iDreamPost
android-app
ios-app

ఏదో చేద్దామనుకుంటే ఇలా అవుతోందేంటీ..?

  • Published Sep 10, 2020 | 10:31 AM Updated Updated Sep 10, 2020 | 10:31 AM
ఏదో చేద్దామనుకుంటే ఇలా అవుతోందేంటీ..?

కాలం కలిసి రానప్పుడు తాడే పాములా కన్పిస్తుందంట. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పరిస్థితి అలాగే మారిందంటున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు. ప్రజల్లో తిరిగే ఓపికా లేదు, తిరిగితే వారు పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు ఏపీలో లేదు. ఏదో జూమ్‌ను ముందేసుకుని సొంత పార్టీ నాయకులతో మాట్లాడుతూ కాలం గడిపేద్దామన్న ప్రణాళికను వేసుకున్నారు.

దీంతో జిల్లాల వారీగా సమీక్షల పేరుతో జూమ్‌ మీటింగ్‌లు మొదలెట్టారు. ఒక పక్క ప్రజలు ఇచ్చిన తీర్పుతో జనజీవన స్రవంతికి దూరమైపోయిన ఆయన సొంత పార్టీ నాయకులు ఇస్తున్న ట్విస్టులతో మరింతగా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. నిజానికి ఇప్పుడు పెడుతున్న సమీక్షల ద్వారా పార్టీ ప్రస్తుత పరిస్థితి, నాయకుల్లో ఉత్సాహాన్ని బేరీజు వేసుకుని అక్కడ్నుంచి పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలన్న ఉద్దేశంతోనే వీటిని పెడుతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఏ మూల నుంచి మొదలు పెట్టినప్పటికీ విమర్శల జడివానతోనే సమావేశాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకోబోయే స్టాండ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు టీడీపీయే అంతా అన్న స్థితిలో ఉండే జిల్లాల్లోని నేతలు కూడా ఇప్పుడు తమ పరిస్థితికి బాబే కారణం అంటూ కార్నర్‌ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు చేసిన సమీక్షల్లో కొందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కూడా గైర్హాజరయ్యారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. ఎన్నికలప్పుడు ఎవరో ఒకర్ని తెచ్చి తమనెత్తిన కూర్చోబెట్టారని, ఎన్నికలయ్యాక అటువంటి వాళ్ళు పత్తాలేకుండా పోతున్నారని పలువురు టీడీపీ అభిమానులు జూమ్‌ సాక్షిగానే తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించేసారంటున్నారు.

దిగుమతి నాయకుల వల్ల పార్టీకేడర్‌కు అండగా నిలిచేవారే కరువైపోతున్నారన్న అభిప్రాయాన్ని బలంగానే విన్పించినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు హైదరాబాదులో ఉంటూ, ఆన్‌లైన్‌ మీటింగ్‌లతో పార్టీని పటిష్టపర్చడం కుదరదని, ప్రజలకు చేరువగా ఉండాలంటూ టీడీపీ సినీయర్‌ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా తనదైన శైలిలో తేల్చి చెప్పారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌లో ఉన్న భావననే అయ్యన్నపాత్రుడు మొహమాటం లేకుండా వెల్లడించినట్లుగా సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు మద్దతుబాగానే లభిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఏదో ఆశతో జూమ్‌ మీటింగ్‌లకు సిద్ధమైతే నాయకులు క్లాస్‌లు తీసుకోవడం చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తోందంటున్నారు. ఏదో రూపంలో నాయకుల్లో ఉన్న అసంతృప్తిని వెళ్ళగక్కేస్తే, తిరిగి పార్టీకోసం పనిచేస్తారేమోన్న భారీఆశతో ఇబ్బంది ఉన్నప్పటికీ సమావేశాలను కొనసాగిస్తున్నట్లుగా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబు ఆశను పార్టీకేడర్‌ ఎంత వరకు తీరుస్తుందన్నది భవిష్యత్తులోనే తేలాల్సి ఉంది.