Idream media
Idream media
ఈ మధ్య విడుదలైన సూపర్ హిట్ అయిన “అల వైకుంఠపురంలో” సినిమాలో ఒక డైలాగ్ ఉంది – తొంభై తొమ్మిది పరుగులు చేసి అవుటైనా సెంచరీల సంఖ్య సున్న అనే ఉంటుంది అని. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు పరిస్థితికి చక్కగా సరిపోతుంది ఆ మాట. తన రాజకీయ జీవితంలో పక్కా లెక్కలు వేసి, వ్యక్తిగత రాగద్వేషాలకూ, భావోద్వేగాలకూ ఏమాత్రం చోటు లేకుండా నిర్ణయాలు తీసుకునే నాయకుడు చంద్రబాబు.
2014లో వైసీపీతో పోరు చాలా టైటుగా ఉండబోతుందని గమనించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిరాకరించినా, కేంద్ర స్థాయిలో తన పరిచయాలు ఉపయోగించి పొత్తుకు అంగీకరింపజేసుకున్నాడు. కొత్తగా పార్టీ పెట్టి, ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేయని, తన బలమెంతో తనకే తెలియని పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు కోసం తనే స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి, దాదాపు ప్రాధేయపడినంత పని చేసి పొత్తుకు సై అనిపించాడు.
2019లో తప్పిన లెక్క
వందల మంది ఉద్యోగులు, వేల మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించి, నిపుణులు కంప్యూటర్ల సాయంతో విశ్లేషించి ఎన్నికల ఫలితాలు వెల్లడించే సంస్థల కన్నా, కచ్చితంగా ప్రజల నాడి తెలుసుకోగల మేధావి చంద్రబాబు. అంతటి మేధావి వేసిన లెక్క 2019 ఎన్నికల్లో తప్పింది. రాష్ట్రంలో తన విజయం, కేంద్రంలో బీజేపీ పరాజయం ఖాయం అని గట్టిగా నమ్మాడు చంద్రబాబు.
ఆ ధైర్యంతోనే బీజేపీ మీద, ఆ పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ మీద నేరుగా విమర్శలు గుప్పించాడు. ఒకానొక దశలో ఈ విమర్శలు శృతి మించి, కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశాడు. “నేను ఓడిపోతే నాకు మిసెస్ ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది. నీకెవరున్నారు” అని ప్రశ్నించడమే కాకుండా, విజయవాడ సభలో తను వేదిక మీద ఉండగా, బాలకృష్ణ మోడీని ఉద్దేశించి అవాకులు చెవాకులు పేలితే నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు.
ఇది మాత్రమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చిన్నా పెద్దా భావ సారూప్యత లేని పార్టీలతో కలగూరగంప కూటమి ఏర్పాటు చేయడం, దాని గెలుపుకు అవసరమైన డబ్బులు హైదరాబాద్ నుంచి పంపడం కూడా కమలనాధులు గట్టిగా గుర్తు పెట్టుకున్నారు. తీరా ఫలితాలు వచ్చాక తను దారుణంగా ఓడిపోవడం, మోడీ మునుపటి కన్నా బలపడడమే కాకుండా, కేంద్ర స్థాయిలో ఇప్పట్లో మోడీ హవా తగ్గే అవకాశాలు కనిపించక పోవడంతో చంద్రబాబుకు వాస్తవం తెలిసివచ్చి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు
మోడీతో తనకు వ్యక్తిగతంగా విబేధాలు లేవని ప్రకటించడం, చిన్నాచితకా నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడి జన్మదినానికి ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పడం లాంటి చర్యలతో బీజేపీ అధినాయకత్వం కరగక పోవడంతో ఆరెస్సెస్ వైపునుంచి నరుక్కొద్దామని నాగపూర్ వెళ్లి, ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లి వారి అధినాయకత్వంతో మాట్లాడి వచ్చినా, “ఇతనితో ప్రమాదం. దూరంగా ఉంచండి” అని అదే ఆరెస్సెస్ నాయకత్వం కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులను హెచ్చరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంతటితో ఆగకుండా తన రాజ్యసభ్యులను బీజేపీ పార్టీకి అప్పగించినా కమల దళాధిపతులకు చంద్రబాబు మీద కరుణ కలగలేదు.
బెల్లం దగ్గరకే చీమలు చేరుతాయి అన్న సామెత రాజకీయాల్లో కూడా వర్తిస్తుంది. అందుకే రిలయన్స్ సంస్థకి చెందిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం అవసరమైనప్పుడు వైకాపా పార్టీ గుర్తొచ్చింది. రిలయన్స్ తో గతంలో చంద్రబాబుకు ఉన్న బంధం దేశమంతా తెలుసు. అధికారం చేజారగానే రిలయన్స్ కూడా తమ అవసరాలు ఎవరు తీర్చగలరో వారి దగ్గరకు చేరుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజుకు పగ్గాలు అందించింది బీజేపీ అధినాయకత్వం. వచ్చీరాగానే తెలుగుదేశం పార్టీతో జగడమే అని తన వైఖరిని బయట పెట్టారు ఆయన.
కింకర్తవ్యం
గెలిచిన ఇరవై మూడు మందిలో ఇప్పటికే ముగ్గురు జారుకున్నారు. రానిస్తే వైకాపాలోకి, లేదంటే బీజేపీలోకి ఫిరాయించే ఆలోచనలో మరికొంతమంది ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత పట్టుకుని పదిమందైనా మిగులుతారన్న నమ్మకం లేదు. ఎన్నికల తర్వాత దృశ్యం ఇలా ఉండబోతుందన్న అనుమానం ఏమాత్రం వచ్చినా చంద్రబాబు బీజేపీని దూరం చేసుకుని ఉండేవాడు కాదేమో!!