రాజకీయాల్లో అపర చాణుక్యుడినని తనకు తాను చెప్పుకొనే.. తన పార్టీ వందిమాగదుల ద్వారా భజన చేయించుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు మార్చడంలోనూ తనను మించిన వారు లేరనే ఘన కీర్తిని సొంతం చేసుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా..లేనప్పుడు మరోలా పలు అంశాలను అన్వయించడం ఆయనకు అలవాటు.
గతంలో ఆంధ్ర, తెలంగాణ విభజన సమయంలో అనుసరించిన రెండు కళ్ళ సిద్ధాంతం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని ఒకసారి.. కాదు ప్రత్యేక ప్యాకేజి అని భిన్న భావనలు వ్యక్తం చేయడం ఎన్డీయేతో చెలిమి విషయంలో 2014లో ఒకలా..2019లో మరోలా వ్యవహరించి మాటలు మార్చడంలో కూడా తనను మించిన వారు లేరని నిరూపించుకున్న చంద్రబాబు తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ రెండు నాలుకలా ధోరణి బయటపెట్టారు. ఈ ఎన్నికల పోలింగ్ ముందు ఒకలా మాట్లాడిన ఆయనగారు.. ఫలితాల అనంతరం మరో భాష్యం చెప్పడం ఆయన పట్ల ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయేలా చేస్తోంది.
పోలింగుకు ముందు అలా.. ఫలితాల తర్వాత ఇలా..
ఆదివారం ప్రకటించిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ 99 శాతం ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లను కైవసం చేసుకొని టీడీపీని చావుదెబ్బ తీసింది. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ పరామర్శకు వెళ్లిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే తమ పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిందని కొత్త వాదన వినిపించారు. తద్వారా ఈ ఎన్నికలకు ప్రజామోదం లేదని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆనాడు తమ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తుందని ప్రకటించినప్పుడు ఆయన చెప్పిన కారణాలు వేరు. రాజకీయ కోణంలోనే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడించారు.
ఏకగ్రీవాల్లో అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్, పోలింగ్ మధ్య నాలుగు వారాల గడువు ఇవ్వలేదని, మొత్తం ఎన్నికలను ఆగిన చోట నుంచి కాకుండా.. మొదటి నుంచి మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి టీడీపీ నేత వర్ల రామయ్య ద్వారా వినతిపత్రం కూడా ఇప్పించారు. ఆమె దానికి అంగీకరించక పోవడంతో ఎన్నికలకు వ్యతిరేకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. చివరికి తమ పప్పులు ఉడకవని, ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి.. ముందుగానే తప్పుకున్నారు. ఊహించినట్లే ఫలితాలు ఏకపక్షంగా రావడం.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ దెబ్బతినడంతో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ప్రజలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు బుకాయిస్తున్నారు.
అన్యాయం జరిగితే ఓట్లెందుకు వేస్తారు?
ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఎలా అన్యాయం జరుగుతుందో మాత్రం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సెలవివ్వలేదు. పోనీ ప్రభుత్వం ఏమైనా ప్రజలను ఓట్లు వేయనివ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకుందా అంటే అదీ లేదు.. గతంలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో భారీ పోలింగ్ నమోదైంది. ఇక ఓట్ల లెక్కింపులో తారుమారు జరిగాయనడానికి ఏమాత్రం అవకాశం లేదు. రాష్ట్రంలో అన్నిచోట్లా భారీ మెజారిటీలతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయాలు సాధించారు.
మరి ఇంకే విధంగా ప్రజలకు అన్యాయం జరిగిపోయిందో చంద్రబాబే వివరణ ఇవ్వాలి. గత ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం పంచాయతీలను అధికార పార్టీ గెలుచుకుంటే.. పార్టీ గుర్తులతో జరగలేదు కనుక అది లెక్కే కాదన్నారు. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం వైఎస్సార్సీపీ గెలిచినప్పుడు ఇంకేవో సాకులు చెప్పారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో లేకపోవడం వల్లే అధికార పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని, అసలు అవి ఎన్నికలే కావన్నట్లు చంద్రబాబు సహా టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. చంద్రబాబు బ్యాచ్ ఒప్పుకోనంత మాత్రాన అవి ఎన్నికలు కాకుండా పోవు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు తెలుసు తమెవరిని గెలిపించామో.. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిది.