iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కరోనా కూడా మినహాయింపు కాలేదు. కరోనా కేసుల ఆధారంగా రాజకీయాలు నడిపేందుకు విపక్షం చేస్తున్న యత్నాలు దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్న చంద్రబాబు తాజాగా ఆన్ లైన్ లో సాగిస్తున్న వ్యవహారం దానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ అందరూ మానవత్వంతో చేతులు కలుపుతుంటే ఏపీలో టీడీపీ నేతలు మాత్రం బురదజల్లడానికే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రయత్నించాల్సిన ప్రతిపక్షం దానికి భిన్నంగా సాగుతోంది. ప్రజల కష్టాలను కూడా తమ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. కరోనా విరుచుకుపడుతున్న కాలంలో కూడా వారి మనసు మారుతున్న దాఖలాలు కనిపించడం లేదు. లాక్ డౌన్ మొదలయిన మార్చి నెల నుంచీ అదే తీరులో తెలుగుదేశం కొనసాగడం విస్మయకరం.
తాజాగా చంద్రబాబు ఆన్ లైన్లో డాక్టర్లతో ఓ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన వ్యవహారం, విమర్శలు గమనిస్తే ప్రజలకు సేవ చేయడానికి కాకుండా, ప్రభుత్వాన్ని నిందించడానికే తామున్నామని ఆయన చెప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనాకి సంబంధించి టీడీపీనేతలు తమ స్థాయికి తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. కీలక నేతలే హైదరాబాద్ కి పరిమితం అయిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఏమేరకు వారు చేదోడు అందించగలరన్నది అంతుబట్టని అంశంగా మారింది. తాము చేయాల్సింది చేయకపోగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏపీలో కరోనాపై నిత్యం అధ్యయనం చేస్తూ వాటిని కేంద్రానికి పంపిస్తున్నామని ఆయన ప్రకటించారు. తద్వారా ఏపీ ప్రజలకు , ప్రభుత్వానికి అవసరమైన సమయంలో అందుబాటులో ఉండకుండా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే విమర్శలకు తగ్గట్టుగా వ్యవహరించారు.
క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న బాధితులకు మొత్తంగా చూస్తే తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నట్టు అనేక మంది చెబుతున్నారు. చివరకు బ్రిటన్ కి చెందిన ఓ యాత్రికుడు తిరుపతి క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు గమనార్హం. తాన తన దేశంలో ఇంట్లో ఉన్నా ఇంత చక్కటి వైద్యం , సహాయం అందకపోయేదని అతను వ్యాఖ్యానించాడు. కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో క్వారంటైన్లో తగిన సదుపాయాలు లేవని, కనీసం మందులు కూడా లేవని నిందలు వేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం కరోనా వైద్యం నిమిత్తం అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించి, రెమిడెసిమర్ మందు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాల్లో ఉంటే చంద్రబాబు చేస్తున్న విమర్శలు అందరినీ విస్మయానికి గురిచేస్తన్నాయి. తొలుత కొన్ని చోట్ల ఆహారం విషయంలో విమర్శలు వచ్చిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నేరుగా మంత్రి అనిల్ కుమార్ లాంటి వాళ్లు క్వారంటైన్ సెంటర్లకు వెళ్లి ఆహారం పరీక్షించిన విషయం అందరికీ తెలుసు. కానీ విపక్షం మాత్రం తమ ఇంట్లో ఉండి రాళ్ళేసే ప్రయత్నం చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది.
కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైనంత మేరకు సదుపాయాలు కల్పించడం సర్కారుకి కూడా సవాల్ గా మారుతోంది. అయినప్పటికీ 72వేల క్వారంటైన్ కేంద్రాల బెడ్లతో పాటుగా ఆసుపత్రుల్లో 39450 బెడ్లు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం చెబుతోంది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత తీర్చడానికి తలమునకలై ఉంది. ఇలాంటి సమయంలో విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూడడం బాధ్యతారాహిత్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే యత్నమే తప్ప బాధ్యతగల విపక్షం పాత్రలా లేదని పలువురు భావిస్తున్నారు. ఓవైపు సీపీఎం లాంటి చిన్న పార్టీలకు చెందిన కార్యకర్తలు క్వారంటైన్ కేంద్రాలలో వాలంటీర్లుగా పనిచేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం సొంత ఇళ్ల నుంచి విమర్శలకు పరిమితం కావడం గమనిస్తే టీడీపీ తీరు ఎలా ఉందన్నది అర్థమవుతోంది. ప్రజల సమస్యలను కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని చంద్రబాబుకి ఎప్పటికి అర్థమయ్యేనో ఏంటో…