iDreamPost
iDreamPost
ఏపీ రాజధాని అంశంలో ప్రభుత్వం స్పష్టంగా సాగుతోంది. మూడు రాజధానుల విషయంలో అడుగులు వేస్తోంది. శాసనపరంగా మండలిలో పెట్టిన అభ్యంతరాలను, అడ్డంకులను జగన్ ప్రభుత్వం అధిగమించింది. శాసనపరంగా ప్రక్రియ పూర్తిచేసి ముందుకెళతామని కోర్టులో చెప్పిన విధంగా చర్యలకు పూనుకుంది. వరుసగా రెండు సమావేశాల్లో అసెంబ్లీ తీర్మానాలను అడ్డుకోవడం ద్వారా కీలకమైన అంశంలో టీడీపీ ఎమ్మెల్సీల తీరు అందరికీ తెలిసింది. అసెంబ్లీలో ఆ బిల్లులను వ్యతిరేకించకుండా, మండలిలో అసలు చర్చ జరగకుండా చేసిన టీడీపీ తీరుని ప్రజలంతా గ్రహించారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నెలరోజుల వ్యవధి దాటిన తర్వాత ఆ బిల్లులు గవర్నర్ ని చేరడం, ఆయన కూడా న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించి చట్ట రూపం ఇవ్వడంతో ప్రస్తుతం సీఆర్డీయే రద్దు అయిపోయింది. ఆ తర్వాత మూడు రాజధానులకు అనుగుణంగా పాలనా వికేంద్రీకరణ చట్టంగా మారింది.
ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీలో బలం లేక ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు మండలిలో ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని చూసి ఆరు నెలలు జాప్యం చేయగలిగారే తప్ప అంతకుమించి అడ్డుకునే అవకాశం లేక చేతులెత్తేశారు. కానీ ఆ తర్వాత న్యాయవ్యవస్థలో ఆయన వేలు పెట్టారు. అమరావతిని, దాని చుట్టూ సాగిన భూభాగోతాన్ని కాపాడుకునే లక్ష్యంతో ఎక్కడికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చంద్రబాబు మాటలు, చేతలు ఇప్పటికే చెబుతున్నాయి. దానికి అనుగుణంగానే ఆయన హైకోర్టులో పిటీషన్ వేయించారు. వాస్తవానికి పిటీషన్ దారుల పేర్లు, వారి నేపథ్యాలు వేర్వేరయినప్పటికీ వాటన్నింటి వెనుకా చంద్రబాబు ఉన్నారనే అంశంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. టీడీపీ ఆస్థాన న్యాయవాదులు ఈ పిటీషన్లు వేయడం, వాదించడం గమనిస్తే ఈవిషయం ఇట్టే బోధపడుతుంది.
హైకోర్ట్ కి కూడా ఈ చట్టాలను రద్దు చేసే అధికారం లేదు. కానీ వాటి అమలులో తలెత్తే సమస్యలను ప్రస్తావించడం, వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అవకాశాలున్నట్టు ఇప్పటికే స్పష్టం అయ్యింది. గవర్నర్ ఆమోదంతో అంతకుముందు హైకోర్టులో చెప్పిన ప్రక్రియ అంతా నిబందనల ప్రకారం అమలులోకి వచ్చిన సదరు రెండు చట్టాల మీద స్టేటస్ కో ఇచ్చింది. ఇప్పుడు దానిమూలంగా ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకునే అవకాశం మాత్రమే లేదు. చట్టం యధావిధిగా అమలులో ఉంది. ఇప్పటికే మూడు రాజధానులు మనుగడలో ఉన్నట్టుగానే చెప్పాలి. అయితే ఇప్పుడా చట్టాల పై హైకోర్ట్ స్టేటస్ కో ఆర్డర్ చెల్లదని, చట్టాల అమలు కోసం స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించింది.
తొలుత పిటీషనర్లు కేవియట్ పిటీషన్ వేశారు. దానికి విలువ ఉండదని గ్రహించిన చంద్రబాబు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. కోర్టు వ్యవహారాల్లో ఆయనకు పట్టుందని పలువురు పదే పదే చెబుతుంటారు. దానికి అనుగుణంగా ఈ కేసులో సాగుతున్న పరిణామాలు గమనిస్తే మరింత బాగా అర్థం అవుతంది. ఈ కేసు తొలుత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు వచ్చింది. కానీ ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. దానికి కారణం ఆయన కుమార్తె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్లు వేసిన వారి తరుపు న్యాయవాది. ఈ కేసులో సుప్రీంకోర్ట్ సీజే కుమార్తె రుక్మిణీని న్యాయవాదిగా ఎంచుకోవడం వెనుక పిటీషనర్ల తరుపున ఉన్నవారి వ్యూహంగా కనబడుతోంది. ఆతర్వాత మరో న్యాయమూర్తి పాలిమన్ దగ్గర విచారణకు వచ్చింది. కానీ ఆయన తండ్రి నారీ పాలిమన్ కూడా న్యాయవాదిగా పిటీషనర్ల తరుపున ఉన్నారు.
ఇలా ముందుగా ఆయా న్యాయమూర్తుల బంధువులను తమ న్యాయవాదుల బృందంలో ఎంచుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉన్నట్టుగా పలువురు సందేహిస్తున్నారు. మూడో న్యాయమూర్తి ఎవరు అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఏ లక్ష్యంతో పలువురు న్యాయమూర్తుల బంధువులును న్యాయవాదులుగా ఎంపిక చేసుకున్నారు అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. ఇలా వ్యూహాత్మకంగా నాట్ బిఫోర్ అంశాన్ని తీసుకురావడం ద్వారా గతంలో పలు సందర్భాల్లో వ్యవహరించిన అనుభవం ఈసారి అక్కరకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న నిబంధనలను తమకు అనుకూలంగా మలచుకునే పక్కా వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు.
న్యాయపరమైన అంశాలలో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు కీలక అంశాల్లో ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సర్కారుకి న్యాయ సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఈ రాజధానుల అంశంలో కూడా చివరకు విచారణ చేపట్టేదెవరు అన్నది కూడా పెద్ద చర్చకు అవకాశం కల్పిస్తోంది. ఈ అంశంలో సుప్రీంకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది కూడా ఏపీ వ్యవహారాల్లో ముఖ్యాంశంగా చెప్పాలి. ఏమైనా ఇంతటి కీలకాంశంలో తన జీవితంలో ఎన్నడూలేనంతగా ఇంటికే పరిమితమయిన చంద్రబాబు వ్యూహాత్మక పన్నాగాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాల్సిన అంశంగా ఉంది. రాజకీయంగా అది కీలక పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది.