iDreamPost
android-app
ios-app

Chandrababu – మాఫీ హామీలతో ముంచేసిన బాబు- ఓటీఎస్ పై మళ్లీ అదే మాయాజాలం

  • Published Dec 08, 2021 | 12:18 PM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Chandrababu – మాఫీ హామీలతో ముంచేసిన బాబు- ఓటీఎస్ పై మళ్లీ అదే మాయాజాలం

ఓటీఎస్ డబ్బులు ఎవరూ కట్టొద్దు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు తమ ప్రభుత్వమే ఉచితంగా హక్కు పట్టాలు ఇస్తుందని ఆ పార్టీ గల్లీ లీడర్ నుంచి లోకేష్, చంద్రబాబు వరకు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు ఉద్దేశాలను, దాని వల్ల లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలను ప్రజలు గ్రహించకుండా వారిని తప్పుదారి పట్టిస్తోంది. అయితే చంద్రబాబు మాయాజాలాన్ని.. గతంలో ఇటువంటి హామీలే ఇచ్చి రైతులను, డ్వాక్రా మహిళలను ఆయన నిండా ముంచేసిన తీరును గుర్తు చేసుకుంటున్న ప్రజలు టీడీపీ నేతల హామీలను విశ్వసించడంలేదు. ఇప్పుడిప్పుడే జగన్ ప్రభుత్వం తెచ్చిన గృహహక్కు పథకంపై అవగాహనకు వచ్చి ఓటీఎస్ డబ్బులు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు.

రైతులను మోసం చేశారు

రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు మాఫీ చేయకుండా కోటయ్య చౌదరి కమిటీ వేసి.. దాని సూచనల పేరుతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ ఏవో సాకులు చెప్పి మొత్తం రూ.87,612 కోట్ల రుణాలకు గాను రూ.25 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని తేల్చేశారు. ఆ మొత్తాన్ని ఐదేళ్లలో ఐదు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. చివరికి రూ.15 వేల కోట్లే మాఫీ చేసి చేతులెత్తేశారు. రైతులను నిలువునా ముంచేశారు. మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు రుణాలు చెల్లించలేదు. దాంతో అసలు, వడ్డీలు కలిసి తడిసి మోపెడు కావడంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోయారు.

పొదుపు మహిళలకు అదే అనుభవం

రైతులకు ఇచ్చినట్లే లక్షలాది పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని నమ్మబలికి 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు వారికి మొండి చెయ్యి చూపారు. 2014 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 78.76 లక్షల మంది డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14,204 కోట్ల మేరకు ఉన్నాయి. వీటిని మాఫీ చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాయ చేశారు. పూర్తిగా మాట మార్చారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేసి ఆలోచనే లేదని అసెంబ్లీలోనే బొంకారు. అప్పటి మంత్రి పరిటాల సునీత ఈ విషయం ప్రకటించారు. దాంతో మహిళలు నీరుగారిపోయారు. కానీ నేనున్నానంటూ జగన్ ముందుకొచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే ఆ రుణాలు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. 2019 ఏప్రిల్ నాటికి ఆ రుణాలు, వడ్డీలు కలిపి రూ. 25,517 కోట్లకు ఎగబాకాయి. అయినా జగన్ వెనుకంజ వేయకుండా విడతల వారీగా చెల్లింపు ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ. 12,759 కోట్లు చెల్లించారు.

ఓటీఎస్ పేరుతో మరో మోసానికి యత్నం

ఈ రెండే కాదు చాలా అంశాల్లో ఇచ్చిన మాటపై నిలబడకుండా ప్రజలను ముంచేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. రాజకీయ ప్రయోజనాల కోసం గృహహక్కు ఓటీఎస్ పథకంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఉచితంగా పట్టాలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. కానీ 2014-19 మధ్య ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇళ్ల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని అధికారులు సుమారు ఐదుసార్లు ప్రతిపాదనలు సమర్పించినా పట్టించుకోలేదు. వడ్డీ మాఫీకే అంగీకరించని చంద్రబాబు.. ఇప్పుడు పూర్తి రుణం మాఫీ చేసి పట్టాలు ఇస్తామని చెబితే నమ్మగలమా?

Also Read : CM YS Jagan, OTS Scheme – ఓటీఎస్‌ పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌