iDreamPost
iDreamPost
చంద్రబాబు పరిస్థితి రానురాను వేగంగా తిరోగమిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ తీరంలో టీడీపీ పరిస్థితి పూర్తి దయనీయంగా మారుతోంది. నెల రోజుల వ్యవధిలో ఆపార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు కూడా గుడ్ బై చెప్పేశారు. టీడీపీకి ఝలక్ ఇచ్చి జగన్ పంచన చేరిపోయారు. అసలే రాష్ట్రమంతా అంతంతమాత్రంగా మారుతున్న టీడీపీకి కాస్త పట్టుందని భావించిన విశాఖ నగరంలో కూడా ఇప్పుడు దిక్కులేని పరిస్థితి ఏర్పడుతోంది. ఓవైపు పార్టీ కార్యకర్తలు ఇప్పటికే పలువురు ఇతర పార్టీలలో చేరగా, తాజాగా నాయకులు కూడా జంప్ జిలానీలుగా మారుతున్న తరుణంలో తెలుగుదేశం ఇప్పుడు తీరం తెలియని నావలా మారుతోంది.
ఒక్కొక్కరుగా పార్టీ నేతలు దూరమవుతున్న తరుణంలో చంద్రబాబు విపక్ష నేత హోదాకి గండిపడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ గట్టెక్కాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఓవైపు మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయిన కార్యకర్తలను ఉత్సాహ పరిచేలా మాట్లాడుతున్నా ఎవరూ విశ్వసించడం లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. చివరకు వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబీకులు వైఎస్సార్సీపీ కండువాని కప్పుకున్న సమయంలో పార్టీ నేతలతో సమావేశం పేరుతో చంద్రబాబు ఓ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు అధికారంగా ఆపార్టీ ప్రకటన చేసింది. కానీ తీరా చూస్తే సదరు సమావేశానికి హాజరయిన నేతలెవరన్నది చెప్పలేకపోయింది. రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులిద్దరూ పార్టీని వీడినా చివరకు విశాఖలో ఒక్క నేత కూడా ముందుకొచ్చి వారిని ఖండించలేని పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి వాసుపల్లి గణేష్ కి వ్యతిరేకంగా అందరూ ప్రకటనలు ఇవ్వాలని, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని టీడీపీ అధిష్టానం చాలామంది నేతల మీద ఒత్తిడి చేసింది. కానీ ఒక్కరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవు. చివరకు మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదు. దాంతో టీడీపీ అధినేత తలలు పట్టుకోవాల్సి వచ్చింది. స్వయంగా తానే సీన్ లోకి వచ్చి ఓ సమావేశం పెట్టినట్టు, వాసుపల్లి గణేష్ తీరుని తప్పుబట్టినట్టు ప్రకటన చేసుకునే స్థితి వచ్చేసింది. వాస్తవానికి ప్రస్తుతం విశాఖ టీడీపీలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు భరత్ పూర్తి మౌనం పాటిస్తున్నారు. నార్త్ ఎమ్మెల్యే గంటా దాదాపు దూరమయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు జారిపోగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మిగులుతారనే ధీమా టీడీపీలో కనిపించండం లేదు. టీడీపీ సినియర్ నేతలు కూడా విశాఖలో టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రధానంగా రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరితో ఆయన కనీసం నగరం వైపు చూడడానికి కూడా పరిస్థితులు సానుకూలంగా లేవని భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి టీడీపీ అధినేత ఎన్నడూ ఊహించి ఉండరు. విశాఖకి తాను ఎంతో చేశానని చెప్పుకుంటూ, చివరకు ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిని అడ్డుకునే యత్నం చేయడంతో ఆయన పరువు విశాఖలో సముద్రం పాలయ్యింది. మళ్లీ టీడీపీ కోలుకుంటుందనే ధీమా కనిపించడం లేదు. దాంతో అయ్యో చంద్రబాబు అంటూ విశాఖ వాసులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.