRDA కి ఇవ్వటం వెనకున్న స్వచ్చందత రాష్ట్ర ప్రజలకి తెలియకపోలేదు .
Also Read: మరాఠా వీరుడు రాజ్ గురు
భూసేకరణ పద్ధతి ప్రకారం పరిహారం చెల్లించకుండా లోపభూయిష్టమైన , పలు అవకతవకలకు ఆస్కారం కల్పించిన భూసమీకరణ పద్ధతిలో రైతులను ఇరికించి ఐచ్ఛికంగా భూములు ఇస్తున్నట్టు , వారికిచ్చిన ప్లాట్స్ తీసుకోవడం తప్ప మరే విధమైన హక్కులూ లేకుండా చేసిన ప్రయివేటు డెవలప్మెంట్ తరహా అగ్రిమెంట్ తో భూములు తీసుకొని చెప్పిన విధంగా రాజధాని నిర్మించలేక తాత్కాలిక కట్టడాలతో సరిపెట్టుకొన్న చంద్రబాబు ఈ రోజు నాకివ్వలేదు భూములు , పార్టీకి ఇవ్వలేదు భూములు , ప్రభుత్వానికి ఇచ్చారు అని చెప్పడం ఆ రోజు రైతులకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో అది చేయలేక తప్పుకొనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు .