iDreamPost
iDreamPost
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితో పడిందనే నానుడి రివర్స్ అయ్యింది. అందరికీ నీతులు వల్లించే చంద్రబాబు తాను మాత్రం గోతులు తీసేందుకు సిద్ధమవుతుంటారనేది స్పష్టమయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు మరణిస్తే వారి వారసులకు అవకాశం ఇవ్వాలని అధికారంలో ఉండగా ఆయన అనేక మార్లు చెప్పారు. తమ పార్టీకి చెందిన నేతల కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. ఏకగ్రీవం చేసుకునేందుకు ఆయన అనేక విధాలా ప్రయత్నించారు. అప్పట్లో ఆయనను చూసి కాకపోయినా, మరణించిన వారి కుటుంబ సభ్యుల పట్ల సానుభూతితో వైఎస్సార్సీపీ అధినేత వ్యవహరించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తన మాటలకు భిన్నంగా సాగుతుంటే, జగన్ మాత్రం తాను చెప్పింది చేసి చూపించారు. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అనుసరించి నాయకత్వ స్థాయిని ప్రదర్శించారు.
2013లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణించారు. ఆయన అవనిగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ హఠాన్మరణం పొందారు. దాంతో ఆయన కుటుంబం నుంచి తనయుడు అంబటి శ్రీహరి ప్రసాద్ ని టీడీపీ బరిలో దింపేందుకు సిద్ధమయ్యింది. వెంటనే మృతిచెందిన నేత పట్ల గౌరవంతో జగన్ హుందాగా వ్యవహరించారు. టీడీపీ అభ్యర్థిపై పోటీ చేయకుండా ఉపసంహరించుకున్నారు. తద్వారా ప్రధాన పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీలో బరిలో లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పదవీకాలం ఉండగా మరణించిన కుటుంబానికి తగిన స్థానం కల్పించడంలో జగన్ తనదైన శైలిలో వ్యవహరించారు.
అంతేగాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ తన వైఖరి మార్చుకోలేదు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ ఆ వెంటనే ఉప ఎన్నికలు వచ్చినా జగన్ ధోరణి మారలేదు. ఆ ఎన్నికల్లో నందిగామ నుంచి టీడీపీ తరుపున గెలిచిన తంగిరాల ప్రభాకర్ ఆ వెంటనే మరణించారు. విషాదంలో నిండిన కుటుంబానికి ఓదార్పుగా ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్యకు అవకాశం ఇస్తే తమ అభ్యర్థిని బరిలో దింపేది లేదని ప్రకటించారు. మరోసారి హుందాగా వ్యవహరించి ఏస్థాయిలో ఉన్నా తన వైఖరి మారదని చాటుకున్నారు. మృతి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబం పట్ల మరోసారి అభిమానం ప్రదర్శించారు.
ప్రస్తుతం నేతల సీట్లు మారాయి. కానీ అలాంటి పరిస్థితి మాత్రం పునరావృతం అయ్యింది. అప్పట్లో అధికారంలో ఉండగా అందరికీ నీతులు వల్లించి, సూక్తులు చెప్పిన చంద్రబాబు తాను చెప్పింది విస్మరించారు. గతంలో తమ అభ్యర్థుల పట్ల జగన్ పరిణతి చెందిన నేతగా వ్యవహరించిన విషయాన్ని విస్మరించారు. ఈసారి తిరుపతి పార్లమెంట్ స్థానానికి బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో ఎదురయిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ స్పందించకముందే తన అభ్యర్థిని ప్రకటించేశారు. గత ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురయినా తన బుద్ధి మారలేదని చాటుకున్నారు. తాను చెప్పిన మాటలు కూడా ఆచరించబోనని నిరూపించుకున్నారు. అయినప్పటికీ బాబు వ్యవహారశైలి గురించి బాగా తెలిసిన జగన్ మాత్రం టీడీపీ అధినేత నుంచి సానుకూల స్పందన ఆశించకపోవడం విశేషం. బాబు బుద్ధి తెలుసు కాబట్టి తమ దారిలో తాము ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధపడి, మరోసారి టీడీపీకి తగిన శాస్తి చేసేందుకు సన్నద్దమవుతోందని ఆపార్టీకి చెందిన తిరుపతి నేతలు అంటున్నారు.