iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ గతమెంతో ఘనం. కానీ ఇప్పుడు ఉనికి కోసం నానా తిప్పలు పడుతోంది. ఏపీలో పంచర్ అయిపోయిన సైకిల్ ముందుకు సాగడమే కష్టంగా మారగా.. తెలంగాణలో శిథిలమైపోయింది. ఇందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయం తప్పిదాలే కారణం. పేరుకు జాతీయ పార్టీనే అయినా ఒక్క రాష్ట్రానికే మిగిలిపోయింది. తెలంగాణలో దాదాపు ఖాళీ అయింది. ఏపీలో కాంగ్రెస్ ఎలా ఉందో.. తెలంగాణలో టీడీపీ అలానే ఉంది. అయినప్పటికీ చంద్రబాబులో మాత్రం ‘దింపుడు కళ్లెం ఆశలు’ మాత్రం పోలేదు. అందుకే టీటీడీపీ బతికే ఉంటుంది అని చెబుతున్నారు. కానీ ఇందులో ఆయన నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. తాను ఏం చేయలేనని బాబు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయండి.. పోరాటాలు చేయండి.. అంటూ టీటీడీపీ నేతలకు చెబుతున్నారే కానీ.. ‘నేనున్నా.. ముందుండి నడిపిస్తా’ అని మాత్రం చెప్పట్లేదు.
‘ఓటుకు నోటు’ కేసుతో మొదలు
తెలంగాణ గడ్డపైనే పుట్టిన తెలుగుదేశం అక్కడ ముమ్మాటికీ కొనసాగి తీరుతుందని, పార్టీ ఆవిర్భవించిన కొన్నాళ్లకే చరిత్ర సృష్టించిందని.. ఇప్పుడు మరో చరిత్ర సృష్టిద్దామని టీటీడీపీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అక్కడ అంత సేన్ లేదనే విషయం అందరికీ తెలుసు. ఇందుకు ముఖ్య కారణం ‘ఓటుకు నోటు’ కేసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం కోట్లు ఇవ్వబోయి బాబు అండ్ కో అడ్డంగా దొరికిపోయారు. ఈ దెబ్బతో హైదరాబాద్ ను వదిలిపోయి అమరావతి చేరుకున్నారు చంద్రబాబు. ఆ దెబ్బకు మళ్లీ ఇటు వైపు చూడలేదు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో టీడీపీకి కష్టకాలం మొదలైంది. పార్టీ మొత్తం ఖాళీ అయింది. వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నేతలు కూడా టీడీపీలో లేరు. పేరుకు పార్టీ మాత్రం మిగిలింది.
Also Read : టీడీపీ ఇక ఆంధ్రా పార్టీయే?
మీ చావు మీరు చావండి
స్వయంకృతాపరాధంతో ఏపీలో అధికారం కోల్పోయారు చంద్రబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అనేది కూడా అనుమానమే. ఏపీలో పార్టీని నిలబెట్టుకోవడమే చంద్రబాబుకు కష్టంగా మారింది. ఇక తెలంగాణలో ఏం చేస్తారు. అందుకే టీటీడీపీ నేతలకు ‘మీరే బలపడాలి.. మీరే కష్టపడాలి’ అని హితోబోధ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, ప్రజలతో మమేకమవ్వాలని అంటున్నారు. అంతేనా.. తాను ప్రతినెలా సమయమిస్తానని, సమీక్షిస్తానని భరోసా ఇచ్చారట. పరోక్షంగా ‘మీ చావు మీరు చావండి’ అని చెప్పేశారాయన.
ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెడుతారట
ఇన్నాళ్లూ టీడీపీని మోసిన ఎల్.రమణ తన దారి తాను చూసుకున్నారు. సైకిల్ దిగి కారు ఎక్కారు. ఉన్న ఆ ఒక్కరూ పార్టీని వీడి వెళ్లిపోయారు. దీంతో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారట. ముగ్గురు నుంచి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారట. నిజానికి అంత మంది నేతలు ఆ పార్టీలో ఉన్నారా? అనేది కూడా డౌటే. పేరుకే ఉన్న పార్టీకి ఎంతమంది అధ్యక్షులు, ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటే ఏం లాభం. మొత్తానికి తన నిస్సహాయతను బయటపెట్టుకున్న చంద్రబాబు నాయడు.. తానేం చేయలేనని పరోక్షంగా ఒప్పుకున్నారు. పార్టీని మీరే నిలబెట్టుకోండి అంటూ టీటీడీపీ నేతలకు తేల్చిచెప్పారు. మునిగినా, ముంచినా ఇక స్థానిక నేతలదే భారమన్నమాట.
Also Read : ఏపీ ఆర్థిక దుస్థితికి, అప్పులకు అసలు కారణాలు ఈనాడు బయటపడ్డాయ్