మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు మారలేదు అనేకంటే తీరు మార్చుకోరు అని చెప్పడం సబబు. పలు సందర్భాలలో మాట మార్చే ఆయన నైజం ప్రజలకు తెలుసు. కానీ 2019లో అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయనలో అసహనం పెరిగిపోయింది. తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతూ ప్రజలలో చులకన అవుతున్నా బాబు గారు ఏ మాత్రం మారడంలేదు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఈ వరుస దాడులను ఎవరూ సమర్ధించరు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు కుట్ర కోణం ఉందంటూ స్పష్టంగా కనబడుతున్నా బాబు గారు దీనిని కూడా రాజకీయ కోణంలో చూడటం ఆయనకే చెల్లు.
బాబు గారు ఇంకాస్త ముందుకు అడుగు వేసి తానే హిందు సంరక్షకుడిననే లెవెల్ లో రామతీర్ధంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే గాక తమ పార్టీ నాయకులను రెచ్చగొట్టారు. మత రాజకీయాలను రెచ్చగొట్టడం లాంటి కార్యకలాపాలతో బాబు గారు తన నైజం ఏంటో ప్రపంచానికి మరోమారు తెలియచేశారు. అన్నీ మతాలు, కులాలు, ప్రాంతాలను సమ ద్రుష్టితో చూస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు పదవిలో లేకపోవడంతో మాట మార్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట…అధికారం కోల్పోయిన తరువాత మరోమాట మాట్లాడటం ఆయనకు అలవాటే అనే విషయాన్ని మరోమారు రుజువు చేశాడు. టీడీపీ మేనిఫెస్టోలో బాబు గారు చాలా గొప్పగా క్రైస్తవుల సంక్షేమం గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. వారి ఇంటికి తాను పెద్ద కొడుకుగా ఉంటానని అవసరమైతే కేంద్రంతో కొట్లాడి వారికి రిజర్వేషన్స్ ఇస్తామని శపధాలు చేశారు.
‘మత సామరస్యాన్ని కాపాడుతాం’ మంటూ మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఆ విషయాలను పక్కనపెట్టి ఇందుకు కారణం క్రైస్తవులే అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల సంక్షేమానికి మాత్రం బడ్జెట్ పెంచుతున్నారని విమర్శించారు. టీడీపీ-2019 మేనిఫెస్టోలో తాను పెట్టిన అంశాలను మర్చిపోయి వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇంకా దారుణమైన విషయం గురించి చెప్పుకోవాలి. విజయవాడలో వరుసగా గుడులను కూల్చిన బాబు గారు అదే దారిలో ఉన్న తమ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇంటిని, మసీదులను విడిచిపెట్టారు. ఇది అన్యాయమంటూ ప్రశ్నించిన వారిని జైలుకు పంపిన ఘనత చంద్రబాబుది. అది మాత్రమే గాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక గుడులను పడగొట్టిన చరిత్ర ఆయనది. అవ్వన్నీ మర్చిపోయి చంద్రబాబు ‘గుడ్డ కాల్చి మొహాన వేసిన’ చందాన ప్రతి రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోతున్నారు.
అధికారంలో ఉన్న వైసీపీ క్రైస్తవుల సంక్షేమం గురించే పట్టించుకుంటుందా? అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. జెరూసలెం యాత్రకు సబ్సిడీ, పేదలకు నిధులు, వారికి రాయితీలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టినవి పెట్టినట్టుగానే అమలు చేయడమే గాక అన్నీ మతాలు, కులాలు, ప్రాంతాలను సమ ద్రుష్టితో చూస్తామని చెప్పినట్టు గానే జగన్ అందరికి సంక్షేమ పథకాలను దగ్గర చేరుస్తున్నారు. పేద బ్రాహ్మణుల నుంచి మొదలు కొని ముస్లిం, సిక్కు, పార్శిలకు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. పురోహితులకు, ఇమాములకు, ఫాథర్స్ లకు శాలరీ ఇస్తూ తమ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో మాటలతో కాకుండా చేతలతో చూపించారు. పురోహితుల, ఇమాముల విషయాన్నీ పక్కనబెట్టి కేవలం ఫాథర్స్ లకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారని చెప్పడమే గాకుండా తమ అనుకూల ‘ఎల్లో మీడియా’తో చంద్రబాబు చెప్పిస్తున్నారు. ఇది అత్యంత దారుణం.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే వ్యక్తి నుంచి ఇలాంటి నేలబారు రాజకీయాన్ని మనం ఊహించలేము. ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయాన్ని సైడ్ ట్రాక్ చేసి రాజకీయ లబ్ది పొందాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ‘నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు’ అనే తీరులో ఉంది. ప్రభుత్వం ఈ దాడులపై విచారణ కమిటీ వేసింది. ఒకవేళ ఈ విచారణలో టీడీపీ పాత్ర ఉందంటూ బయటపడ్డా ‘గుక్క తిప్పుకోకుండా ఇది కుట్ర’ అంటూ గట్టిగా చెప్పే సత్తా ఉన్న నాయకత్వం ఆయన సొంతం. బాబు గారు ఇప్పటికైనా రాజకీయ పేలాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి ఓ మంచి సలహా ఇవ్వాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు!