తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతలు, కార్యకర్తలతో నేరుగా సమావేశాలు పెట్టింది చాలా తక్కువ. టెలీ కాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగులకే ఆయన పరిమితం అయ్యారు. దీంతో స్థానిక నేతలు కూడా నియోజకవర్గాల్లో తిరగడం మానేశారు. ఫలితంగా ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయారు. చాలా మంది పార్టీలు మారిపోయారు. చంద్రబాబు నమ్మిన నేతలు కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఉన్న వారు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో చాలా ప్రాంతాల్లో కమిటీలు ఖాళీగా ఉన్నాయి.
పార్టీలోని లోపాలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా బయటపడ్డాయి. కొందరు ఇచ్చిన సమాచారాన్ని నమ్ముతూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి టీడీపీ పుంజుకుంటోందని, ప్రజలు మమ్మల్నే ఆదరిస్తున్నారని చెబుతూ వచ్చేవారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోని ఫలితాలతో బాబుకు దిమ్మ తిరిగింది. దీంతో తనకు వచ్చిన సమాచారం తప్పు అని తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. నాయకులు మళ్లీ గ్రామాల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలావుండగా కొందరు టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లినా సొంత పార్టీ వారు కూడా కలవకుండా ముఖం చాటేస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు.
తొలుత తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఫలితాలపై పోస్టుమార్టానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. నేడు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు రెండు, మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. తొలుత తన ప్రాంతంలో అయినా పార్టీని కాపాడుకోవాలని బాబు విశ్వయత్నాలు చేస్తున్నారు. పర్యటనకు ముందు నుంచే కొద్ది రోజులుగా పలువురు టీడీపీ నాయకులకు ఫోన్లు చేస్తూ తగు సూచనలు చేస్తునట్లు తెలిసింది. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కుప్పంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీతో ప్రజాస్వామ్యాన్ని ఓడించారని టీడీపీ అధినేత చంద్రబాబు పైకి ఎన్ని మాటలు చెప్పినా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో కార్యకర్తలకు బాగా తెలుసు. చంద్రబాబు పర్యటనకు ముందు రోజు జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ నేతలు లోపాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రచ్చగా మారింది.
పంచాయతీ ఎన్నికలు ముగిశాయనగానే పురపోరు మొదలుకావడం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి ఫలితాలే పునరావృతమైతే రాష్ట్రంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురు అవుతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని గుర్తించిన బాబు ఫోన్లు, జూమ్ ల ద్వారా పని కాదని నేరుగా సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పం తర్వాత మరిన్ని కీలక నియోజకవర్గాలలో కూడా బాబు పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయిన, అంతర్గత విభేదాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయవాడలో కేశినేని నానికి బుద్దా వెంకన్నకు మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ పోరు నడిరోడ్డుపై కూడా కొనసాగింది. ఇప్పటికే ఆ నేతలతో ఫోన్ లో మాట్లాడిన బాబు త్వరలోనే వారితో సమావేశం కానున్నారు. అలాగే మాజీ మంత్రులు పరిటాల సునీత, అయ్యన్న పాత్రుడు, చంద్రమోహన్ రెడ్డి వంటి నేతల ఇలాకాల్లో కూడా పార్టీ ఘోర పరాజయం పాలైంది. అమరావతి ఉద్యమం నడుస్తున్న పరిసర జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఓటమే ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో అయినా విజయం పొందేందుకు బాబు తీవ్రస్థాయిలో శ్రమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫోన్ లు, ఆన్ లైన్ సమావేశాలకే పరిమితం అయిన ఆయన నేరుగా వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది.