Idream media
Idream media
జూమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నడుపుతున్న అమరావతి ఉద్యమ సిరీస్ ల వల్ల బాబుకు ఏం లాభం జరుగుతుందో తెలీదు కానీ.. విశాఖపట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు అమరావతి వాదం వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో తిరగలేని పరిస్థితులు వారికి ఎదురవుతున్నాయి. దానికి కారణం బాబు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకోవడం అంటే… విశాఖ అభివృద్ధిని అడ్డగించడమే. దీంతో తెలుగుదేశం తమ ప్రాంతం అభివృద్ధికి అవరోధంగా మారుతోందని స్థానికులు భావిస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు క్షేత్రస్థాయిలో ప్రజలను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లు ఏ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. ఆ ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడేలా పరోక్షంగా టీడీపీ అధినేత చర్యలు ఉండడం వారికి సంకటంగా మారింది.
మరింత ఆందోళనకు గురి చేసిన పంచకర్ల వ్యాఖ్యలు
కొన్ని రోజుల క్రితం వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఉత్తరాంధ్రపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ఆయన ఈ ప్రాంతంపై విషం చిమ్ముతున్నారని, తనకు సంబంధించిన మనుషులే అభివృద్ధి చెందాలి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని తమను చంద్రబాబు రెచ్చగొట్టారని అసలు విషయం బయటపెట్టారు. తమ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేక టీడీపీని వీడినట్లు స్పష్టం చేశారు. పంచకర్ల వ్యాఖ్యలు విశాఖ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీలో కలకలం రేపాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామం కూడా నగరానికి చెందిన ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి పెరగడానికి కారణమవుతోంది.
ఊపందుకున్న రాజీనామాల డిమాండ్
విశాఖ జిల్లా మొత్తంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కేవలం విశాఖ నగరంలో మాత్రమే నాలుగు సీట్లు లభించాయి. గంటా శ్రీనివాసరావుతో పాటు, గంటా వెంకటరెడ్డి నాయుడు (గణబాబు), వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గంటా శ్రీనివాసరావు టీడీపీ కి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ఎప్పటి నుంచో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీలో చేరిక ఏర్పాట్లు భారీ స్థాయిలో ఉండాలని ఆయన భావిస్తుండడం, కరోనా నేపథ్యంలో ఆ పరిస్థితి లేకపోవడంతో గంటా వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేల ఉద్దేశాలు ఎలాగున్నా.. జనం మాత్రం టీడీపీకి రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఇటీవల విశాఖ నగరంలో చేపట్టిన ర్యాలీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణం పార్టీకి రాజీనామా చేయాలని నగరవాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తీవ్రంగా ఒత్తిడికి గురి అవుతున్నట్లు తెలుస్తోంది.