iDreamPost
android-app
ios-app

దారుణంగా తప్పిన చంద్రబాబు లెక్క

దారుణంగా తప్పిన చంద్రబాబు లెక్క

“ఐస్ క్రీమ్ తింటే పుల్ల అయినా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా మిగలదు” అని దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఉంది. అది కామెడీ కోసం చెప్పిన డైలాగే అయినా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చేసే కుంభకోణాలు ఇలాగే, ఎలాంటి రుజువులు లేకుండా ఉంటాయి. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఎడాపెడా అవినీతి ఆరోపణలు చేసి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ఆ ఆరోపణలు నిరూపించలేక ఏవో మొక్కుబడిగా కమిటీ వేసి చేతులు దులిపేసుకుంటారు. దేశంలో ప్రజలు కూడా ఈ ప్రహసనానికి అలవాటు పడిపోయారు.

అయితే ఇప్పుడు రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేసిన అక్రమాలకు ఎక్కడ పడితే అక్కడ ఆధారాలు దొరకడం ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు దొరుకుతూ ఉండడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. చంద్రబాబు కానీ ఆయన మంత్రులు కానీ మరీ ఇంత అజాగ్రత్తగా ఉన్నారేమిటా అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది అజాగ్రత్త కాదని, చంద్రబాబు ఎంతో నమ్మకంతో వేసిన ఒక లెక్క తప్పడమే ఇందుకు కారణం అని అర్ధమవుతుంది.

దెబ్బతీసిన డాష్ బోర్డు

క్షేత్రస్థాయిలో వేలమందిని ఇంటర్వ్యూ చేసి ఎన్నికల ఫలితాలు అంచనా వేసే నిపుణుల కన్నా కచ్చితంగా ఫలితాలు అంచనా వేయగల అనుభవం చంద్రబాబుకు ఉంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పగల ఆయన మొన్న ఎన్నికల్లో డాష్ బోర్డులో రాష్ట్ర ప్రజల హాపీనెస్ ఇండెక్స్ మీద ఆధారపడి ఫలితాలను అంచనా వేయడంలో దెబ్బ తిన్నాడు.

రాష్ట్రంలో తొంభై శాతం పైబడి ప్రజలు తన పాలనలో సంతోషంగా ఉన్నారని నమ్మి, మిగిలిన వారిని కూడా ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకం, నిరుద్యోగ భృతి, అన్న కేంటీన్లు పెట్టి తృప్తి పరచ వచ్చని భావించారు. ఇంకా ఎవరైనా పార్టీ మీద వ్యతిరేకతతో ఉంటే అయిదు సంవత్సరాలు అధికారుల సాక్షిగా “మా పార్టీ వారు పదేళ్ల పాటు కరువులో ఉన్నారు. ఈ అయిదేళ్ళు ఏం తిన్నా, ఎంత తిన్నా చూసీ చూడనట్లు పొండి” అని సాక్షాత్తు ముఖ్యమంత్రి లైసెన్సు ఇచ్చి మేపిన నాయకులు డబ్బులు వెదజల్లి వారిని దారికి తేగలరని బలంగా నమ్మాడు చంద్రబాబు.

అదే విధంగా కేంద్రంలో బిజెపి ఓటమి తప్పదని, కాంగ్రెస్ పార్టీతో కలిసి, పిలిచినా పిలవకపోయినా అన్ని రాష్ట్రాలు తిరిగి, తాను కూడగట్టిన ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని కూడా గట్టిగానే నమ్మాడు. కూటమి సూత్రధారిగా కేంద్రంలో మళ్ళీ చక్రం తిప్పే సువర్ణావకాశం వస్తుందని భావించాడు చంద్రబాబు.

తిరుగులేని ప్రణాళిక

ఈ అయిదేళ్ళు ప్రచార పటాటోపం, గ్రాఫిక్స్ మాయాజాలం తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ చేయలేని చంద్రబాబు మనసుకి బాగా తెలుసు. అందుకే ఎన్నికల్లో గెలిచాక రాష్ట్రంలో, కేంద్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుంది కాబట్టి దండిగా నిధులు రాబట్టి, తమ్ముళ్ళ భోజనానికి కొద్దిగా అడ్డుకట్ట వేసి, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి, మీడియాలో ఊదరగొట్టినట్ఠు భూలోక స్వర్గం లాంటి రాజధాని కాకపోయినా, మరీ చిన్న వర్షానికే మునిగిపోయే భవంతులు కాకుండా ఒక మోస్తరు భవనాలతో రాజధానికి ఒక రూపం ఇవ్వాలని భావించారు.

ఈ విధంగా రెండు మూడు సంవత్సరాలలో లోకేష్ బాబు పార్టీ మీద, పాలన మీద పట్టు సాధించడానికి అవకాశమిచ్చి, అప్పుడు యువరాజుకు పట్టాభిషేకం చేసి, తను కేంద్రంలో మంచి శాఖలో మంత్రి గానో, రాష్ట్రపతి గానో, ఇంకా కాలం కలిసి వస్తే ప్రధాన మంత్రి గానో సెటిల్ అవ్వాలని పక్కా ప్రణాళిక వేశాడు.

అయితే చంద్రబాబు కలలో కూడా ఊహించని విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అధికారం అప్పగించారు. ఇది ఆయన ఏమాత్రం ఊహించని పరిణామం కావడంతో అన్ని డిపార్టుమెంట్లలో జరిగిన స్కాములన్నీ ఎక్కడికక్కడ, మసిపూసి మాయ చేసే సమయం లేక ఎక్కడి బొక్కలు అక్కడ మిగిలి పోవడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలను విచారించడం సులువైన పని అయింది.