iDreamPost
iDreamPost
వైసీపీ పార్టీ అధికారం చేపట్టాక మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి ఏడాది పూర్తయ్యేలోపే దాదాపు 90 శాతం హామీలను అమల్లోకి తేవడం తెలిసిన విషయమే . రెండో సంవత్సరం కూడా కరోనా సంక్షోభంలోనూ ఆ హామీలను అమలుచేయడమే కాక మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవడం సహజంగానే టీడీపీ పార్టీ నాయకులకు కంటగింపుగా మారింది . 2014 ఎన్నికల ముందు 650 హామీలతో , పలు పథకాలతో టీడీపీ పార్టీ జంబో మేనిఫెస్టో రూపొందించి పలు పార్టీల , సామాజిక వర్గ సంఘాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయా హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదన్నది తెలిసిన విషయమే .
అయితే ప్రధాన హామీలైన రైతు రుణమాఫీ , డ్వాక్రా రుణమాఫీ , వ్యవసాయం కోసం బంగారు నగల తాకట్టు రుణాలు మాఫీ , కాపు కార్పోరేషన్ కి 5000 కోట్ల బడ్జెట్ , ఎన్టీఆర్ సుజల స్రవంతి , నిరుద్యోగ భృతి లాంటి ప్రధాన హామీల అమలులో బాబు ద్వంద్వ వైఖరి విమర్శల పాలు కావడమే కాక రైతులు , మహిళలు , నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చింది . వ్యవసాయ రుణాలు సంపూర్ణ మాఫీ అని అధికారంలోకి వచ్చాక 86 వేల కోట్ల ఋణాల్లో 24 వేల కోట్లే మాఫీకి అర్హులుగా ప్రకటించి ఐదేళ్లలో ఐదు విడతలుగా ఇస్తానని చివరికి మూడు విడతలుగా 16000 కోట్లు మాత్రమే మాఫీ చేయడం , డ్వాక్రా రుణాలు మాఫీ అని వంచించి ఐదేళ్లు తీర్చకుండా ఎన్నికల ముంగిట పసుపు కుంకుమ అంటూ చేసిన హడావుడి , కాపు కార్పోరేషన్ పేరిట చేసిన మోసాలు గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు .
మేనిఫెస్టో హామీలు తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు , కరోనాను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం పై బురద చల్లడమే పనిగా పెట్టుకొన్న చంద్రబాబు , టీడీపీ నేతలు తమ హయాంలో నెరవేర్చని టీడీపీ మేనిఫెస్టోలోని పలు హామీలను వైసీపీ నెరవేర్చాలని విచిత్ర వాదనలు చేయడంతో పాటు వాటి కోసం దీక్షలు సైతం చేసి నవ్వులపాలు అయ్యారు . దీనితోపాటుగా కొత్తగా తమ హయాంలో చేసిన వ్యూహాత్మక తప్పులు , ఆర్ధిక అవకతవకలను కూడా వైసీపీ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు .
రైతు రుణమాఫీ రెండు విడతలు ఎగ్గొట్టాము , మీరు చెల్లించండి అంటూ స్వయంగా బాబు డిమాండ్ చేయగా . ఐదేళ్లకు గాను కేవలం చివరి నాలుగు నెలలే నిరుద్యోగ భృతి ఇచ్చాం . అదీ 12.26 లక్షల మందికి అని చెప్పి 1.8 లక్షల మందికే రెండు వేల కాడికి ఇచ్చాం . ఇప్పుడు మీరు 12 లక్షల మందికి మూడు వేల చొప్పున ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇవ్వనందుకు బకాయి కింద కట్టి చెల్లించండి అంటూ టీడీపీ నేతలు దీక్షలు చేయడం విడ్డూరం . టీడీపీ దిగిపోయేనాటికి వివిధ శాఖలు , స్థానిక సంస్థలలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు 2017 నుండి 48000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా ఆయా నిధుల్ని ఎన్నికల ముంగిట ఓటర్ల ఖాతాల్లో తాయిలాలుగా వేసిన బాబు ఇప్పుడు అవి పూర్తిగా చెల్లించలేదని సన్నాయి నొక్కులు నొక్కడంతో ఆశ్చర్యపోవడం గుత్తేదార్ల వంతు అయ్యింది .
Also Read : నిస్సహాయతను చాటుతున్న బాబు.. తమ్ముళ్లకు ఇకనైనా అర్ధం అవుతుందా..?
విభజన హామీ ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాని నాటి టీడీపీ మిత్రపక్షం బీజేపీతో కలిసి తుంగలో తొక్కి ప్రత్యేక ప్యాకేజీ అంటూ హడావుడి చేసిన బాబు హోదా వద్దు ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అసెంబ్లీ సాక్షిగా తీర్మానించి , ప్యాకేజి రావటానికి తోడ్పడ్డ మహానుభావుడు అంటూ బిజెపి నేత వెంకయ్యనాయుడికి అరవై ఆరు లక్షల రూపాయల ఖర్చుతో పలు సార్లు శాలువాలు కప్పి సన్మానించారు . ఆ సమయంలో విపక్షం హోదా పై పలు ఉద్యమాలు చేయగా హోదా అంటే జైలుకే అని హుంకరించిన బాబు హోదా ఏమైనా సంజీవనా దాని వలన ఏమొస్తుంది నాకు ట్యూషన్ చెప్పండి అని ఎగతాళి చేసి ఎన్నికల నాటికి ప్రజల్లో వ్యతిరేకత గమనించి బీజేపీతో తెగతెంపులు చేసుకొని హోదా పేరిట పదుల కోట్లు ఖర్చు చేసి దీక్షలు నిర్వహించారు . అసెంబ్లీ సాక్షిగా హోదా హక్కుని చంపేసి నేడు మీరు సాధించండి అంటూ వైసీపీని డిమాండ్ చేస్తున్నారు బాబు .
విభజన చట్టం ప్రకారం తెలంగాణాకు అవసరమైన విద్యుత్ ఏపీ సరఫరా చేసినందుకు 2016 నాటికి 5100 కోట్లు ఏపీకి రావాలని వడ్డీతో సహా 5732 రావాలని NCLT(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) లో కేసు వేశామని ఎన్నికల ముందు చెప్పిన బాబు ఆ బకాయి కోసం తెలంగాణాని ఆ కాలంలో ఎందుకు డిమాండ్ చేయలేదో , ఎన్నికల ముంగిట బాబు ఆరోపించిన తర్వాత తెలంగాణా ప్రభుత్వం తామేమి బకాయి లేమని ఒకవేళ ఉంటే ఏపీ ప్రభుత్వం లెక్కలతో చర్చకు వస్తే ఒక్కరోజులో చెల్లిస్తామని కోరగా ఎందుకు లెక్కలతో సహా వెళ్లి చర్చించి వసూలు చేయలేదో బాబుకే తెలియాలి .
ఇప్పుడు అదే కోవలో మరో అంశం పై తమ ప్రభుత్వ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వం పై రుద్దబోయి అభాసుపాలయ్యారు చంద్రబాబు . రాష్ట్ర విభజన తర్వాత పంపకాలలో భాగంగా అప్పుల్నీ ఇరు రాష్ట్రాలకూ పంచగా ఇరు రాష్ట్రాల వాటాని ఆంధ్రప్రదేశ్ ఖజానా నుండి కేంద్రానికి చెల్లించే ఏర్పాటు చేశారు . తరువాత తెలంగాణా వాటా కింద ఏపీ చెల్లించిన మొత్తాన్ని తెలంగాణా ప్రభుత్వం ఏపీ ఖజానాకు సర్దుబాటు చేస్తుంది .
ఈ వెసులుబాటుని తెలివిగా వాడుకొన్న బాబు ఇరు రాష్ట్రాలవి కలిపి చెల్లించిన రుణాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించిన విధంగా లెక్క చూపి అదనంగా రుణం పొందే వెసులుబాటు పొందారు . ఈ విధంగా 2016-17 ఆర్ధిక సంవత్సరం నుండి 2019-20 వరకూ నాలుగేళ్లలో తెలంగాణా చెల్లించిన 15025 కోట్లకు ప్రతిగా ఆ కాలంలో అదనంగా రుణం పొందారని నిర్ధారించిన కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రుణ పరిమితిని ఆ పదిహేను వేల కోట్ల మేర తగ్గించివేయడం కరోనా కారణంగా ఆర్ధికంగా ఇక్కట్లు పడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆశనిపాతం అని చెప్పొచ్చు .
Also Read : టీడీపీ తీరు మారడం లేదు, అందుకే అన్నిసార్లు అలా దొరికిపోతున్నారు..
ఈ అంశాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పై రుద్దే యత్నం చేసిన బాబు పయ్యావుల కేశవ్ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖని బయటపెట్టి వైసీపీ పై విమర్శలు గుప్పించి ఇవి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అవకతవకల వలన విధించిన కోత కదా అని పలు వర్గాల నుండి విమర్శలు రావడంతో ఇటీవల బాబు తీరుతో ఇలా విమర్శల పాలవుతున్నామని టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు .
అర్ధం కాని విషయం ఏంటంటే తెలంగాణా చెల్లించిన రుణాన్ని కూడా తమ పద్దులో చంద్రబాబు చూపించి 15000 కోట్ల మేర మోసపూరితంగా రుణం పొందితే . మరి తెలంగాణాకు ఋణపరిమితి ఎలా నిర్ధారించారు . ఏదేని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో అప్పు ఎంతైతే చెల్లిస్తారో అదే స్థాయిలో అదే ఆర్ధిక సంవత్సరంలో రుణం పొందేందుకు కేంద్రం అనుమతిస్తుంది . మరి తెలంగాణా చెల్లించిన రుణాన్ని బాబు తన ప్రభుత్వ ఖాతాలో చెల్లించినట్టు చూపి మోసం చేస్తే తెలంగాణా ఏమీ చెల్లించనట్లు కేంద్రం లెక్కల్లో నమోదు కావాలి . ఆ మేర తెలంగాణాకు రుణ సామర్ధ్యం కల్పించకూడదు .
మరి తెలంగాణా గత ఐదేళ్లు రుణ సామర్ధ్యాన్ని ఎలా పెంచుకొని అప్పులు చేసింది . తెలంగాణా రుణం చెల్లించనట్లు ఏపీ మాత్రమే చెల్లించనట్లు నమోదు అయితే రుణం చెల్లించని తెలంగాణాతో గత ఐదేళ్ల నుండి కేంద్రం సంప్రదింపులు జరపలేదా , రుణ చెల్లింపులకు డిమాండ్ చేయలేదా , లేక తెలంగాణా చెల్లించినట్టు , ఏపీ ఇరువురివి కలిపి చెల్లించనట్లు ఆయా రాష్ట్రాలు చెప్పినవే గుడ్డిగా అనుసరించి రుణ పరిమితిని నిర్ధారించాయా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది . టీడీపీ హయాంలో జరిగిన ఈ అవకతవకల పై కేంద్రం విచారణ జరిపిస్తుందా లేదో వేచి చూడాలి .
సంక్షోభంలో అవకాశాల్ని , ఇసుకలో తైలాన్ని , ఆఫ్ఘనిస్తాన్ నుండి సైతం అప్పుని పొందగలిగే బాబు అవకతవకల ఆర్ధిక చతురత ఈ ఘటన ద్వారా మరోసారి ప్రపంచానికి వెల్లడైంది . అదే సమయంలో తాను చేసిన ప్రతి తప్పుని ఎదుటి వారికి అంటగట్టే కుటిల నీతి మరోసారి ఆయన్ని నవ్వులపాలు చేసింది .
Also Read : టీడీపీ ఇక ఆంధ్రా పార్టీయే?