iDreamPost
iDreamPost
మోడీని ఇకపై కలవబోనూ అంటూ ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు ఆయన్ని కలిసేందుకు ఎదరుచూస్తుంటారు. అమిత్ షా ఏపీకి వస్తే రాళ్లేయిస్తారు. ఇప్పుడు ఆయన ఫోన్ కాల్ కోసం కళ్లు కాయలు కాసేలా చూడాల్సిన స్థితిని కొనితెచ్చుకుంటారు. అందుకే చంద్రబాబు యూటర్న్ ల పరంపర కొత్త పుంతలు తొక్కుతోంది. ఆయనలో అసహనం ప్రదర్శించేందుకు చేసిన హస్తిన యత్నం ఎదరుచూపులతో సరిపోతోంది. కేవలం రాష్ట్రపతి మినహా ఇతర నేతలెవరూ స్పందించకపోవడంతో టీడీపీ నేతల్లో ఇదో వృధా ప్రయత్నమనే అభిప్రాయం బలపడుతోంది. ఏపీ రాజకీయాలను ఢిల్లీలో చాటాలని చేసిన యత్నం విఫలమయ్యిందని లోలోన మథనపడాల్సి వస్తోంది.
చంద్రబాబులో కూడా ఈ అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రపతికి వినతిపత్రం అందించిన తర్వాత ఆయన విమర్శలున్నాయి. నిజానికి ఏపీలో గంజాయి సాగు టీడీపీ హయంలోనే విస్తరించిందనే వాస్తవాన్ని ఆయన కప్పిపుచ్చాలని చూస్తున్నారు. కానీ ఆనాటి ఆయన క్యాబినెట్ సహచరులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడి మాటల్లోనే నిరూపితమయ్యింది. విశాఖ కేంద్రంగా గంజాయి సాగు పెరిగిందని, అదే దేశమంతటా తరలిస్తున్నారని ఆనాటి ఇద్దరు మంత్రులు అంగీకరించిన విషయాన్ని చంద్రబాబు దాచిపెట్టాలనే యత్నం బెడిసికొడుతోంది. అంతేగాకుండా టీడీపీ నేతలే ఈ గంజాయి సాగులో భాగస్వాములంటూ అయ్యన్న మాటలు జనం మరచిపోలేదు. అయినా గానీ చంద్రబాబు మాత్రం ఏపీలో రూ. 8వేల కోట్ల విలువైన గంజాయి సాగు జరుగుతోందని, అక్రమార్కుల చేతుల్లో అదో పెద్ద ఆదాయ వనరుగా మారుతోందని చెప్పడం విడ్డూరంగా ఉంది.
గురువింద సామెతను తలపిస్తూ ఏపీలో ఉన్మాద పాలన అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరినీ నోరెళ్లబెడుతోంది. చివరకు తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయి బ్రాహ్మణులపై స్వయంగా సీఎం హోదాలో ఆయనే చిందులేసిన తీరు మరచిపోయినట్టున్నారు. ఇప్పుడు మాత్రం ఉన్మాద పాలన అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మోడీ కి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని, అమిత్ షా మీద దాడులు కూడా చేయించిన రోజులు మరచిపోయినట్టున్నారు. అలా దాడులు చేసిన వారందరికీ తన పార్టీలో పదవులు కట్టబెట్టిన వైనం కూడా జనం గుర్తించకూడదని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి అనేక పనులతో ఏపీ పరువు తీసి ప్రజలకు దూరమయిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం ఆయన నైజాన్ని చాటుతోంది. తాము అధికారంలో లేకపోతే సహించలేమనే రీతిలో టీడీపీ తీరు కనిపిస్తోంది.
గుజరాత్ లో పోర్టులో హెరాయిన్ పట్టుబడితే అక్కడి ప్రభుత్వాన్ని నిందించాలి. అలా కాకపోతే కేంద్రం మీద దండెత్తాలి. కానీ చంద్రబాబు మాత్రం ఏపీని బద్నాం చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. జగన్ మీద గురిపెట్టి రాష్ట్రాన్ని అవమానించడానికి సైతం సిద్ధపడడం లేదు. నిజంగా ఏపీ డ్రగ్స్ కి హబ్ గా మారితే రాష్ట్రంలో కూడా పోర్టులున్నాయి కదా… ఇక్కడికే ఆ కంటైనర్లు రావాలి కదా, గుజరాత్ ఎందుకు పోయాయి అంటే మళ్లీ వక్రీకరణలే. కేవలం విజయవాడ అడ్రస్ తో ఉన్న వ్యక్తి చేసిన నేరాన్ని ఏపీ అంతటికీ ఆపాదించి ప్రజలను సైతం అనుమానించేందుకు చంద్రబాబు సిద్ధపడిపోయారు. దేశంలోనే డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్న ప్రాంతం ముంబై, హైదరాబాద్. యువత మీద అంత ప్రేమ ఉంటే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిలదీయాల్సిన జాతీయ నాయకుడు జాతి లక్ష్యాల కోసం ఏపీని కించపరచాలనే ప్రయత్నం సాగించడం విస్మయకరంగా ఉంది.
Also Read : Pattabhiram Absconded – అజ్ఞాతంలోకి పట్టాభి.. ఆ భయమే కారణమా..?
డీజీపీని రీకాల్ చేయాలని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇలా ఏది తోస్తే దానిని పట్టుకుని మాట్లాడుతున్న బాబు ధోరణి టీడీపీ శ్రేణులను కూడా తలపట్టుకునేలా చేస్తోంది. ఒకనాడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేతగా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు చివరకు ఇప్పుడు తనకు అపాయింట్ మెంట్ కోసం వేచి చూడాల్సిన స్థితి తెచ్చుకోవడాన్ని వారంతా స్వయంకృతాపరాధంగా చెబుతున్నారు. కేవలం రాష్ట్రపతి మినహా ప్రధాని, హోం మంత్రి కూడా మొఖం చాటేస్తే ఏపీలో తలెత్తుకోలేని స్థితిలో తిరిగివెళ్లాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. ఎంత హడావిడి చేసినా హస్తినలో పలకరించే వారే కరువు కావడం చంద్రబాబు పతనానికి నిదర్శనంగా అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అతి అంచనాలతో టీడీపీని మరింత ఇరకాటంలో పెడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తుండడం విశేషం.